Cooking Non Veg | నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్ లకు చెందిన అనేక వంటకాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇంట్లో లేదా బయట ఎక్కడైనా సరే నాన్ వెజ్ వంటకాలు కనిపిస్తే నోట్లో నీళ్లూరుతుంటాయి. వీటితోపాటు చేపలు, రొయ్యల వంటి ఆహారాలను ఇష్టంగా తినే వారు కూడా ఉంటారు. అయితే బయట రెస్టారెంట్లలో తిన్నప్పుడు చికెన్, మటన్ వంటివి ఎంతో మెత్తగా ఉంటాయి. కానీ ఇంట్లో మాత్రం వీటిని వండితే అంత మెత్తగా ఉండవు. నాన్ వెజ్‌కు చెందిన ముక్కలు ఎంత మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి. చేపలు, రొయ్యలు వంటి వాటిని ఎక్కువగా ఉడికించాల్సిన పనిలేదు. కానీ చికెన్, మటన్‌లను మాత్రం ఎక్కువ సేపు ఉడికించాల్సి ఉంటుంది. అయినప్పటికీ అవి కొన్ని సందర్భాల్లో త్వరగా ఉడకవు. అయితే ఇలాంటి సమయంలో ఏం చేయాలి.. నాన్ వెజ్ వంటకాలు త్వరగా ఉడికేందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది చికెన్ లేదా మటన్‌ను తమకు నచ్చిన స్టైల్లో వండుతారు. ఎలా వండినా, ఎంత రుచిగా ఉన్నా ముక్కలు మెత్తగా ఉంటేనే తినాలనిపిస్తుంది. ఇందుకు గాను కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. చికెన్, మటన్ త్వరగా ఉడకాలంటే వాటిని కట్ చేసిన విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. కొందరు దుకాణదారులు కట్ చేసిన చికెన్ లేదా మటన్‌ను వండితే సుతిమెత్తగా ఉడుకుతాయి. కానీ కొన్ని అలా ఉండవు. కనుక చికెన్ లేదా మటన్‌ను కట్ చేసే విధానంపై కూడా వాటి మెత్తదనం, టేస్ట్ ఆధార పడి ఉంటాయి. మీకు చికెన్ లేదా మటన్‌ను ఇచ్చే దుకాణదారులు ఎలా కట్ చేస్తున్నారో చూడండి. దీంతో మీకు ఆ ముక్కలు ఎలా ఉడుకుతాయి అన్న అంశంపై అవగాహన వస్తుంది. అలాగే నాన్ వెజ్ వంటకాలను మారినేట్ చేయడం వల్ల వాటి మాంసం చాలా మృదువుగా మారుతుంది. అలాంటి మాంసం చాలా సులభంగా, త్వరగా ఉడుకుతుంది. పైగా టేస్టీగా కూడా ఉంటుంది. మారినేషన్కు వాడే పదార్థాల వల్ల మాంసం మెత్తగా మారి త్వరగా ఉడుకుతుంది. చికెన్ ను కనీసం 1 గంట పాటు, మటన్‌ను కనీసం 2 గంటల పాటు మారినేట్ చేసేలా చూడండి. దీంతో మెత్తని మాంసాన్ని ఆస్వాదించవచ్చు.
నాన్ వెజ్‌ను మారినేట్ చేసేందుకు గాను పెరుగు, మజ్జిగ, వెనిగర్, నిమ్మరసం వంటివి వాడవచ్చు. వీటిల్లో ఉండే యాసిడ్లు మాంసాన్ని మెత్తగా మారుస్తాయి. దీంతో మాంసం మెత్తగా ఉడుకుతుంది. మాంసం ఉడికేటప్పుడు అందులో పచ్చి బొప్పాయి, కివి, పైనాపిల్ వంటి వాటిని ముక్కలుగా కట్ చేసి వేయాలి. దీని వల్ల మాంసంలో ఉండే ప్రోటీన్లు సులభంగా విచ్ఛిన్నం అవుతాయి. అప్పుడు మాంసం త్వరగా ఉడుకుతుంది. అయితే వీటిని వేసిన తరువాత మాంసం ఉడకగానే వెంటనే ఆ ముక్కలను తీసేయాలి. లేదంటే మాంసం రుచి మారిపోతుంది. ఇక కొందరు వేపుడు వంటివి చేసేటప్పుడు మూతపెట్టకుండా నేరుగా వంట చేస్తారు. అలా చేయకూడదు. ముందుగా ముక్కలు బాగా ఉడికిన తరువాత వాటిని వేయించాల్సి ఉంటుంది. దీంతో ముక్కలు మెత్తగా ఉంటాయి. టేస్టీగా మారుతాయి.
సన్నని మంటపై పాత్రను ఉంచి దానిపై మూత పెట్టి మాంసాన్ని ఉడికించడం వల్ల కూడా మాంసం సుతిమెత్తగా మారుతుంది. మూత పెట్టి ఉడికించడం వల్ల ఆవిరి బయటకు పోదు. దీని వల్ల మాంసం త్వరగా ఉడుకుతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఓవెన్ ఉంటే మాంసం చిదురు కాకుండా తగినంత ఉష్ణోగ్రతకు ఓవెన్ ను సెట్ చేసి మాంసాన్ని ఉడికించవచ్చు. దీని వల్ల కూడా మాంసం మెత్తగా మారుతుంది. అయితే సాధారణంగా చికెన్ త్వరగానే ఉడుకుతుంది. కానీ మటన్‌ను ఉడికించాలంటే చాలా బాగా కష్టపడాల్సి ఉంటుంది. అందువల్ల మటన్‌ను కొనేటప్పుడే లేత మటన్ ను ఎంచుకుంటే మంచిది. దీని వల్ల మటన్ త్వరగా ఉడకడమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది. సులభంగా మారినేట్ అవుతుంది. హోటల్స్‌లో భారీ ఎత్తున పాత్రలను పెట్టి పెద్ద మంటతో ఉడికిస్తారు కనుక సహజంగానే మాంసం త్వరగా ఉడుకుతుంది. కానీ ఇళ్లలో వండితే మాత్రం మాంసం త్వరగా ఉడకాలన్నా, మెత్తగా మారాలన్నా ఆయా చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.