మా పాపకు పుట్టిన రోజే జాండిస్ ఉంది. చికిత్స చేయించాం. మూడు వారాలు గడిచినా తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కొన్ని పరీక్షలు చేశారు. థైరాయిడ్ సమస్య ఉందని నిర్ధారించారు. పాపకు జీవితాంతం థైరాయిడ్ మందు వాడాలని చెప్పారు. నెల వయసు బిడ్డకు థైరాయిడ్ సమస్య వస్తుందా? జీవితాంతం మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
మీరు చెప్పినదాన్ని బట్టి మీ బిడ్డకు పుట్టుకతోనే థైరాయిడ్ హార్మోన్లో లోపం ఉంది. దీనిని హైపోథైరాయిడిజం అంటారు. వెయ్యి మంది శిశువుల్లో ఒకరు ఈ సమస్య బారినపడుతుంటారు. థైరాయిడ్ సమస్యను తొందరగా గుర్తించిన వైద్యుడిని అభినందించాలి. కామెర్ల వ్యాధి రెండు, మూడు వారాలు గడిచినా తగ్గనప్పుడు.. అది పుట్టుకతో సాధారణంగా వచ్చిన కామెర్ల వ్యాధా? లేక వేరే ఇబ్బందులు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు పరీక్షలు చేస్తారు. వాటిలో ముఖ్యమైంది థైరాయిడ్ పరీక్ష. హైపోథైరాయిడిజంతో బాధపడే పిల్లల్లో థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉండటం వల్ల శారీరక, మానసిక ఎదుగుదల పూర్తిగా జరగదు. కాబట్టి భవిష్యత్లో మీ బిడ్డకు ఇబ్బందులు రావొచ్చు. కానీ, సకాలంలో వైద్యుడు ఆ సమస్యను గుర్తించడం, సరైన చికిత్స జరగడం వల్ల మీ బిడ్డకు శారీరక, మానసిక వైకల్యం కలగదు. ఈ సమస్య జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ మందులు వాడుతూ ఉండాలి. శరీరంలో ఉండాల్సిన హార్మోన్ లేకపోవడం వల్ల దానిని మందుల రూపంలో అందిస్తున్నారు. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.