జలుబు, దగ్గు, ఒంటి నొప్పులుప్రస్తుతం ఎవరిని పలకరించినా ఇదే చెబుతున్నారు. మొన్నటి వరకు అంటే వానలు కురవడం, వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం వచ్చాయనుకున్నారు. వానలు తగ్గినా, మందులు వాడినా పట్టిన జలుబు వదలడం లేదు. వచ్చిన దగ్గు పోవడం లేదు. చాలామంది ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో సతమత మవుతున్నారు. ‘ఇదేం మాయ రోగమో’ అని ఉసూరుమంటున్నారు. ఏమైందో అర్ధం కాక జనాలు దవాఖానలకు క్యూ కడుతున్నారు.అయితే ప్రస్తుతం వైరల్ ఫీవర్లు వస్తున్నప్పటికీ అవి ఏ రకమైన వైరస్లు? ఎందుకు దీర్ఘకాలంగా పట్టి పీడిస్తున్నాయి? వీటికి ఎలాంటి చికిత్స అవసరం? తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
ఇటీవల ఏ నలుగురిని పలకరించినా ఒకరో ఇద్దరో జ్వర బాధితులమని చెబుతున్నారు. జ్వరం తగ్గినా కీళ్ల నొప్పులతో సతమతమవుతూనే ఉన్నారు. ఎన్ని మందులు వాడినా ఆ పూట కొంత ఉపశమనం కలుగుతోంది. ఆ తర్వాతి రోజు పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని వాపోతున్నారు. వర్షకాలంలో ఇలా సీజనల్ వ్యాధులు రావడం సాధారణమే. అందులో ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా (జలుబు, దగ్గు, జ్వరం) దోమల కారణంగా డెంగి, చికున్ గున్యా, మలేరియా వంటి విషజ్వరాలు రావడం కూడా సర్వసాధారణమే. కానీ, ఈ సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా జ్వరాలు వారాల తరబడి బాధపెడుతున్నాయి. కొందరు జ్వరంతో ఇబ్బందిపడుతుంటే మరికొందరు నెలల పాటు జలుబు, దగ్గు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులతో సతమతమవుతున్నారు.
వర్షకాలం, చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం సహజం. అయితే సీజన్లో ఎక్కువగా ఇన్ఫ్లుయెంజా వైరస్ ప్రభావం చూపుతుంది. ఇందులో చాలారకాల వైరస్లు ఉంటాయి. ప్రస్తుతం ఇన్ఫ్లుయెంజా-ఎ, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్లు విజృంభిస్తున్నాయి. అత్యధిక మంది రోగులు ఈ వైరస్ల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రెస్పిరేటరి సిన్సిషియల్ వైరస్ వల్ల రెండు మూడు వారాల పాటు జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో బాధపడుతుంటారు. ఇవి తీవ్రమై ఎక్కువ రోజులు పీడించినట్లయితే.. డెంగీ వంటి విషజ్వరాలు సోకాయని రోగులు భయపడుతున్నారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు సొంత వైద్యం తీసుకోకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. వైద్యుల సూచన మేరకే మందులు వాడాలి.
మ్యుటేషన్ల వల్లే ఎక్కువ రోజులు..
వైరస్లు రూపాంతరం చెంది, కొత్త మ్యుటేషన్లు ఏర్పడటం వల్ల వ్యాధి లక్షణాలు ఎక్కువ కాలం రోగులను పీడిస్తున్నాయి. వైరస్‌లలోని జన్యువులలో మ్యుటేషన్లు జరగడం వల్ల వైరస్లు రూపాంతరం చెందుతాయి. కొన్ని మ్యుటేషన్ల వల్ల ఆ వైరస్లు బలహీన పడతాయి. వీటి వ్యాప్తి అధికంగా ఉన్నా.. రోగులపై ఎక్కువగా ప్రభావం చూపదు. కొన్ని మ్యుటేషన్ల వల్ల వైరస్లు బలపడతాయి. వీటి వ్యాప్తి తక్కువగా ఉన్నా రోగ తీవ్రత మాత్రం అధికంగా ఉంటుంది. కోవిడ్ 19 నాటి పరిస్థితులను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. కరోనా ఫస్ట్‌వేవ్ కంటే సెంకడ్ వేవ్‌లో వచ్చిన మ్యుటేషన్స్ వల్ల వైరస్ బలపడింది. ఫలితంగా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మంది దాని బారినపడ్డారు.
అదే థర్డ్‌వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్లో కోవిడ్ మెదటి, రెండో వేవ్ కన్నా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. కానీ, ప్రభావ తీవ్రత తక్కువగా కనిపించింది. దానివల్ల రోగులు దవాఖానలో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకున్నారు. చాలామందికి వైరస్ సోకినట్లు కూడా తెలియదు. వాళ్లలో ఆ వైరస్ అసింప్టమ్యాటిక్గా (లక్షణాలు బయటపడకుండా) వచ్చిపోయింది. ఇలాంటి మ్యుటేషన్స్ వల్ల ఏర్పడిన ఇన్ఫ్లుయెంజా-ఎ, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్లు కొంత బలపడతాయి కూడా. ఇలాంటి మ్యుటేషన్ల వల్ల ఏర్పడ్డ వైరస్లు తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి సోకితే జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు తీవ్రంగా ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువ రోజులు పీడిస్తాయి.
స్వైన్‌ఫ్లూతో సమానం
ఇన్ఫ్లుయెంజా-ఎ అనేది ఒక రకంగా చెప్పాలంటే స్వైన్‌ఫ్లూ వైరస్. దీని వ్యాప్తి రేటు అధికంగా ఉంటుంది. ఇది ఒకరి నుంచి మరొక్కరికి చాలా వేగంగా విస్తరిస్తుంది. ఇన్ఫెక్టెడ్ రోగి తుమ్మినప్పుడు గానీ, దగ్గినప్పుడు గానీ ఆ వ్యక్తి నోటి తుంపర్ల నుంచి వచ్చే వైరస్ ఎక్కువ దూరం వ్యాప్తి చెందుతుంది. దీంతో ఒకరి నుంచి మరొకరికి సులభంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. వర్షకాలంలో వాతావరణం తేమగా ఉండటం వల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు గాలి ద్వారా ఎక్కువ దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీంతో ఒక ఇంట్లో వైరల్ జ్వరాలు వచ్చాయంటే వెంట వెంటనే పొరుగిళ్లలోని వారికి కూడా సోకుతాయి. ఇన్‌ప్లుయెంజా ప్రభావం వానాకాలంలో అధికంగా ఉంటుంది. ఈ వైరస్ సోకితే గతంలో మందులు వాడితే రెండు మూడు రోజుల్లోనే ఉపశమనం కలిగేది. కానీ, ఈ వైరస్‌లో వచ్చిన మ్యుటేషన్ల కారణంగా మందులు వాడినా మూడు నాలుగు వారాలపాటు లక్షణాలు తగ్గడం లేదు.
రెండోసారి దాడి..
వైరస్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు రోగిలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోయి బ్యాక్టీరియా బారిన పడుతున్నారు. ఈ విధంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కు గురికావడాన్ని సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. దీనివల్ల రోగి ఎక్కువ రోజుల పాటు జలుబు, దగ్గు, నీరసం తదితర సమస్యలకు గురవుతాడు. షుగర్, బీపీ, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ఈ వైరస్లు, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ప్రభావం చూపుతాయి. సాధారణ రోగుల కంటే వీరు కొంత ఎక్కువ కాలం వ్యాధికి గురయ్యే అవకాశాలుంటాయి.
నిర్ధారణ పద్ధతులు
సాధ్యమైనంత వరకు అనుభవజ్ఞులైన వైద్యులు రోగిలో ఉన్న లక్షణాల ఆధారంగా వ్యాధి లేదా వైరస్‌ను అంచనా వేస్తారు. కచ్చితంగా తెలుసుకోవాలంటే బ్లడ్ కల్చర్ టెస్ట్, యూరిన్ కల్చర్ పరీక్షలు జరిపి వచ్చిన వైరస్‌తో పాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను కూడా నిర్ధారించవచ్చు.
అందుబాటులో ఉన్న చికిత్స
సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటి బయాటిక్ మందులు వాడనవసరం లేదు. కొన్ని సందర్భాలలో మాత్రమే వీటిని వాడాలి. వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత సెంకడరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాం ఉంది. దీని బారినపడితే వైద్యుల సూచనలతో యాంటి బయాటిక్ మందులను నిర్ణీత మోతాదులో, నిర్దేశిత కాలం వాడాలి. ఎలా పడితే అలా, ఏవి పడితే అవి వాడితే ఆరోగ్యానికి హానికరం. కొన్ని సందర్భాలలో తీవ్రమైన దగ్గు, ఊపిరితిత్తుల్లో గాలి మార్గాలు మూసుకుపోయినప్పుడు తేలికపాటి స్టిరాయిడ్స్ వాడాల్సి వస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలం పాటు తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడితే పెయిన్ కిల్లర్స్ సైతం తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ మందులన్నీ అనుభవజ్ఞులైన వైద్యుల సూచన మేరకే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా యాంటి బయోటిక్ మందులు వాడకూడదు.
లక్షణాలు
…?మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్ రాజారావు
సూపరింటెండెంట్
ప్రభుత్వ జిల్లా దవాఖాన
యాదాద్రి భువనగిరి