Cold And Cough Remedies | సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే మనకు దగ్గు, జలుబు వస్తుంటాయి. ఇవి ఒక పట్టాన తగ్గవు. ఇక ఇప్పుడు శీతాకాలం మొదలవబోతోంది. దీంతో చాలా మందికి ఇప్పటికే ఈ సమస్యలు వచ్చాయి. చలి ఇంకా ఎక్కువైతే దాదాపుగా ప్రతి ఒక్కరు దగ్గు, జలుబుతో బాధపడుతారు. అయితే ఈ సీజన్లో ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవాల్సి ఉంటుంది. దీంతో సీజనల్ వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఇక ఇప్పటికే ఈ వ్యాధులు వచ్చిన వారు కూడా పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. దీంతో దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటంటే..
దగ్గు, జలుబును తగ్గించడంలో తేనె, నిమ్మరసం ఎంతో చక్కగా పనిచేస్తాయి. వీటిని తీసుకుంటే దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. తేనెలో సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల గొంతు సమస్యల నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. ఇక నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. అందువల్ల ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇది దగ్గు, జలుబుకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. దీంతోపాటు ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. పలు రకాల మసాలా దినుసులు వేసి తయారు చేసే కషాయం కూడా ఈ సీజన్లో బాగానే పనిచేస్తుంది. దీన్ని రోజూ ఒక కప్పు తాగితే చాలు దగ్గు, జలుబు, గొంతు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
రాత్రి పూట పాలలో పసుపు కలిపి తాగాలి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. అందుకనే పసుపు కలిపిన పాలను గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారు. రాత్రిపూట ఇలా పాలలో పసుపు కలిపి తాగుతుంటే దగ్గు, జలుబు నుంచి త్వరగా బయట పడవచ్చు.
ఉప్పు నీటిని గొంతులో పోసుకుని పుక్కిలిస్తున్నా కూడా శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బాక్టీరియా, వైరస్‌లను నాశనం చేయడంలో ఉప్పు చక్కగా పనిచేస్తుంది. అలాగే యూకలిప్టస్ ఆయిల్ కలిపిన నీళ్లను ఆవిరి పడుతుండాలి. ఇలా చేస్తున్నా కూడా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు ఊపిరితిత్తుల్లో ఉండే కఫం మొత్తం పోతుంది. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు.