ఈ రోజుల్లో డిజిటల్ స్క్రీన్‌పై దృష్టి సారించడం పెరిగిపోయింది. పెద్దలే కాదు పిల్లలు కూడా ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ చూసే సమయం ఎక్కువ అవుతున్నది. ఇలా అధిక సమయం స్క్రీన్ చూడటం వల్ల మెడ పట్టేసినట్టుగా ఉండటం అందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవమే. తదేకంగా స్క్రీన్ చూస్తూ ఉన్నప్పుడు కండరాల్లో, వెన్నెముకలో కదలిక ఉండదు. ఎక్కువ సమయం కదలిక లేకపోవడంతోపాటు వెన్నెముకపై అధిక బరువు పడుతుంది. అలాగే కండరాలు, లిగమెంట్స్ (ఎముకకు, కండరాలను కలిపి ఉంచేది)పై కూడా అధిక ఒత్తిడి పడుతుంది. రోజులో రెండు నుంచి నాలుగు గంటలు ఇలా స్క్రీన్ చూస్తూ ఉంటే ఏడాదిలో ఏడు వందల నుంచి పన్నెండు వందల గంటలు ఒకే భంగిమలో జీవితం గడిచిపోతుంది. కూర్చుని లేదా నిలుచుని స్క్రీన్ చూసేటప్పుడు ముఖం ముందుకు ఉంటుంది. మెడలో ఉన్న వెన్నెముక సాధారణంగా నాలుగు నుంచి అయిదు కేజీల బరువు మాత్రమే మోయగలదు. ఫోన్ చూస్తున్నప్పుడు తలను 15 నుంచి 60 డిగ్రీల్లో వాల్చితే వెన్నుపూసపై అధిక బరువు పడుతుంది. అప్పుడు టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ వస్తుంది.
మెడను ముందుకు వాల్చడం వల్ల వెన్నుపూసపై, దాని లిగమెంట్స్, మెడ కండరాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇలా ఎక్కువ కాలం ఒత్తిడికి గురవడం వల్ల పిల్లలకు పిడియాట్రిక్ టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ వస్తుంది. ఈ సమస్య ఉన్న పిల్లల్లో మెడనొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, మెడ పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి పెద్దయ్యాక వెన్నునొప్పికి దారితీయొచ్చు. మంచి భంగిమలో కూర్చున్నప్పుడు వెన్నెముక బాడీకి సపోర్ట్‌గా ఉంటుంది. కండరాలు, లిగమెంట్స్పై ఒత్తిడి లేకపోవడం వల్ల కండరాల కదలికలు సరిగా ఉంటాయి. పనులపై మనసు లగ్నమవుతుంది. మంచి భంగిమలో కూర్చోకపోతే వెన్నుపూస, కండరాల నొప్పులు వేధిస్తాయి. ఇంతకుముందు పిల్లలు స్కూల్ బ్యాగ్‌ని సరిగా వేసుకోకపోవడం వల్ల మెడ నొప్పితో బాధపడేవాళ్లు. డిజిటల్ ఏజ్‌లో ఫోన్లు, కంప్యూటర్ల వల్ల బాధపడుతున్నారు. వీలైనంత వరకు పిల్లలకు స్క్రీన్ టైమ్ తగ్గించాలి. స్కూల్ బ్యాగ్ సరిగా వేసుకునేలా జాగ్రత్తపడాలి.