Chickpeas | మన శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం. ఎప్పుడైతే పోషకాలు సక్రమంగా అందుతాయో మనం ఆరోగ్యంగా ఉంటాం. మనలో చాలా మంది ఏదైనా అరోగ్య సమస్యకు గురవగానే బలం కోసం బాదం, పిస్తా తింటుంటారు. కేజీ బాదం ఖరీదు దాదాపుగా రూ.800 ఉంటుంది. కేవలం గొప్పవారికి మాత్రమే బాదం పప్పు అందుబాటులో ఉండి.. పేదలకు అందని ద్రాక్షలా తయారైంది. బాదం, పిస్తాలు తింటేనే పోషకాహార లోపం తగ్గి బలం చేకూరుతుందా? అంటే కాదనే చెప్పాలి. బాదం కంటే దీటుగా పోషకాలు కలిగి ఉన్న ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో శనగలు ఒకటి. నాన్‌వెజ్‌తో సమానమైన పోషకాలు శనగల్లో ఉంటాయని చెప్తుంటారు పోషకాహార నిపుణులు.
ఫాబేసి కుటుంబానికి చెందిన శనగ పప్పులో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. శనగల్లో నాటీ శనగలు, కాబూలీ శనగలు కూడా ఉంటాయి. కొన్ని తెల్లగా ఉంటే.. మరికొన్ని ఆకుపచ్చగా.. ఇంకొన్ని డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. కొన్ని శనగలు నానబెట్టి మొలకలు వచ్చాక పచ్చివి తిన్నా, వేయించుకుని, ఉడికించుకుని తిన్నా ఆరోగ్యకరం. శనగల చాట్ అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. శనగల్లో కాల్షియం, విటమిన్ ఏ, బీ, సీ, ఈ, కే, ఫాలేట్, మెగ్నిషియం, ఫాస్పరస్, సెలీనియం, ఫైబర్, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతుంది. కాల్షియం లోపంతో బాధపడేవారికి శనగలు మంచి ఆహారం.
శనగలను ఆహారంగా తీసుకోవడం వలన ఐరన్, ప్రొటీన్, మినరల్స్ శరీరానికి ఎనర్జీని అందించి అలసట, నీరసం, నిస్సత్తువ వంటి వాటిని తగ్గిస్తుంది. శనగల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండి వలన జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. రక్తంలో చెడు కొలస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. తద్వారా అధిక బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది. శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేసి ఆస్టియోపోరోసిస్, అనీమియాతో బాధపడుతున్నవారికి సూపర్ ఫుడ్. గట్ హెల్త్‌ను మెరుగయ్యేలా తోడ్పడుతుంది.
మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు
శనగలల్లో పుష్కలంగా ఉండే పీచు మలబద్దకాన్ని వదిలించి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది.
మధుమేహులు రోజూ గుప్పెడు నానబెట్టిన శనగలు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
శనగల్లో ఉండే పీచు శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది.
శనగల్లో ఉండే అమైనో యాసిడ్స్ రక్తకణాల ఎదుగుదల, ప్రసారానికి దోహదపడతాయి.
శనగలను తరచూ తింటుంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.
నిద్రలేమి సమస్యలు ఉన్నవారు నిత్యం తినడం చాలా ఉపయోగకరం.
శనగల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది
శనగల్లోని ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి.
శనగల్లో ఉండే విటమిన్ బీ9 లేదా ఫోలేట్.. మెదడు, కండరాల అభివృద్ధికి దోహదపడతాయి.