శీతకాలంలో శరీరం, మనసు రెండూ బద్ధకంగానే ఉంటాయి. కూర్చున్న దగ్గరినుంచి లేవబుద్ధికాదు. వ్యాయామం వాయిదాపడుతుంది. దీంతో చాలామంది బరువు పెరుగుతుంటారు. కొందరికి ‘సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్’ ఉంటుంది. ప్రత్యేకించి చలికాలంలో ఇష్టమైన క్యారెట్ హల్వా, లడ్డూలు మొదలైనవి తరచూ తింటారు. మద్యపానం మోతాదు పెరుగుతుంది. ఊబకాయానికి ఇదీ ఓ కారణమే. ఈ రుతువులో బరువు పెరగకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు..
ఆలోచించి తినాలి
నాలుకకు నచ్చేవి కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తినాలి. ఇంట్లో తయారుచేసిన సూప్స్తోపాటు యాపిల్, కివీ, బ్లూబెర్రీ, బత్తాయి, నారింజ మొదలైన నిమ్మజాతి పండ్లను ఆరగించాలి. పాలకూర, బ్రకోలి, పుట్టగొడుగులు, కొత్తిమీర, సొరకాయలను ఆహారంలో చేర్చుకోవాలి.
ఏదో ఓ కసరత్తు
కఠిన వ్యాయామాలు చేయకపోయినా ఫర్వాలేదు.. కచ్చితంగా శారీరక శ్రమ ఉండాలి. శరీరానికి వెచ్చదనాన్నిచ్చే దుస్తులతో వాకింగ్, రన్నింగ్‌కు వెళ్లొచ్చు. ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థను కలిగిన స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత కొట్టవచ్చు.
ధ్యానం సర్వౌషధం
బద్ధకంగా ఉన్నప్పుడు ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేం. చిన్నచిన్న విషయాలకే చికాకుగా అనిపించవచ్చు. మనసును, శరీరాన్ని, ఆత్మను ఉత్సాహపరిచేందుకు ధ్యానం తప్పనిసరి.
నీళ్లు తాగాల్సిందే
మద్యపానం తీసుకోకూడదు. అలాగే వాతావరణం ఎంత చల్లగా ఉన్నా, గోరువెచ్చని నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలి. రోజుకు నాలుగైదు లీటర్ల నీళ్లు తప్పక తాగాలి.