Cardamom Water Benefits | యాలకులను మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. మసాలా కూరలతోపాటు స్వీట్ల తయారీలోనూ యాలకులను వేస్తుంటారు. కొందరు యాలకులను నేరుగానే తింటుంటారు. యాలకులు చక్కని సువాసనను అందిస్తాయి. కనుక స్వీట్లలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే కొందరు యాలకులను టీలో వేసి మరిగించి తాగుతారు. అయితే ఆయుర్వేద ప్రకారం వాస్తవానికి యాలకుల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. యాలకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ముఖ్యంగా యాలకులను నీటిలో వేసి మరిగించి కషాయంలా రోజూ తాగుతుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పలు వ్యాధులు నయం అవుతాయి.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో యాలకులు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. యాలకుల నీళ్లను తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. దీంతోపాటు గ్యాస్, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలకులలో ఉండే సమ్మేళనాలు బైల్ యాసిడ్స్‌ను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడతాయి. దీని వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. శరీరం కూడా ఆహారంలో ఉండే పోషకాలను సులభంగా శోషించుకుంటుంది. యాలకుల నీళ్లను భోజనం చేసేందుకు ముందు తాగితే మంచిది. దీంతో జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.
యాలకులు చక్కని వాసన వస్తాయి. అందువల్ల యాలకుల నీళ్లను నోట్లో పోసుకుని పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ పానీయాన్ని మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. యాలకుల నీళ్లలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీని వల్ల నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గిపోతుంది. అలాగే దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. యాలకుల నీళ్లను తాగున్నా కూడా నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. నోరు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుంది.
యాలకుల్లో థర్మోజెనిక్ గుణాలు ఉంటాయి. ఇవి శరీర మెటబాలిజంను పెంచుతాయి. అందువల్ల యాలకుల నీళ్లను రోజూ తాగితే శరీర మెటబాలిజం పెరిగి క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్నవారికి యాలకుల నీళ్లు ఎంతగానో మేలు చేస్తాయి.
యాలకుల నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాలకుల నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో తీవ్రమైన వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. యాలకుల నీటిలో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి యాలకులు ఒక వరమనే చెప్పవచ్చు.
యాలకుల నీటిలో డైయురెటిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల మూత్రం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో టాక్సిన్లు త్వరగా బయటకు పోతాయి. కిడ్నీలు, మూత్రాశయం ఆరోగ్యంగా ఉంటాయి. యాలకుల నీటిని తాగితే డిటాక్సిఫయింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు పోతాయి. చర్మం క్లియర్‌గా మారుతుంది. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. ఇలా యాలకుల నీటితో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఈ నీళ్లను రోజూ తాగాలి.