క్యాన్సర్.. ఆ మాటే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మనిషికి మొదటిసారిగా బతుకు పోరాటం అంటే ఏమిటో రుచి చూపిస్తుంది. రుగ్మతను ఎదుర్కోవడమే కాదు, మహమ్మారిని వదిలించుకోవడానికి జరిగే వైద్యమూ అంతే క్లిష్టంగా ఉంటుంది. కానీ, ఒకప్పటితో పోలిస్తే చాలా మార్పు వచ్చింది. క్యాన్సర్‌ను జయించి పునర్జన్మను పొందిన ధీరులూ చాలామంది ఉన్నారు. వైద్య నిపుణుల సాయంతో, సాంకేతికత సహకారంతో, అన్నిటికీ మించి బతికితీరాలన్న బలమైన ఆకాంక్షతో.. మహమ్మారిపై మనిషి పైచేయి సాధించిన సందర్భం ఇది. ఆ విజయాలను సెలబ్రేట్ చేసుకునేందుకూ ఓ రోజు ఉంది. అదే క్యాన్సర్ సర్వైవర్స్ డే… జూన్ 4.
క్యాన్సర్ చాలా భిన్నమైన రుగ్మత. తొలి దశల్లో నొప్పి తెలియదు. దీంతో ఓ పట్టాన వ్యాధి లక్షణాలు అర్థం కావు. అయితే, ఆధునిక సాంకేతికత పరుగులు పెడుతున్న ఈ శకంలో చికిత్సా విధానంలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు.. క్యాన్సర్ అయినా ఉండాలి, రోగి అయినా ఉండాలి అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు చాలా వరకు మారిపోయింది. బీపీ, షుగర్‌లా దీర్ఘకాలిక వ్యాధి కింద లెక్కగట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. క్యాన్సర్ గుర్తింపు నుంచి కీమోథెరపీ, మందుల దాకా ఎన్నో మార్పులు వచ్చాయి. రోగికి సైడ్ ఎఫెక్ట్స్ బాధ తప్పుతున్నది. కీమోథెరపీలో లక్షిత కణాల్ని కచ్చితంగా గుర్తించగలుగుతున్నాం. దీనివల్ల దుష్ప్రభావాలు నామమాత్రం అయ్యాయి. తక్కువ కోతలతోనే సర్జరీలు పూర్తి అవుతున్నాయి. దీనివల్ల ఇతర అవయవాల పనితీరును కాపాడవచ్చు.
ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీ, రోబోటిక్ సర్జరీలాంటి ఆధునిక విధానాలు దీనికి ఎంతో తోడ్పడుతున్నాయి. తక్కువ కోత, కుట్ల వల్ల చికిత్స తర్వాత రోగి త్వరగా కోలుకోగలుగుతాడు. అలాగే మత్తు ఇచ్చే విధానాల్లో మార్పులు, నొప్పులు తగ్గేందుకు సిఫారసు చేసే మందుల్లాంటివీ రోగి తన కాళ్ల మీద తాను నిలబడేందుకు దోహదం చేస్తున్నాయి. రేడియో థెరపీ కూడా తక్కువ చికిత్సతో ఎక్కువ ఫలితాలను అందిస్తున్నది. అలాగే సరికొత్త ఇమేజింగ్ టెక్నిక్లూ క్యాన్సర్ స్థానాన్ని, స్థాయిని కచ్చితంగా గుర్తించి ట్రీట్మెంట్ అందించేందుకు ఉపకరిస్తున్నాయి.
చికిత్సలు జరుగుతున్నప్పుడూ, తర్వాతా పేషెంట్ల మానసిక స్థితి ఎలా ఉందన్నదీ ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. దానివల్ల వాళ్లు సంతోషంగా నాణ్యమైన జీవితాన్ని గడపగలుగుతారు. అందుకోసం పేషెంట్లతో పాటు వాళ్ల బాగోగులు చూసుకునే బంధువులనూ భాగం చేస్తూ రకరకాల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు నడుస్తున్నాయి. ఇలాంటి ప్రత్యేక దినాల సందర్భంగా క్యాన్సర్ మీద పోరాడుతున్న వారికోసం నిర్వహించే పోటీలు, కార్యక్రమాలు వారిని మానసికంగా ఉల్లాసంగా ఉంచుతాయి. అథ్లెట్లు, సినిమా స్టార్లు, క్రికెటర్లు… క్యాన్సర్‌ని జయించినట్టు రోజూ పేపర్లలో ప్రచురితమయ్యే కథనాలనుంచి.. దీంతో పోరాడుతున్న వాళ్లు స్ఫూర్తి పొంది, రేపటి కోసం అందమైన ప్రణాళిక వేసుకోవాలి. జీవితానికి ఎన్ని సంవత్సరాలను ఇవ్వగలిగాం అన్నదానితో పాటు.. గడిపే రోజుల్లో ఎంత జీవాన్ని నింపగలిగాం.. ఎంత నాణ్యతగా జీవించాం అన్నదీ తప్పక
ఆలోచించాలి. క్యాన్సర్ మీద పరిపూర్ణ అవగాహనతోనే అది సాధ్యం అవుతుంది.
– డా॥ ఎన్. గీతానాగశ్రీ అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కేర్ క్యాన్సర్ సెంటర్ గచ్చిబౌలి, హైదరాబాద్.