మహిళల్లో అత్యధికంగా కనిపించేది.. బ్రెస్ట్ క్యాన్సర్. అయితే కొద్దిశాతం మహిళలు బైలేటరల్ క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో రెండు రొమ్ముల్లోనూ వేర్వేరుగా క్యాన్సర్ కణుతులు పెరుగుతాయి. రెండూ వేర్వేరు దశల్లో ఉంటాయి. రెండిటికీ విభిన్న చికిత్సలు అవసరం అవుతాయి. ఈ రకం క్యాన్సర్లలో సింక్రనస్, మెటాక్రోనస్ ప్రధానమైనవి. సింక్రనస్ తరహా క్యాన్సర్లో మూడు నెలల నుంచి 12 నెలల వ్యవధిలో ఒక వైపు లేదా రెండు వైపులా కణితి ఏర్పడుతుంది.
పరీక్షల ద్వారా తొలి దశలోనే దీన్ని గుర్తించవచ్చు. మెటాక్రోనస్ రకంలో మొదటి వైపు వృద్ధిచెందిన ఏడాది తర్వాత రెండో రొమ్ములో కణితి పెరుగుతుంది. అయితే దీన్ని శరీరంలోని ఇతర భాగాలకూ విస్తరించే స్వభావం ఉన్న మెటాస్టాటిక్ క్యాన్సర్ లాంటిదని చెప్పలేం. బైలేటరల్ క్యాన్సర్లలో సింక్రనస్ రకం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నవారు నూటికి 1 నుంచి 2 శాతం మంది. రెండోరకం క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉన్నవారు 5 నుంచి 6 శాతం. అయితే, ఈ రకం క్యాన్సర్లు చిన్న వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పసిగట్టండిలా…
సాధారణ రొమ్ము క్యాన్సర్ లక్షణాలన్నీ బైలేటరల్ క్యాన్సర్లోనూ ఉంటాయి. నిర్ధారణ పరీక్షలు జాగ్రత్తగా నిర్వహిస్తేనే రుగ్మత మూలాలు తెలుస్తాయి. మెటాస్టాటిక్ క్యాన్సర్కు, బైలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్కూ మధ్య తేడాను పరిశీలించడానికి పెట్ స్కాన్ ఉపయోగపడుతుంది. జన్యుపరమైన కారణాలతోపాటు స్థూలకాయం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల కూడా బైలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్లు రావచ్చు. ఈ రకం క్యాన్సర్లు రొమ్ము గ్రంథుల నుంచి పుడతాయి. క్యాన్సర్ తరహా చికిత్సతోనే వీటినీ నిర్మూలించవచ్చు. తొలి దశల్లోనే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తే కచ్చితమైన నిర్ధారణ సాధ్యం. అప్పుడు సర్జరీ, కీమోథెరపీలాంటి వైద్య విధానాలతో
రోగిని బతికించుకోవచ్చు.