Soya Foods | పాలకు చెందిన అనేక రకాల ఉత్పత్తులు మనకు అందుబాటులో ఉన్నట్లే సోయాకు చెందిన చాలా రకాల ఆహారాలు కూడా లభిస్తున్నాయి. కానీ చాలా మందికి వాటి గురించి తెలియదు. సోయా ఆహారాలు అంటే సోయా పాలు, మీల్ మేకర్ అని అనుకుంటారు. కానీ ఇవే కాదు, సోయా ఉత్పత్తులు ఇంకా అనేకం ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సోయాకు చెందిన అనేక ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. సోయా టోఫు, సోయా పాలు, సోయా సాస్ ఇలా చాలా రకాల సోయా ఉత్పత్తులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకు భిన్న రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. సోయా ఆహారాలను తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. పలు వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు. సోయా ఆహారాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి.
సోయా ఆహారాల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక నాన్ వెజ్ తినని వారికి సోయా ఆహారాలను చక్కని ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. వీటి వల్ల ప్రోటీన్లను అధిక మొత్తంలో పొందవచ్చు. వృక్ష సంబంధ ప్రోటీన్లు కావాలని కోరుకునే వారు సోయా ఆహారాలను తీసుకోవచ్చు. ఈ ఆహారాల్లో మన శరీరానికి కావల్సిన 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. వీటిని మన శరీరం తనంతట తానుగా తయారు చేసుకోలేదు. కనుక సోయా ఆహారాలను తీసుకుంటే ఆయా ఆమ్లాలను సులభంగా పొందవచ్చు. ఇవి వెజిటేరియన్లకు ఎంతో దోహదం చేస్తాయి. శరీరానికి శక్తిని అందేలా చూస్తాయి. కండరాల నిర్మాణానికి దోహదం చేస్తాయి. దీంతో కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల నొప్పులు తగ్గుతాయి. శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా పనిచేస్తారు.
సోయా ఆహారాల్లో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. పైగా వీటిల్లో ఉండే ఐసోఫ్లేవోన్స్ అనే సమ్మేళనాలు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. దీని వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. సోయా ఉత్పత్తుల్లో అధిక మొత్తంలో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకల నిర్మాణానికి సహాయం చేస్తుంది. ఎముకల సాంద్రత పెరిగేలా చేస్తుంది. దీనివల్ల ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. అధిక శాతం వరకు సోయా ఉత్పత్తుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
సోయా ఆహారాల్లో ఉండే ఐసోఫ్లేవోన్స్ యాంటీ ఆక్సిడెంట్లలా కూడా పనిచేస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. దీంతో ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. సోయా ఉత్పత్తుల్లో ఉండే ప్రోటీన్లు, ఫైబర్ కారణంగా శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా సోయా ఆహారాలను తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు. అయితే అలర్జీలు ఉన్నవారు, థైరాయిడ్, హార్మోన్ సమస్యలు ఉన్నవారు, కిడ్నీ స్టోన్లు ఉన్నవారు, గౌట్ సమస్యతో బాధపడుతున్నవారు మాత్రం సోయా ఆహారాలను తినకూడదు. లేదంటే సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ సోయా ఆహారాలను తీసుకుంటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.