Protein Bars | ఉదయం అల్పాహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరానికి రోజంతా అవసరమైన శక్తి లభించడంతోపాటు ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ప్రస్తుతం బిజీ జీవనశైలిలో త్వరగా తినేందుకు వీలుగా ప్రోటీన్ బార్లు చాలామంచి ఎంపికగా మారుతున్నాయి. ఒక్కో ప్రోటీన్ బార్లో సుమారు 25 నుంచి 30 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. అయితే వీటిని ప్రతిరోజూ అల్పాహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవడం ఎంతవరకు మంచిదో తెలుసుకోవడం ముఖ్యం. అల్పాహారంలో ప్రోటీన్ తీసుకోవడం వల్ల కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేలా చేసి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో తరచూ ఆకలి వేయడం, ఉదయం వేళల్లో తీపి పదార్థాలు లేదా అనారోగ్యకరమైన స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కూడా ప్రోటీన్‌తో కూడిన అల్పాహారం ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయం సుమారు 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం చూపిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఘ్రెలిన్, లెప్టిన్ వంటి హార్మోన్ల నియంత్రణకు ఇది సహాయపడుతుంది. ఫలితంగా ఉదయం అల్పాహారం తర్వాత ఎక్కువసేపు ఆకలి నియంత్రణలో ఉండటంతో పాటు మధ్యాహ్నానికి ముందు అనవసరంగా స్నాక్స్ తీసుకునే అవకాశం కూడా తగ్గుతుంది.
అల్పాహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. కార్బొహైడ్రేట్ల జీర్ణక్రియ, శోషణ నెమ్మదిగా జరిగేలా చేయడం ద్వారా రోజంతా స్థిరమైన శక్తిని అందించడంలో ఇది ఉపయోగపడుతుంది. రోజువారీ ప్రోటీన్‌ను మూడు ప్రధాన భోజనాల్లో సమానంగా పంచుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రోటీన్ శరీరంలోని కండరాల నిర్మాణం, నిర్వహణకు ఎంతో అవసరం. రోజంతా తగినంత ప్రోటీన్ అందడం వల్ల కండరాల ప్రోటీన్ సంశ్లేషణకు మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా శారీరకంగా చురుకుగా ఉండేవారు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవారు తమ ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవడం అవసరం. ప్రోటీన్ బార్ ద్వారా 30 గ్రాముల ప్రోటీన్ శరీరానికి అందుతుంది. అయితే అదే మొత్తంలో ప్రోటీన్‌ను పోషక విలువలు కలిగిన సమతుల్య అల్పాహారం ద్వారా తీసుకోవడం మరింత మంచిదిగా పరిగణిస్తారు. ప్రోటీన్‌తో పాటు ఫైబర్, కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోబయోటిక్స్ వంటి ఇతర పోషకాలు కూడా శరీరానికి అవసరం. ఈ పోషకాలన్నీ కలిగిన అల్పాహారం కేవలం ప్రోటీన్ బార్ కంటే మెరుగైన పోషక విలువలను అందిస్తుంది.
అయితే ప్రయాణాల్లో లేదా ఉదయం సమయం తక్కువగా ఉన్నప్పుడు ప్రోటీన్ బార్లు సౌకర్యవంతమైన ఎంపికగా ఉపయోగపడతాయి. చుట్టుపక్కల ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేని సందర్భాల్లో వీటిని తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వీటిని ప్రతిరోజూ పూర్తి భోజనానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం మంచిది కాదు. ప్రతి ప్రోటీన్ బార్ ఆరోగ్యకరమైనదే అని భావించకూడదు. కొన్ని ప్రోటీన్ బార్లలో అదనపు చక్కెర, కృత్రిమ స్వీటెనర్లు, తక్కువ ఫైబర్, అధికంగా ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉంటాయి. దీంతో బార్లో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నప్పటికీ మొత్తం పోషక విలువ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ఉత్పత్తుల్లో అధిక కేలరీలు ఉంటాయి. అందువల్ల ప్రోటీన్ బార్ కొనుగోలు చేసే ముందు దాని లేబుల్‌ను పరిశీలించడం ముఖ్యం. ఒక్కో బార్లో కనీసం 15 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ ఉండటం, అదనపు చక్కెర తక్కువగా ఉండటం, ఫైబర్ అధికంగా ఉండటం, వీలైనంత వరకు సంపూర్ణ ఆహార పదార్థాలతో తయారై ఉండటం వంటి అంశాలను గమనించాలి. అలాగే మొత్తం కేలరీల పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రోటీన్ బార్‌కు బదులుగా గుడ్లు, సంపూర్ణ ధాన్యాలతో చేసిన టోస్ట్, గ్రీక్ యోగర్ట్‌తోపాటు నట్స్, పనీర్, కూరగాయల చిల్లా, టోఫు స్క్రాంబుల్, పాలు-ఓట్స్‌తో పాటు విత్తనాలు వంటి అనేక పోషక విలువలు కలిగిన అల్పాహారాలను తీసుకోవచ్చు. ఇవి ప్రోటీన్‌తోపాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి ఇతర పోషకాలను కూడా అందిస్తాయి.
బరువు తగ్గాలని ప్రయత్నించే వారు, వయసు పెరిగిన వారు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవారు, ఉదయం అల్పాహారానికి ఎక్కువ సమయం కేటాయించలేని వారు, మధ్యాహ్నానికి ముందే ఎక్కువగా ఆకలి వేసే వారు 30 గ్రాముల ప్రోటీన్‌తో కూడిన అల్పాహారం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అయితే బరువు నియంత్రణలో ప్రోటీన్ బార్ ఒక్కటే పరిష్కారం కాదు. మొత్తం ఆహార నాణ్యత, తీసుకునే కేలరీలు, శారీరక శ్రమ వంటి అంశాలు కూడా కీలకం. ప్రోటీన్ బార్లు కొంతమేరకు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడం, పరిమిత పరిమాణంలో ఆహారం తీసుకునేలా చేయడం, అనవసరమైన తినుబండారాలపై కోరికను తగ్గించడం ద్వారా బరువు నిర్వహణకు సహాయపడతాయి. అయితే చక్కెర ఎక్కువగా ఉన్న బార్లను ఎంచుకోవడం, అవసరానికి మించి కేలరీలు తీసుకోవడం లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ప్రయోజనాలకు బదులుగా ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సమతుల్యమైన అధిక ప్రోటీన్ అల్పాహారం కోసం ప్రోటీన్‌తోపాటు ఫైబర్‌ను జోడించడం, ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం, తగినంత నీరు తాగడం, సాధ్యమైనంత వరకు సంపూర్ణ ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ప్రోటీన్ బార్లను రోజువారీ భోజనానికి ప్రత్యామ్నాయంగా కాకుండా అవసరమైనప్పుడు ఉపయోగించుకునే సౌకర్యవంతమైన ఆహారంగా చూడటం ఉత్తమం. ఉదయం సుమారు 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం శరీరానికి పలు విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఆ ప్రోటీన్‌ను ప్రోటీన్ బార్ ద్వారానే తీసుకోవాల్సిన అవసరం లేదు. పోషకాలు సమృద్ధిగా ఉన్న సమతుల్య అల్పాహారం ద్వారా ప్రోటీన్‌ను పొందడం మరింత మెరుగైన ఎంపిక. సంపూర్ణ ఆహారం అందుబాటులో లేని సందర్భాల్లో మాత్రం పోషక లేబుల్‌ను పరిశీలించి సరైన ప్రోటీన్ బార్‌ను ఎంచుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.