Thyroid Medicine | హైపోథైరాయిడిజం (Hypothyroidism) గా నిర్ధారణ అయిన చాలా మందిలో ఒక సాధారణ సందేహం ఉంటుంది. ఒకసారి థైరాయిడ్ మందులు ప్రారంభిస్తే జీవితాంతం తీసుకోవాలా? అనే ఈ సందేహం రావడం సహజమే. కానీ ఈ మందులు శరీరానికి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. హైపోథైరాయిడిజం అనేది మెడలో ఉన్న సీతాకోకచిలుక ఆకారంలోని థైరాయిడ్ గ్రంథి అవసరమైన హార్మోన్లను తక్కువగా ఉత్పత్తి చేసే పరిస్థితి. ఈ హార్మోన్లు శరీరంలోని మెటబాలిజం, శక్తి స్థాయిలు, ఇతర ముఖ్యమైన పనులను నియంత్రిస్తాయి. అందువల్ల ఈ హార్మోన్లు తగ్గిపోతే శరీరంలోని అనేక ప్రక్రియలు నెమ్మదిస్తాయి.
ఈ సమస్య ఉన్న వారికి సాధారణంగా లెవోథైరాక్సిన్ అనే మందును వైద్యులు సూచిస్తారు. ఇది శరీరంలో లోపించిన థైరాక్సిన్ హార్మోన్‌ను భర్తీ చేస్తుంది. అయితే ఈ మందు వ్యాధిని పూర్తిగా నయం చేయదు. కేవలం శరీరానికి అవసరమైన హార్మోన్‌ను అందిస్తుంది. మందులు తీసుకున్న తర్వాత పరీక్షలు సాధారణ స్థాయికి వచ్చినప్పుడు చాలామందికి ఇప్పుడు మందు ఆపవచ్చా? అనే సందేహం వస్తుంది. కానీ మందు ఆపితే మళ్లీ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీంతో అలసట, బరువు పెరగడం, జుట్టు రాలడం, నెలసరి సమస్యలు, వంధ్యత్వ సమస్యలు వంటి లక్షణాలు తిరిగి వస్తాయి. అయితే ఇది అలవాటు (addiction) కాదని, శరీరానికి అవసరమైన హార్మోన్‌ను బయట నుంచి అందించడం మాత్రమేనని, కాబట్టి మందుపై ఆధారపడుతున్నాం అనే భయం అవసరం లేదని, అసలు విషయం ఏమిటంటే శరీరం ఆ హార్మోన్‌పై ఆధారపడుతోందని వైద్యులు చెబుతున్నారు.
కొన్ని తేలికపాటి లేదా తాత్కాలిక కేసుల్లో డోస్‌ను తగ్గించడం లేదా పూర్తిగా ఆపడం వైద్యుల పర్యవేక్షణలో సాధ్యమే. కానీ చాలా మందికి ఇది దీర్ఘకాలిక లేదా జీవితాంతం తీసుకోవాల్సిన చికిత్సగా ఉంటుంది. క్రమం తప్పకుండా మందులను తీసుకోవడం ద్వారా హార్మోన్ స్థాయిలు సమతుల్యం అవుతూ, శరీరం సరిగ్గా పనిచేస్తుంది. థైరాయిడ్ మందులను దీర్ఘకాలంలో వాడడంపై భయపడాల్సిన అవసరం లేదు. ఇవి శరీరానికి హానికరం కాదు, శరీరం స్వయంగా చేయలేని పనిని చేయడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.