Sugarcane Juice | వ్యాయామం చేసిన తర్వాత శరీరానికి తక్షణ హైడ్రేషన్, శక్తి అవసరం ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో దేశంలో చాలా మంది సహజంగా చెరకు రసం (Sugarcane Juice) వైపు మొగ్గుతారు. ఇది చల్లగా, తాజాగా ఉండి వెంటనే శక్తిని అందించినట్టు అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా ఆరోగ్యకరమైన పోస్ట్ వర్కౌట్ డ్రింకేనా? లేకపోతే కేవలం చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నామా? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. చెరకు రసం కేవలం చక్కెర మాత్రమే కాదు. ఇది ప్రధానంగా నీరు, సుక్రోజ్తో తయారవుతుంది. ఇదే సుక్రోజ్ ను సాధారణ టేబుల్ షుగర్ తయారీలో ఉపయోగిస్తారు. అయితే ప్రాసెస్ చేయని చెరకు రసం ఒక ముఖ్యమైన విషయంలో భిన్నంగా ఉంటుంది. Food Science and Nutrition లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఇందులో ఫెనోలిక్, ఫ్లేవనాయిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి కొంతమేర ప్రయోజనాలను అందిస్తాయి.
వ్యాయామం సమయంలో శరీరం గ్లైకోజెన్‌ను శక్తిగా వినియోగిస్తుంది. అలాగే చెమట ద్వారా నీరు, ఎలక్ట్రోలైట్స్ కోల్పోతుంది. దీంతో అలసట, నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వ్యాయామం తర్వాత శరీరాన్ని మళ్లీ హైడ్రేట్ చేయడం, శక్తి నిల్వలను పునరుద్ధరించడం, కండరాల పునరుద్ధరణకు సహాయం చేయడం వంటివి చేయాలి. చెరకు రసం సహజమైన, ప్రాసెస్ చేయని పానీయం. ప్యాకేజ్డ్ డ్రింక్స్‌లలో ఉండే రసాయన పదార్థాలు ఇందులో ఉండవు. అలాగే ఇందులో ఉన్న ఫ్లేవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. Molecule లోని అధ్యయనం ప్రకారం, చెరకు రసంలో ఫ్లేవనాయిడ్ స్థాయి ఆరెంజ్ జ్యూస్, బ్లాక్ టీ వంటి పానీయాలకు సమానంగా ఉంటుంది. చెరకు రసం తక్షణ శక్తిని అందించే మంచి వనరు. ఇందులో గ్లూకోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉండటంతో అవి త్వరగా శరీరంలోకి శోషించబడతాయి. ముఖ్యంగా హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేసిన తర్వాత ఇది శక్తి నిల్వలను వేగంగా పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.
హైడ్రేషన్ విషయంలో కూడా చెరకు రసం ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో నీటితోపాటు పొటాషియం వంటి కొన్ని ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి చెమట వల్ల కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడంలో సహాయపడతాయి. వేడి వాతావరణంలో ఇది సాధారణ నీటి కంటే మరింత తాజాదనాన్ని ఇస్తుంది. అయితే చెరకు రసం తీసుకునే విషయంలో జాగ్రత్తలు కూడా అవసరం. ఇది సహజమైనదైనా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారికి ఇది సమస్యగా మారుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇందులో ప్రోటీన్ ఉండదు. కండరాల పునరుద్ధరణకు ప్రోటీన్ చాలా అవసరం. చెరకు రసం మాత్రమే తీసుకుంటే అవసరం తీరదు. అందుకే దీన్ని ఒకే పోస్ట్ వర్కౌట్ ఆప్షన్‌గా భావించడం సరైనది కాదు. రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం విషయంలో పరిశుభ్రత సమస్యలు కూడా ఉంటాయి. సరైన శుభ్రత పాటించకపోతే ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
హై ఇంటెన్సిటీ లేదా ఎక్కువసేపు చేసిన వ్యాయామం తర్వాత తక్కువ పరిమాణంలో చెరకు రసం తీసుకోవడం మంచిది. దీన్ని నట్స్, గుడ్లు లేదా ప్రోటీన్ షేక్‌తో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. అయితే తక్కువ వ్యాయామం చేసినప్పుడు, బరువు తగ్గాలని చూస్తున్నప్పుడు లేదా రక్తంలో చక్కెర సమస్యలు ఉన్నప్పుడు చెరకు రసం తగ్గించడం లేదా మానుకోవడం మంచిది. అలాంటి సందర్భాల్లో నీరు, కొబ్బరి నీరు లేదా సమతుల ఆహారం మంచి ఎంపికలు. చెరకు రసం ఒకవైపు మంచి రికవరీ డ్రింక్‌గా పనిచేస్తే, మరోవైపు అధికంగా తీసుకుంటే చక్కెర లోడ్‌గా మారుతుంది. సరైన పరిమాణంలో, సరైన సమయంలో తీసుకుంటే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ పూర్తి పోస్ట్ వర్కౌట్ సొల్యూషన్‌గా కాకుండా, సహాయక పానీయంగా ఉపయోగించడం ఉత్తమమని నిపుణులు తెలియజేస్తున్నారు.