Pressure Cooker | వంట వండేందుకు గాను ప్రెషర్ కుక్కర్లను మనం రోజూ వాడుతూనే ఉంటాం. ప్రెషర్ కుక్కర్ దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఉంటుందన్న విషయం తెలిసిందే. దీని వల్ల వంట త్వరగా అవుతుంది. ఆహారాలను చాలా త్వరగా వండుకోవచ్చు. దీంతో ఎంతో సమయం ఆదా అవడంతోపాటు ఇంధనం కూడా అవుతుంది. అయితే ప్రెషర్ కుక్కర్ లలో వండడం కరెక్టేనా..? వీటిల్లో వండిన ఆహారాలను తింటే మన ఆరోగ్యానికి ఏమైనా హాని జరుగుతుందా..? అని చాలా మందికి ప్రశ్నలు తలెత్తుతుంటాయి. అయితే ఇందుకు వైద్య నిపుణులు సమాధానాలు చెబుతున్నారు. ప్రెషర్ కుక్కర్లలో ఆహారాన్ని వండి తినడం పూర్తిగా సురక్షితమేనని వారు అంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలను పాటించాలని వారు సూచిస్తున్నారు.
ప్రెషర్ కుక్కర్ లలో ఆహారం వండడం అనేది ఆహారాన్ని ఆవిరితో ఉడికించడం కిందకు వస్తుంది. సాధారణంగా వండడం కాదు. ఇడ్లీలను మనం ఏవిధంగా అయితే ఆవిరి ద్వారా ఉడికిస్తామో అదేవిధంగా ప్రెషర్ కుక్కర్ కూడా ఆహారాలను ఉడికిస్తుంది. ఆవిరి ద్వారా ఆహారాలను ఉడికించడం అన్నది అత్యంత ఆరోగ్యకరమైన పద్ధతుల్లో ఒకటి. కనుక ప్రెషర్ కుక్కర్ లలో వండిన ఆహారాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. దీని వల్ల మనకు ఎలాంటి హాని కలగదు. ఆవిరి ద్వారా ఆహారాలు ఉడుకుతాయి కనుక అవి మనకు ఆరోగ్యకరమైనవే. అయితే ప్రెషర్ కుక్కర్ లలో ఆహారాలను వండడం ఆరోగ్యకరమే అయినప్పటికీ ఆహారాలను మరీ అతిగా ఉడికించకూడదు.
ప్రెషర్ కుక్కర్ లో సాధారణంగా ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. కనుక ఏ ఆహారాన్ని అయినా సరే నిర్దిష్టమైన సమయం లేదా నిర్దిష్టమైన విజిల్స్ వచ్చే వరకు మాత్రమే ఉడికించాలి. అతిగా ఉడికించకూడదు. ప్రెషర్ కుక్కర్ లో ఆహారాన్ని మరీ అతిగా ఉడికిస్తే అందులో ఉండే పోషకాలు చాలా వరకు నశిస్తాయి. అలాంటప్పుడు అలా వండిన ఆహారాన్ని తిన్నా కూడా మనకు పెద్దగా ప్రయోజనం కలగదు. కనుక ప్రెషర్ కుక్కర్ లలో ఆహారాలను ఉడికించేవారు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
ఇక ప్రెషర్ కుక్కర్ లలో వండిన ఆహారం ఆరోగ్యకరమే అయినప్పటికీ ప్రెషర్ కుక్కర్ లను ఎక్కువ కాలం పాటు వాడకూడదని వైద్య నిపుణులు చెబతున్నారు. ఎందుకంటే దీర్ఘకాలం పాటు ప్రెషర్ కుక్కర్ లను వాడితే వాటి లోపలి పొర దెబ్బ తింటుంది. దీని కారణంగా ఆహారాలను వండుతున్నప్పుడు అందులో రసాయనాలు, టాక్సిన్లు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అవి నేరుగా ఆహారంలో కలుస్తాయి. అలాంటి ఆహారాన్ని తినడం వల్ల మన ఆరోగ్యానికి హాని జరుగుతుంది. కనుక ప్రెషర్ కుక్కర్ లను కొంత కాలం వరకు మాత్రమే వాడాలి. వాటి లోపలి లైనింగ్ దెబ్బ తింటే అలాంటి కుక్కర్లను వాడకూడదు. మళ్లీ కొత్త కుక్కర్‌ను వినియోగించాలి. ఇలా ప్రెషర్ కుక్కర్ లను వాడుకుంటే మనకు ఎలాంటి హాని కలగదు.