Cucumber Juice | వేసవి కాలంలో సహజంగానే అందరూ శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు యత్నిస్తారు. అందులో భాగంగానే చల్లని ఆహారాలను లేదా శరీరానికి చలువ చేసే ఆహారాలను తింటుంటారు. అలాంటి వాటిల్లో కీరదోస కూడా ఒకటి. వీటిని తింటే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. ఎండ కారణంగా శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందుతుంది. అలాగే శరీరానికి చల్లదనం లభించి వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే కీరదోసను కేవలం వేసవిలోనే తినాలని అనుకుంటారు. ఇతర సీజన్లలో వీటిని దూరం పెడతారు. ఎందుకంటే శరీరానికి చలువ చేస్తాయి కనుక ఇతర సీజన్లలో తింటే కఫం చేరుతుందని, దగ్గు, జలుబు వంటివి వస్తాయని అనుకుంటారు. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కీరదోసను వాస్తవానికి ఏ సీజన్లో అయినా సరే తినవచ్చని వారు సూచిస్తున్నారు.
కీరదోసను నేరుగా తినడం వద్దనుకుంటే దాన్ని జ్యూస్ చేసి రోజూ తాగవచ్చు. రోజూ ఒక కప్పు మోతాదులో కీరదోస జ్యూస్‌ను ఈ సీజన్లో తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వర్షాకాలంలో వేడి ఉండదు. కానీ వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. ఇది కూడా మనకు డీహైడ్రేషన్‌ను కలగజేస్తుంది. అందుకనే చాలా మందికి వర్షాకాలంలోనూ నోరు లేదా గొంతు తడారిపోయి ఎండిపోయినట్లు అనిపిస్తుంది. వాతావరణంలో అధికంగా ఉండే తేమ వల్లనే ఇలా జరుగుతుంది. దీని నుంచి బయట పడాలంటే కీరదోస జ్యూస్‌ను సేవించాలి. కీరదోసలో 95 శాతం మేర నీరు ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ రాకుండా చూస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.
వర్షాకాలంలో చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమయంలో కీరదోసను తిన్నా లేదా దాని జ్యూస్‌ను తాగినా ఎంతో ఫలితం ఉంటుంది. కీరదోసలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం రాకుండా చూస్తుంది. వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్ లేదా ఇతర కారణాల వల్ల కలిగే విరేచనాలను తగ్గిస్తుంది. వర్షాకాలంలో మన రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతాం. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. కానీ కీరదోసలను తింటే వాటిల్లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగాల నుంచి మనల్ని రక్షిస్తాయి. కీరదోసలో విటమిన్ సి, పలు రకాల బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది.
కీరదోసలో నీరు, సిలికా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి చర్మానికి కావల్సిన తేమను అందిస్తాయి. అందువల్ల వర్షాకాలంలోనూ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. మొటిమలు తగ్గిపోతాయి. ముఖం డల్‌గా ఉండడం తగ్గుతుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. కీరదోసలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా ఉండే వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఈ సీజన్లోనూ కీరదోసను తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే వర్షాకాలంలో క్రిములు సులభంగా వ్యాప్తి చెందుతాయి కనుక కీరదోసను తినేముందు లేదా జ్యూస్ చేసే ముందు శుభ్రంగా కడాలి. తాజాగా ఉన్న కీరదోసలనే ఎంచుకోవాలి. కీరదోస జ్యూస్‌ను ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది. ఈ జ్యూస్‌ను అప్పటికప్పుడు తయారు చేసుకుని తాగాలి. నిల్వ ఉంచకూడదు. జ్యూస్‌లో కాస్త అల్లం రసం, పుదీనా, నల్ల ఉప్పు, నిమ్మరసం, తేనె వంటివి కలిపి తాగితే ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఇలా కీరదోస జ్యూస్‌ను జాగ్రత్తలు పాటిస్తూ తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు.