Diabetes | మనలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, అధిక క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం, జన్యుపరమైన కారణాల వల్ల చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. డయాబెటిస్ తో బాధపడే వారు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారు. భారతదేశం డయాబెటిస్ కు రాజధానిగా పరిగణించబడుతుంది. ప్రపంచంలోని డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు 17 శాతం మంది భారతదేశంలోనే ఉన్నారు. డయాబెటిస్ ఇప్పుడు ఒక సర్వసాధారణ అనారోగ్య సమస్యగా మారిపోయింది. ఇక డయాబెటిస్ తో బాధపడే వారు చక్కెరను తీసుకోకూడదు. కానీ చక్కెర మన ఆహారంలో ఒక భాగమైపోయింది. దీంతో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చక్కెరను తీసుకునే విషయంలో చాలా గందరగోళానికి గురవుతారు. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చక్కెరను అస్సలు తీసుకోకూడదా.. ఒకవేళ తీసుకుంటే నెలలో ఎన్నిసార్లు చక్కెరను తీసుకోవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ తో బాధపడే వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీరు మరలా చక్కెరను తీసుకోవడం వల్ల అది రక్తంలో నేరుగా కలుస్తుంది. చక్కెర స్థాయిలు మరింతగా పెరుగుతాయి. ఇన్సులిన్ దానిని నియంత్రించడం కష్టంగా మారుతుంది. ఇది కళ్లు, మూత్రపిండాలు, గుండెను ప్రభావితం చేస్తుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక డయాబెటిస్ తో బాధపడే వారికి చక్కెరతో చేసిన స్వీట్లను తీసుకోకూడదు అని చెబుతారు. ఒకవేళ డయాబెటిస్ నియంత్రణలో ఉన్నవారు ప్రణాళికతో, వైద్యుల పర్యవేక్షణలో నెలకు 2 నుండి 3 సార్లు తీపి తీసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి వేరుగా ఉంటుంది కనుక తీపి తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరమని వారు చెబుతున్నారు.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నప్పటికి తీపి తీసుకునే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. తక్కువ మొత్తంలో మాత్రమే తీపి తీసుకోవాలి. చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరగడానికి ఫైబర్, ప్రోటీన్ తో ఉండే తీపి పదార్థాలు తీసుకోవాలి. తీపి తిన్న తరువాత రోటీ, బియ్యం వంటి వాటిని తీసుకోవడం తగ్గించాలి. ఇక తీపి తినేటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం అవసరం. అలాగే డార్క్ చాక్లెట్, బెల్లంతో తయారు చేసిన పదార్థాలు, ఆపిల్, బేరి, బొప్పాయి వంటి పండ్లతో చేసిన తీపి పదార్థాలు తీసుకోవడం మంచిది. గులాబ్ జామున్, రసగుల్లా, బర్ఫీ వంటి అధిక చక్కెర ఉండే వాటిని తీసుకోకూడదు. చక్కెర కలిగిన జ్యూస్ లు, శీతల పానీయాలు, కేకులు, కుక్కీస్ వంటి వాటిని కూడా తీసుకోకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నవారు ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తీపిని తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.