Brown Top Millets | ప్రస్తుత కాలంలో చాలా మంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆరోగ్యకరమైన ఆహారం తినడంతోపాటు రోజూ వ్యాయామం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం విషయానికి వస్తే చాలా మంది తింటున్న ఆహారాల్లో మిల్లెట్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ మధ్య చిరు ధాన్యాలకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్న చాలా మంది మిల్లెట్స్‌ను తింటున్నారు. అయితే చిరు ధాన్యాల్లో అనేక రకాలు ఉన్నా ఏ ధాన్యం దానికదే కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఇక చిరు ధాన్యాల్లో ఒకటైన అండు కొర్రలు కూడా పలు ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. వీటినే బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అని ఆంగ్లంలో పిలుస్తారు. అండు కొర్రలు మనకు అనేక పోషకాలను అందించడంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలు లభించేలా చేస్తాయి. అండు కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అండుకొర్రలను 100 గ్రాములు తింటే మనకు సుమారుగా 300 క్యాలరీల మేర శక్తి లభిస్తుంది. పిండి పదార్థాలు 63 గ్రాములు, ఫైబర్ 16 గ్రాములు, ప్రోటీన్లు 13 గ్రాములు, కొవ్వు 4 గ్రాములు, క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కాపర్, మాంగనీస్, విటమిన్లు బి3, బి1, బి2, ఫైటో కెమికల్స్ లభిస్తాయి. అండుకొర్రల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇది జీర్ణక్రియను పెంపొందిస్తుంది. పేగుల్లో మలం కదలికలను నియంత్రిస్తుంది. దీంతో మలబద్దకం తగ్గిపోతుంది. అండుకొర్రలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. జీర్ణ వ్యవస్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. అండుకొర్రలను తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అండుకొర్రలలో పిండి పదార్థాలు ఉన్నప్పటికీ ఇవి సంక్లిష్టమైనవి. పైగా వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ కూడా చాలా తక్కువ. అందువల్ల అండుకొర్రలను తింటే షుగర్ లెవల్స్ పెరగవు. పైగా వీటిల్లో ఉండే ఫైబర్, సంక్లిష్టమైన పిండి పదార్థాలు షుగర్ లెవల్స్ తగ్గేలా చేస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు అండుకొర్రలను తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకుంటున్న వారు కూడా అండుకొర్రలను తింటుండాలి. వీటిల్లో ఉండే ఫైబర్ వల్ల వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అండుకొర్రలను తింటుంటే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
అండుకొర్రలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. వీటిల్లో ఉండే మెగ్నిషియం, పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరిగేలా చేస్తాయి. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. అండు కొర్రల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం అధికంగా ఉండడం వల్ల ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకలు దృఢంగా మారేలా చేస్తాయి. వీటిని తినడం వల్ల ఫ్లేవనాయిడ్స్, క్వినోన్స్, టానిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సైతం అధికంగా లభిస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. క్యాన్సర్ల నుంచి రక్షణను అందిస్తాయి. ఇలా అండకొర్రలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.