కొద్దిపాటి బరువు ఎత్తినా, బలం ప్రయోగించి పని చేసినా, చిన్న దెబ్బ తగిలినా కొంతమందికి ఎముక పుటుక్కుమంటుంది. ఆ పని కష్టమైనది కాదు. కానీ, ఎముక ఏ పనికీ సహకరించలేనంత బలహీనంగా మారిపోతే అలా జరుగుతుంది. అప్పటి దాకా ఏ నొప్పీ లేకుండా ఉన్న ఎముక ఎప్పటి నుంచో బలహీనపడుతూ వస్తుందని విరిగాకే తెలుస్తుంది. ఎందుకిలా జరుగుతుందో? ఎవరికిలా జరుగుతుందో? ఈ వారం ఊపిరిలో తెలుసుకుందాం.
పుట్టినప్పటి నుంచి ఎముక పెరగడమే కాదు బలంగా తయారవుతూ ఉంటుంది. సుమారు పాతికేళ్ల వయసుకు అటూ ఇటూ రెండు, మూడేళ్ల తేడాతో ఎముక బలపడటం ఆగిపోతుంది. ఇది అందరిలో జరిగేదే. ఎముకలు క్యాల్షియంతో తయారవుతాయి. ఆ క్యాల్షియం సాంద్రత ఎంత ఎక్కువ ఉంటే ఎముకలు అంత బలంగా ఉంటాయి. క్యాల్షియం సాంద్రత తగ్గుతూ ఉంటే ఎముకల్లో సూక్ష్మ రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు ఎముక స్పాంజ్‌లా మారిపోతుంది. కాబట్టి దీనిని ఆస్టియోపోరోసిస్ అని వైద్యులు పిలుస్తున్నారు. దీనిని బోలు వ్యాధి అని కూడా అంటారు. బోలు వ్యాధి వల్ల ఎముకలు పటుత్వం కోల్పోతాయి.
బోలు వ్యాధికి కారణాలను బట్టి వైద్యులు దీనిని రెండు రకాలుగా పరిగణిస్తారు.
1. ప్రైమరీ ఆస్టియోపోరోసిస్
2. సెకండరీ ఆస్టియోపోరోసిస్
కొంతమంది రోగాల బారినపడినప్పుడు వాడిన మందుల ప్రభావం వల్ల క్యాల్షియాన్ని శరీరం సంగ్రహించలేదు. కొన్ని రోగాల బారినపడినప్పుడు హార్మోన్ల సమస్యలు వస్తాయి. వాటివల్ల ఎముకలు గుల్ల బారిపోతే దానిని ‘ప్రైమరీ ఆస్టియోపోరోసిస్’ అంటారు. ఇది ఎముకల ఫార్మేషన్ తగ్గిపోవడం, రిసాప్షన్ వల్ల వస్తుంది. ఈ ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ వ్యాధిని రెండు రకాలు.. ఒకటి ‘పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపోరోసిస్’, రెండోది ‘ఫెనాయిల్ ఆస్టియోపొరోసిస్’.
పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా బోలు వ్యాధి బారిన పడుతున్నారు. దీనిని మహిళలకు సాధారణంగా వచ్చే వ్యాధిగా వైద్యులు పరిగణిస్తున్నారు. మహిళల్లో రుతుస్రావం ఆగిపోయిన మహిళల్లో ఈస్ట్రోజన్ (స్త్రీ లింగ హార్మోన్స్) తగ్గిపోతుంది. హార్మోన్ల విడుదలలో జరిగే మార్పుల వల్ల బోన్ రిసాప్షన్కు గురవుతుంది. అప్పుడు ఎముకల్లోని క్యాల్షియం శరీరంలోకి చేరుతుంది. ఎముకల్లోని క్యాల్షియం సాంద్రత తగ్గుతుంది. అందువల్ల ఆస్టియోపోరోసిస్ బారినపడతారు. సాధారణంగా 50 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ విధమైన మార్పులు మొదలవుతాయి. పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపోరోసిస్ రోగిలో ఎలాంటి లక్షణాలు బయటపడవు. ఏదైన దెబ్బ తగిలినా లేదా కింద పడినా ఎముక విరగడం వల్ల ఈ వ్యాధి బయటపడుతుంది. కొంతమందిలో 45-50 ఏళ్ల మధ్య వయలోనే రుతుక్రమం ఆగిపోతుంది. మెనోపాజ్‌కు దగ్గరవుతున్న (రుతుక్రమానికి దూరమవుతున్న) మహిళల్లో ఎముకలు పటుత్వం కోల్పోయి, బలహీనమవుతాయి. మహిళలు 50 ఏళ్లకు ముందే మెనోపాజ్ దశకు చేరుకుంటే, పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపోరోసిస్ కూడా ముందే వచ్చేస్తుంది.
పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపొరోసిస్ రోగులకు హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపి (హెచ్ఆర్టి) ద్వారా చికిత్స అందిస్తారు. ఇది కాకుండా పారా థైరాయిడ్ హార్మోన్‌తో కూడా చికిత్స చేయవచ్చు. ఈ చికిత్స పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపోరోసిస్‌తో పాటు ఫెనాయిల్ ఆస్టియోపోరోసిస్ రోగులకు సైతం ఇవ్వవచ్చు. ఈ చికిత్సలో ఇచ్చే హార్మోన్ల వల్ల ఎముకల నుంచి క్యాల్షియం బయటికి పోకుండా అడ్డుకోవచ్చు. ఆస్టియోపోరోసిస్‌ని నియంత్రించవచ్చు. ఇది సైలంట్ ఎపిడిమిక్ అయినందున వ్యాధి పట్ల అవగాహనతో జీవన విధానంలో మార్పులు చేసుకుంటే దీని నుంచి తప్పించుకోవచ్చు.
ఫెనాయిల్ ఆస్టియోపోరోసిస్ వయసుతో సంబంధం ఉన్న వ్యాధి. పురుషులు, మహిళలు దీని బారినపడతారు. వయసు 30 ఏళ్లు దాటిన తర్వాత ఎముకల బలపడే స్థితి ఉండదు. 70 ఏళ్ల నుంచి ఎముక తయారీ తగ్గుతుంది. వృద్ధాప్యంలో ఎముకలు క్రమంగా బలహీనపడటాన్ని ఫెనాయిల్ ఆస్టియోపోరోసిస్ అంటారు.
కొన్ని రకాల జబ్బుల కారణంగా వచ్చే ఆస్టియోపొరోసిస్ లేదా బోలు ఎముకల వ్యాధిని ‘సెకండరీ ఆస్టియోపోరోసిస్’ అంటారు. లుకేమియా, డయాబెటిస్, ఉదరకుహర (సెలియక్) వ్యాధి, హైపర్ థైరాయిడిజం, మూత్రపిండ వ్యాధులు, అనోరెక్సియా, ఎస్టియోజెనెసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి వ్యాధులతో బాధపడే వాళ్లలో ఎముకలు గుల్లబారే ప్రమాదం ఉంది. దీనిని సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ సెకండరీ ఆస్టియోపోరోసిస్ వ్యాధి పిల్లల్లోనూ కనిపిస్తుంది. ఇలా పిల్లల్లో కనిపించే ఆస్టియోపొరోసిస్‌ను ‘జువెనైల్ ఆస్టియోపోరోసిస్’ అంటారు.
ఆస్టియోపోరోసిస్ వ్యాధిని గుర్తించేందుకు ముందుగా రోగి ఆరోగ్యస్థితిపై మెడికల్ ఎగ్జామిన్ చేయాలి. ఆ తర్వాత వారి కుటుంబంలో ఎవరికైనా వ్యాధి ఉన్నదేమో తెలుసుకోవాలి. అనంతరం రోగికి ‘డెక్సా స్కాన్’ ద్వారా ఏ రకమైన ఆస్టియోపొరాసిస్ వ్యాధి ఉందోకచ్చితంగా నిర్ధారించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఈ వ్యాధిని టి-స్కోర్ ద్వారా నిర్ధారిస్తారు.
ఫెనాయిల్ ఆస్టియోపోరోసిస్, పోస్ట్ మోనోపాజ్ ఆస్టియోపోరోసిస్ సమస్యలను అధిగమించాలంటే ‘పీక్ బోన్ మాస్’ కీలకం. ‘పీక్ బోన్మాస్’ అంటే ఎముకల సాంద్రత గరిష్ఠ స్థాయికి చేరుకోవడం. అంటే ఎముకల ఎదుగుదల గరిష్ఠ స్థాయిలో జరగడమన్నమాట. ఈ పీక్ బోన్ మాస్ అనేది 30 ఏళ్ల వయసులో వస్తుంది. స్త్రీ, పురుషుల్లో వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలపడుతుంటాయి. ఎముకల ఎదుగుదల 30 ఏళ్ల నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే 30 ఏళ్లకు ఎముకల్లో క్యాల్షియం నిలువలు అధిక మొత్తంలో డిపాజిట్ అవుతాయి. అందుకే ఈ వయసులో ఏర్పడిన ఎముకల ఎదుగుదలను బ్యాంక్ డిపాజిట్లా భావిస్తారు.
దీనివల్ల ఏర్పడిన ఎముకల పటుత్వం మహిళల్లో మెనోపాజ్ తర్వాత, పురుషుల్లో 70 ఏళ్లు పైబడిన తర్వాత ఏర్పడే ఆస్టియోపోరోసిస్ అధిగమించడానికి దోహదపడుతుంది. ఫెనాయిల్ దశలో బోన్ ఫార్మేషన్ తగ్గిపోయినప్పుడు పీక్ బోన్మాస్ ఆదుకుంటుంది. దీనివల్ల ఆస్టియోపొరోసిస్ నుంచి తప్పించుకోవచ్చు. పీక్ బోన్మాస్ అనేది ప్రధానంగా నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందులో 1. పౌష్టికాహారం 2. శారీరక శ్రమ 3. జన్యు కారణాలు 4. గొనాడల్ యాక్టివిటిస్ అంటే కొన్ని రకాల హార్మోన్ల పనితీరు.
ఈ మధ్యకాలంలో 78 శాతం మహిళలు 50 ఏళ్లలోపే ఆస్టియోపోరాసిస్ (బోలు ఎముక వ్యాధి), కీళ్ల నొప్పులకు గురవుతున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది మహిళలు తమ ఆరోగ్య సంరక్షణపై దృష్టిపెట్టకపోవడం. రెండోది.. ముందే మెనోపాజ్ దశకు చేరుకోవడం.
వయసు పెరిగేకొద్ది ఎముకల్లో క్యాల్షియం నిలువలు అధికస్థాయిలో జమవుతుంటాయి. అతి తక్కువ స్థాయిలో విత్‌డ్రా అవుతాయి. 30 ఏళ్ల వరకు ఇలా జరుగుతుంది. 30 ఏళ్ల తరువాత ఎముకల్లో క్యాల్షియం జమ కావడం క్రమంగా తగ్గుతుంది. విత్‌డ్రా కావడం పెరుగుతుంది. ఎముకల్లో క్యాల్షియం నిలువలు అధికంగా ఉండాలంటే బాల్య దశ నుంచే పౌష్టికాహారం, క్యాల్షియం అందించే ఆహారంతో పాటు చర్మానికి సూర్యరశ్మి సోకేలా పిల్లలను ఎండలో కనీసం 20 నిమిషాల పాటు ఉంచాలి.
దీని వల్ల శరీరంలో విటమిన్-డి సమృద్ధిగా ఉత్పత్తి అవుతుంది. వీటితో పాటు శరీరానికి మంచి వ్యాయామం కల్పించే ఆటలు ఆడించాలి. వయసు 30 ఏళ్లు వచ్చేసరికి వారిలో పీక్ బోన్మాస్ స్థాయులు గరిష్ఠంగా ఉంటాయి. సహజంగానే మహిళల్లో ఈ ‘పీక్ బోన్ మాస్’ తక్కువగా ఉంటుంది. అందుకే వారు చిన్నప్పటి నుంచే పౌష్టిక ఆహారంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.
– ?మహేశ్వర్‌రావు బండారి
ప్రొఫెసర్ డా.వాలియా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్, గాంధీ హాస్పిటల్, హైదరాబాద్