శరీరంలో రక్తకణాలు, ఎముక మూలుగ (బోన్‌మ్యారో), లేదా లింఫటిక్ వ్యవస్థకు సోకి వాటి నుంచి కణాల ఉత్పత్తి, ఆ కణాల పనితీరును దెబ్బతీసేదే రక్త క్యాన్సర్. ఇలాంటప్పుడు శరీరం అసాధారణమైన రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. బ్లడ్ క్లాటింగ్‌కు దారితీస్తాయి. శరీర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా కాకుండా అడ్డుకుంటాయి. లుకేమియా,
లింఫోమా, మల్టిపుల్ మైలోమా రక్త క్యాన్సర్లలో ప్రధానమైన రకాలు.
వీటికి ఇప్పుడు బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఎముక మూలుగ మార్పిడి) లాంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో బ్లడ్ క్యాన్సర్ రోగులు సాధారణ జీవితం గడపడం సాధ్యమే అని వైద్యులు చెబుతున్నారు. లింఫోమా, మల్టిపుల్ మైలోమా, ఎముక మూలుగ దెబ్బతిన్న సందర్భాల్లో కూడా ఈ విధానం రోగికి కొత్త జీవితాన్ని ప్రసాదించగలుగుతుంది. రక్త క్యాన్సర్లపై వజ్రాయుధంగా పరిగణించదగ్గ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
జీవన్మరణ సమస్యగా పరిణమించిన క్యాన్సర్లకు తగిన చికిత్స పొందడం రోగులకు పెద్ద పరీక్షే. కీమోథెరపీ, రేడియేషన్, ఇమ్యునోథెరపీ, బయలాజికల్ ఏజెంట్స్ లాంటివి రక్త క్యాన్సర్ల చికిత్స తొలిదశల్లో ప్రామాణిక చికిత్సలు. అయితే, కొంతమందిలో మాత్రం ఇవి శాశ్వతమైన ఉపశమనం కలిగించలేకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఎముక మూలుగ మార్పిడి (బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్- బీఎంటీ) తగిన ఎంపికగా నిలుస్తుంది. విషమించిన రక్త క్యాన్సర్ల విషయంలో ఎముక మూలుగ మార్పిడి విజయవంతమైన చికిత్సగా అవతరించింది.
మన శరీరంలో పొడవుగా ఉండే తొడ, తుంటి లాంటి కొన్ని ఎముకలలో ఉండే కొవ్వుతో కూడిన మొత్తటి స్పాంజిలాంటి పదార్థమే ఎముక మూలుగ (బోన్‌మ్యారో). దీనిలో పరిపక్వత చెందని కణాలు, స్టెమ్ సెల్స్ (మూలకణాలు) ఉంటాయి. ఇవి మనిషి జీవితకాలంపాటు స్టెమ్ సెల్స్‌లాగా ఉండగలవు. అదే విధంగా ఇవి ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌గా కూడా అభివృద్ధి
చెందగలవు. రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలే శరీరంలో అన్ని అవయవాలు, వాటిలోని కణాలకు ఆక్సిజన్‌ను అందజేస్తాయి. తెల్ల రక్తకణాలు శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా, వైరస్ వంటి రోగకారక సూక్ష్మక్రిములతో పోరాడతాయి. వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ప్లేట్లెట్స్ రక్తం గడ్డకట్టడంలో దోహదపడతాయి.
ఎవరికి, ఎందుకు?
కొంతమందిలో ఎముక మూలుగ తన ప్రధాన విధి అయిన రక్త కణాలను ఉత్పత్తి చేయటంలో విఫలమవుతుంది. వైద్య పరిభాషలో దీన్ని ఎప్లాస్టిక్ ఎనీమియా అంటున్నారు. వీరిలో మళ్లీ సహజంగా రక్త కణాల ఉత్పత్తికి మూలకణ మార్పిడి ప్రక్రియ ద్వారా ఏర్పాటుచేయాల్సి వస్తుంది. అదే విధంగా లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి క్యాన్సర్లు ఉన్నప్పుడు, కిమోథెరపీ వల్ల ఎముక మూలుగ పుర్తిగా దెబ్బతిన్నప్పుడూ మూలకణ మార్పిడి అనివార్యం అవుతుంది. పెద్దమొత్తంలో కీమోథెరపీ, రేడియేషన్‌తో చికిత్స అనంతరం మూలకణ మార్పిడి చేస్తారు.
మూలకణ మార్పిడిలో రకాలు
ఎందుకోసం మార్పిడి చేయాల్సి వస్తున్నది? అన్నదాన్నిబట్టి ఈ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మూడు రకాలు ఉంటాయి. ఆటోలోగస్ లేదా రెస్క్యూ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, రెండోది అల్లోజెనిక్ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, మూడోది అంబ్లికల్ కార్డ్ బ్లడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.
ఆటోలోగస్ విధానంలో రోగికి సొంత స్టెమ్‌సెల్స్‌తో చికిత్స చేస్తారు. ఇందుకోసం ముందుగానే ఆ వ్యక్తి ఎముకల నుంచి మూలకణాలను సేకరించి భద్రపరుస్తారు. వీటిని బయట అభివృద్ధిపరచి మార్పిడికి సిద్ధం చేస్తారు. రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు పూర్తయిన తర్వాత వాటితోనే ఆ వ్యక్తికి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. అంటే ఈ విధానంలో వ్యక్తి మూలకణాలే తిరిగి అతని శరీరంలోకి చేరుతాయి. కాకపోతే, అన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదు. వ్యక్తి ఎముక మూలుగ ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. క్యాన్సర్ చికిత్సకు వచ్చిన సందర్భంలో అతని మూలకణాలను ముందుగానే సేకరించి కీమో, రేడియేషన్ కొనసాగినంత కాలం వాటిని బయట అభివృద్ధి పరచవచ్చు. దీనిలో మూలకణాల మార్పిడి వల్ల ఎటుంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు.
బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో రెండోదైన అల్లోజెనిక్ విధానం ఆటోలోగస్కు పూర్తిగా భిన్నమైనది. ఆటోలోగస్ విధానంలో ట్రాన్స్‌ప్లాంటేషన్ వీలుకాని పరిస్థితుల్లో మరో వ్యక్తి (దాత) నుంచి సేకరించిన మూలకణాలతో ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. అలా దాత నుంచి తీసుకున్న స్టెమ్‌సెల్స్‌తో చేసే చికిత్సను అల్లోజెనిక్ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఇందులో మూలకణాలు స్వీకరించే వ్యక్తికి దాత జన్యురీత్యా సంబంధించిన వారై ఉండాలి. చాలా సందర్భాల్లో దగ్గరి బంధువులే దాతలవుతారు. కానీ జన్యురీత్యా సరిపడే బయటి వ్యక్తులు కూడా ఈ విధానానికి ఉపయోగపడతారు. బ్లడ్ క్యాన్సర్ రోగిలో ఎముక మూలుగ పాడైపోయి, పనిచేయలేని స్థితికి చేరుకున్నప్పుడు అల్లోజెనిక్ పద్ధతి ఆదుకుంటుంది.
అయితే, దీనిలో గ్రాఫ్ట్ వైరస్ హోస్ట్ డిసీజ్ (జీవీహెచ్డీ) వంటి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. అదే సమయంలో మార్పిడి ద్వారా దాత నుంచి వచ్చిన మూలకణాలను స్వీకర్త శరీరం తిరస్కరించకుండా ఉండటానికి ఇమ్యునో సప్రెసివ్ మందులను ఇస్తారు. ప్రాణరక్షణ ప్రక్రియ అయిన మూలకణ చికిత్స కొన్ని సమస్యలతో వైద్యులకు సవాలు విసురుతున్నది. బీపీ తగ్గటం, వికారంగా అనిపించటం, చలితో కూడిన వణుకు, కొంతమందిలో జ్వరం వంటివి కనిపిస్తాయి. అయితే, ఇవన్నీ స్వల్పకాలం ఉండే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. మొత్తంమీద అల్లోజెనిక్ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతం కావటం చాలావరకు దాత మూలకణాలు స్వీకర్త మూలకణాలతో సరిపడటం మీద ఆధారపడి ఉంటుంది.
ఇక రక్త క్యాన్సర్ రోగుల బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మూడోదైన అంబ్లికల్ కార్డ్ (బొడ్డుతాడు) బ్లడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా దాతపై ఆధారపడే అల్లోజెనిక్ విధానం లాంటిదే. అయితే, దీనిలో అప్పుడే పుట్టిన శిశువు బొడ్డుతాడు నుంచి మూలకణాలను సేకరించి వాడతారు. ఈ మూలకణాలను అతిశీతల వాతావరణంలో నిల్వచేస్తారు. ట్లాన్స్ప్లాంటేషన్ అవసరమైనపుడు బయటికి తీసి ఉపయోగిస్తారు. ఈ రక్తకణాలు అపరిపక్వమైనవి. మూలకణ మార్పిడికి చాలా అనుకూలమైనవి. అయితే మూలకణాలు తక్కువగా ఉండటం వల్ల స్వీకర్త పూర్తిగా కోలుకోవటానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది.
Bone Marrow
మూలకణాల సేకరణ ఎలా?
దీనికి రెండు పద్ధతులను అనుసరిస్తున్నారు. మొదటి దానిలో తొడ, తుంటి ఎముకల నుంచి నేరుగా మూలకణాలను సేకరిస్తారు. ఇందుకోసం ముందుగా రోగికి నొప్పి తెలియకుండా మత్తుమందు ఇస్తారు. బలంగా ఉన్న పొడవైన సూదిని ఉపయోగించి మూలకణాలను సేకరిస్తారు. రెండో పద్ధతిలో మూలకణ దాతకు అయిదు ఇంజెక్షన్లు ఇస్తారు. దాంతో ఎముకల్లోని మూలకణాలు రక్త ప్రవాహంలోకి వస్తాయి. అప్పుడు సిరల నుంచి రక్తాన్ని తీసుకుంటారు.
ఓ యంత్రం సాయంతో ఆ రక్తంలోని తెల్ల రక్తకణాలను వేరుచేసి సేకరిస్తారు. వాటితోపాటే మూలకణాలు ఉంటాయి. ఇక ఎముక మూలుగ మార్పిడి చేపట్టడానికి ముందు కొన్ని నిర్ధారణ పరీక్షలు చేస్తారు. రక్త క్యాన్సర్ రోగిలో ఎలాంటి ఎముక మూలుగ ఉన్నదో కచ్చితంగా తెలుసుకుంటారు. రేడియేషన్ లేదా కీమోథెరపీ ద్వారా క్యాన్సర్ సోకిన కణాలను పూర్తిగా నిర్మూలిస్తారు. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ మొత్తం పూర్తవటానికి వారం రోజులు పడుతుంది. ఈ చికిత్స సమయంలో రోగ నిరోధక వ్యవస్థ కొంత బలహీనపడుతుంది. తేలికగా అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆస్పత్రిలో ప్రత్యేక విభాగంలో ఉంచి వ్యాధుల నుంచి రోగికి తగిన రక్షణ కల్పిస్తారు. ఆపైన కూడా దాదాపు నెలరోజులపాటు వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుంది.
తర్వాత పరిస్థితి…
ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తయిన తర్వాత కొంతకాలంపాటు పరిస్థతిని వైద్యులు జాగ్రత్తగా పరిశీలిస్తారు. మార్పిడి జరిగిన తర్వాత పది నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకూ అబ్జర్వేషన్ కొనసాగుతుంది. మూలకణ మార్పిడి తర్వాత కనిపించే మొట్టమొదటి మార్పు రక్తంలో తెల్ల రక్తకణాల సంఖ్య భారీగా పెరుగుతుంది. శరీర రక్షణ వ్యవస్థలో భాగమైన తెల్ల రక్తకణాల ఉత్పత్తి జరుగుతుండటమే ట్రాన్స్‌ప్లాంటేషన్ పనిచేస్తున్నదనడాకి ఒక నిదర్శనం. సాధారణంగా మూలకణ మార్పిడి ప్రక్రియ నుంచి రోగి కోలుకోవటానికి మూడు నెలలు పడుతుంది. అయితే, పూర్తిగా కోలుకోవటానికి దాదాపు ఏడాది పట్టొచ్చని వైద్యులు గుర్తించారు.
దాత, స్వీకర్తల కణాల మధ్య సహజ సయోధ్య ఏర్పడటం ఈ ప్రక్రియ విజయానికి ప్రాథమిక ఆధారం. ఆపైన రేడియేషన్, కీమోథెరపీ, ఏ సందర్భంలో ఎక్కడ ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిందన్న వాటి ప్రభావమూ ఉంటుంది. మొత్తంమీద బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ రక్త క్యాన్సర్ రోగిపై జీవితకాలం ప్రభావం చూపగల అంశం. ప్రక్రియను సులభమైనదిగా భావించి ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి రోగులు అత్యాధునిక వైద్య సౌకర్యాలు, అనుభజ్ఞులైన వైద్యుల సమక్షంలో, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం కీలకమని గుర్తుంచుకోవాలి.
ఏమిటీ ట్రాన్స్ ప్లాంటేషన్?
అంటువ్యాధులు, కీమోథెరపీ, వివిధ రకాల తీవ్రమైన వ్యాధుల వల్ల దెబ్బతిన్న ఎముక మూలుగను తొలగించి, దాని స్థానంలో కొత్త ఆరోగ్యకరమైన స్టెమ్‌సెల్స్‌ను ప్రవేశపెట్టడమే బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్. ఈ కణాలు ఎముకలో మూలుగలో స్థిరపడి రక్తకణాలను ఉత్పత్తి చేయటంతోపాటు కొత్త మూలుగ అభివృద్ధికి తోడ్పడతాయి. స్టెమ్‌సెల్స్ ప్రవేశపెట్టడమే ప్రధానమైన ప్రక్రియ కావటం వల్ల దీన్ని మూలకణ మార్పిడి శస్త్రచికిత్స అని కూడా అంటారు. ఈ వైద్య ప్రక్రియకు కావాల్సిన ఆరోగ్యకరమైన మూలకణాలు ఎవరైన దాత నుంచి సేకరించవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో రోగి నుంచే ముందుగా సేకరించి భద్రపర్చినవి కూడా కావచ్చు. క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ, రేడియేషన్ చికిత్స ప్రారంభించడానికి ముందు ఆ వ్యక్తి ఎముకల నుంచి మూలకణాలను సేకరించి అభివృద్ధి చేస్తారు. ఆపైన రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు పూర్తయిన తర్వాత బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు.
డాక్టర్ గణేష్ జైషెట్వార్
సీనియర్ హెమటో-ఆంకాలజిస్ట్ అండ్ బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్
యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ హైదరాబాద్