Boiled Black Chickpeas | సాయంత్రం సమయంలో సహజంగానే చాలా మంది అనేక రకాల చిరుతిండ్లను, స్నాక్స్‌ను తింటుంటారు. అధిక శాతం మంది సాయంత్రం పూట జంక్ ఫుడ్ తినేందుకే ఇష్టపడతారు. నూనెలో వేయించిన ఆహారాలు లేదా చాట్, బేకరీ ఫుడ్స్‌ను సాయంత్రం స్నాక్స్‌లా తింటుంటారు. కానీ ఇవన్నీ మన ఆరోగ్యానికి హాని చేసేవే. ఇవి మనకు ఏమాత్రం లాభం అందించవు సరికదా మనకు నష్టాన్నే కలిగిస్తాయి. అందువల్ల ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం పడదు. పైగా పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక అలాంటి ఆరోగ్యవంతమైన స్నాక్స్ విషయానికి వస్తే వాటిల్లో నల్ల శనగలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.
నల్ల శనగలను చాలా మంది తరచూ కూరల్లో వేస్తుంటారు. వీటిని కొందరు ఉడకబెట్టి గుగ్గిళ్ల మాదిరిగా చేసుకుని తింటుంటారు. నల్ల శనగలను ఉడకబెట్టి రోజుకు ఒక కప్పు మోతాదులో తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నల్ల శనగల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. నల్ల శనగల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఈ శనగలను సాయంత్రం స్నాక్స్ రూపంలో తింటే రాత్రి ఆహారం తక్కువగా తింటారు. కడుపు నిండిన భావనను కలిగిస్తాయి కనుక ఆహారం తక్కువగా తీసుకుంటారు. దీంతో శరీనానికి చేరే క్యాలరీల శాతం తగ్గుతుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. కనుక అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారికి నల్ల శనగలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
నల్ల శనగల్లో ఉండు ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. ఇది జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సులభంగా శోషించుకుంటుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం సైతం తగ్గుతుంది. నల్లశనగల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కనుక షుగర్ ఉన్నవారికి ఇవి చక్కని ఆహారం అని చెప్పవచ్చు. వీటిని తింటే షుగర్ లెవల్స్ పెరగవు సరికదా, వీటిల్లో ఉండే ఫైబర్ షుగర్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తుంది. కనుక డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు రోజువారి ఆహారంలో నల్ల శనగలను చేర్చుకుంటే ఫలితం ఉంటుంది.
ఇక గుండె ఆరోగ్యానికి కూడా నల్ల శనగలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. నల్ల శనగల్లో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా రక్షిస్తాయి. నల్ల శనటల్లో ఫైటో న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. దీంతో క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే నల్ల శనగల్లో ఉండే ఫాస్ఫరస్, క్యాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేస్తాయి. ఈ శనగల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక మాంసాహారం తినలేని వారికి ఇవి మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఇలా నల్ల శనగలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.