Blood Purification Foods | వాహనాలకు ఇంధనం ఎలాగో మన శరీరానికి రక్తం కూడా అలాగే ఇంధనంలా పనిచేస్తుంది. ఇది మన శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తుంది. ఆయా అవయవాల్లో పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అయితే మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలు, పాటించే అలవాట్ల వల్ల మన శరీరంలో విష పదార్థాలు, వ్యర్థాలు పేరుకుపోతాయి. రక్తం కలుషితమైపోతుంది. వాటిని బయటకు పంపించలేదు. దీంతో శరీరం విష తుల్యంగా మారి వ్యాధులు వస్తాయి. కనుక రక్తం ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవాలి. రక్తం శుద్ధి అయ్యే ఆహారాలను తినాలి. దీని వల్ల అవయవాల్లో ఉండే వ్యర్థాలు సైతం సులభంగా బయటకు పోతాయి. ఇక రక్తం శుద్ధి అయ్యేందుకు పలు ఆహారాలను తరచూ తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పాలకూర, కొత్తిమీర, పుదీనా లాంటి ఆకుకూరలను తరచూ తినాలి. వీటిల్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది రక్తంలో ఉండే టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. రక్తం శుద్ధి అయ్యేలా చేస్తుంది. ఈ ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు సైతం అధికంగానే ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆకుకూరల్లో ఉండే ఫైబర్ శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపించేందుకు సహాయం చేస్తుంది. రోజు వారి ఆహారంలో బీట్ రూట్‌ను చేర్చుకున్నా కూడా మేలు జరుగుతుంది. బీట్ రూట్ రక్తాన్ని శుద్ధి చేయడమే కాక లివర్, కిడ్నీల్లో ఉండే వ్యర్థాలను కూడా బయటకు పంపిస్తుంది. దీంతో ఆయా అవయవాలు కూడా శుభ్రంగా ఉంటాయి. బీట్ రూట్లో ఉండే బీటాలెయిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లు శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. రోజూ బీట్రూట్ను తింటున్నా లేదా దాని జ్యూస్‌ను తాగుతున్నా కూడా ఫలితం ఉంటుంది.
వెల్లుల్లిని మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. ఇందులో ఆల్లిసిన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. ముఖ్యంగా రక్తంతోపాటు కిడ్నీలు, లివర్ శుభ్రంగా మారుతాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాల వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇన్ ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. పసుపును కూడా మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. ఇందులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయడంతోపాటు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది. లివర్ వాపులను తగ్గిస్తుంది. శరీరాన్ని శుద్ధి చేస్తుంది. దీంతో రక్తంలో ఉండే టాక్సిన్లు బయటకు పోయి రక్తం శుద్ధి అవుతుంది.
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, క్రాన్ బెర్రీల వంటి బెర్రీ పండ్లను తింటున్నా కూడా ఎంతగానో మేలు జరుగుతుంది. బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిల్లో ఉండే ఆంథో సయనిన్స్ కారణంగా ఈ పండ్లను తింటే రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తశుద్ధి జరుగుతుంది. మూత్రాశయం, కిడ్నీలు, లివర్ సైతం శుద్ధి అవుతాయి. నిమ్మజాతికి చెందిన పండ్లను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఈ పండ్లలో అధికంగా ఉండే విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. నిమ్మరసంలో ఉండే సమ్మేళనాలు రక్తం, లివర్, కిడ్నీలను శుభ్రం చేస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. సీజనల్ వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు. ఇలా పలు రకాల ఆహారాలను తినడం వల్ల రక్తాన్ని శుద్ధి చేసుకోవడంతోపాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.