మెల్లమెల్లగా విస్తరిస్తున్న బర్డ్‌ఫ్లూ.. గర్భిణులు, నవజాత శిశువులకు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నది. ఈ మహమ్మారి బారినపడ్డ గర్భిణులు, వారి గర్భస్థ శిశువుల్లో 90శాతం మృత్యువాత పడ్డట్లు.. మెల్బోర్న్ (ఆస్ట్రేలియా)లోని ముర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 1500లకు పైగా గర్భిణులకు సంబంధించిన పరిశోధనా పత్రాలను సమీక్షించి.. ఈ విషయాలను బయటపెట్టారు. అమెరికాతోపాటు చైనా, వియత్నాం, కంబోడియా దేశాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాప్తికి సంబంధించిన 30 కేసులను పరిశోధకులు కనుగొన్నారు.
వీరిలో గర్భధారణ సమయంలో బర్డ్‌ఫ్లూ సోకిన 90% మంది మహిళలతోపాటు వారి గర్భస్థ శిశువుల్లో 87% మంది మరణించారని వెల్లడించారు. ప్రాణాలతో బయటపడిన శిశువులు కూడా.. నెలలు నిండకుండానే జన్మించినట్టు చెప్పారు. సాధారణ మహిళలతో పోలిస్తే గర్భిణుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.
ఫలితంగా వారు జబ్బులబారిన పడే అవకాశం ఎక్కువ. గర్భిణులకు ఇలాంటి మహమ్మారులు సోకినట్లయితే.. ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే మహిళలు.. ముఖ్యంగా, గర్భిణులు, నవజాత శిశువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు.