Billa Ganneru | చాలా మంది తమ ఇంటి పెరట్లో లేదా కుండీల్లో, ఇంటి లోపల అనేక పూల మొక్కలను పెంచుతుంటారు. పూల మొక్కలు ఎంతో ఆకర్షణీయంగా ఉండడమే కాదు, ఇంటికి చక్కని ఆకర్షణీయతను తీసుకువస్తాయి. కనుకనే చాలా మంది తమ ఇండ్లలో రకరకాల పూల మొక్కలను పెంచుతుంటారు. అలాంటి పూల మొక్కల్లో బిళ్ల గన్నేరు కూడా ఒకటి. ఇది రెండు రకాల పువ్వులను కలిగి ఉంటుంది. పింక్ లేదా తెలుపు రంగులో ఉండే పూలను పూస్తుంది. ఈ రెండు రకాల మొక్కలను చాలా మంది ఇండ్లలో పెంచుతుంటారు. అయితే కేవలం అందం కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా బిళ్ల గన్నేరు ఎంతగానో పనిచేస్తుంది. ఈ మొక్క పువ్వులు, ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటి గురించి చాలా మందికి తెలియదు.
బిళ్ల గన్నేరు మొక్క ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. పలు వ్యాధులను నయం చేసుకునేందుకు ఈ మొక్క ఆకులు, పువ్వులను ఉపయోగిస్తారు. పలు ఔషధాల తయారీలోనూ వీటిని వాడుతారు. బిళ్ల గన్నేరు మొక్కనే పెరి వింకిల్ అని లేదా వింకా రోసియా అని కూడా పిలుస్తారు. హిందీలో దీన్ని సదా బహార్ అని అంటారు. అంటే ఎల్లప్పుడూ పువ్వులను పూస్తుందని అర్థం. బిళ్ల గన్నేరు మొక్క గాయాలు, పుండ్లను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మొక్కకు చెందిన ఆకులను తీసుకుని వాటిని కాస్త పసుపుతో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని గాయాలు లేదా పుండ్లపై వేసి రోజూ కట్టు కడుతుండాలి. దీంతో అవి త్వరగా మానుతాయి. ఇన్ఫెక్షన్ అవకుండా ఉంటుంది.
మధుమేహం ఉన్నవారికి బిళ్ల గన్నేరు మొక్కలు ఎంతో మేలు చేస్తాయి. ఈ మొక్క వేర్లను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటిని నీడలో ఎండబెట్టాలి. తరువాత పొడి చేయాలి. దీన్ని చిటికెడు మోతాదులో తీసుకుని ఒక టీస్పూన్ తేనె కలిపి రోజూ 2 సార్లు ఉదయం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. ఇలా చేస్తుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. హైబీపీ ఉన్నవారు కూడా ఈ మొక్కను ఉపయోగించవచ్చు. బిళ్ల గన్నేరు మొక్క ఆకులను 5 తీసుకుని వాటి నుంచి రసం తీయాలి. దీన్ని 2 నుంచి 3 ఎంఎల్ మోతాదులో రోజూ ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. ఇలా చేస్తుంటే హైబీపీ తగ్గుతుంది. బీపీ మరీ అధికంగా ఉంటే దీన్ని రాత్రి పూట నిద్రకు ముందు కూడా తీసుకోవచ్చు. దీంతో రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది.
స్త్రీలలో రుతు సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో బిళ్ల గన్నేరు ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ ఆకులను తీసుకుని నీటిలో వేసి మరిగించి కషాయంలా తయారు చేయాలి. కప్పు నీళ్లు అయితే అర కప్పు అయ్యే వరకు కషాయం తయారు చేయాలి. దీన్ని రోజూ పరగడుపునే 3 నెలల పాటు తీసుకోవాలి. ఇలా చేస్తుంటే స్త్రీలలో రుతుక్రమం సరిగ్గా అవుతుంది. రుతు సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తీవ్ర రక్త స్రావం తగ్గుతుంది. హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. బిళ్ల గన్నేరు పువ్వులు, దానిమ్మ పువ్వుల నుంచి రసాన్ని తీసి వాటిని కలిపి ఆ రసాన్ని 1 లేదా 2 చుక్కల చొప్పున ముక్కులో వేస్తుంటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని చిగుళ్లపై వేస్తే చిగుళ్ల నుంచి కారే రక్తస్రావం తగ్గుతుంది. నోట్లో పుండ్లు, పొక్కులను కూడా ఈ మిశ్రమం తగ్గిస్తుంది. ఇలా బిళ్ల గన్నేరు మొక్కతో మనం అనేక లాభాలను పొందవచ్చు.