Belly Button Oil Massage | ఆయుర్వేదంలో ఎన్నో చికిత్సా పద్ధతుల అందుబాటులో ఉన్నాయి. కానీ ఆధునిక సైన్స్ ఇప్పటికీ కొన్ని రకాల ఆయుర్వేద పద్ధతులను విశ్వసించడం లేదు. వాటిల్లో నాభిలో నూనె వేసి మర్దనా చేయడం కూడా ఒకటి. ఆయుర్వేద వైద్యంలో ఈ చికిత్సను పలు వ్యాధులను తగ్గించేందుకు ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. కానీ శాస్త్రీయ పరంగా ఈ చికిత్స ద్వారా కలిగే లాభాలను ఇంకా రుజువు చేయలేదు. అయితే ఈ చికిత్స చేయించుకునే వారు మాత్రం తమకు ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తున్నాయని చెబుతుండడం విశేషం. ఈ క్రమంలోనే నాభిలో నూనె వేసి మసాజ్ చేస్తే అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీంతో పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు.
నాభిలో నూనె వేసి మసాజ్ చేయడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. మసాజ్ కోసం ఆముదం, నువ్వుల నూనె లేదా ఆవ నూనెను ఉపయోగించాలి. ఇది జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి తగ్గుతాయి. నాభిలో ముందు సూచించిన నూనెను ఏదైనా ఒకటి తీసుకుని కొద్దిగా వేసి సున్నితంగా 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నాభి నుంచి మన శరీరంలోని అనేక భాగాలకు పలు నాడులు, రక్త నాళాలు అనుసంధానించబడి ఉంటాయి. అందువల్ల నాభిలో నూనె వేసి మసాజ్ చేస్తే పలు రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు.
కొద్దిగా ఆముదం లేదా నువ్వుల నూనెను తీసుకుని వేడి చేసి స్త్రీలు తమ నాభిలో ఈ నూనెను వేసి సున్నితంగా మసాజ్ చేయాలి. దీంతో రుతు సమయంలో ఉండే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాలు పట్టుకుపోవడం కూడా తగ్గుతుంది. ఆయుర్వేద ప్రకారం నాభి మానవ శరీర ప్రత్యుత్పత్తి వ్యవస్థతో అనుసంధానం అయి ఉంటుంది. అందువల్ల నాభిలో నూనె వేసి మసాజ్ చేస్తే ప్రత్యుత్పత్తి వ్యవస్థకు చెందిన అవయవాలకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. అయితే ఇందుకు గాను కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించాలి. దీని వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థకు చెందిన అవయవాలు ఉత్తేజితం అవుతాయి. హార్మోన్లు సమతుల్యం అవుతాయి. దీంతో స్త్రీలు, పురుషుల్లో ఇద్దరిలోనూ సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడుతాయి. అలాగే లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.
ఏదైనా నూనెను కాస్త వేడి చేసి నాభిలో వేసి మసాజ్ చేస్తుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. లావెండర్ లేదా కమోమిల్ ఎసెన్షియల్ ఆయిల్‌ను మసాజ్ కోసం ఉపయోగిస్తే మంచిది. అయితే ఎసెన్షియల్ ఆయిల్‌ను వాడితే దాన్ని మరేదైనా ఇతర నూనెతో కలిపి వాడాలి. నేరుగా వాడకూడదు. కొబ్బరినూనె లేదా బాదంనూనెలో కలిపి ఉపయోగించాలి. అలాగే కొబ్బరినూనె, బాదంనూనె లేదా ఆలివ్ నూనెను నాభిలో వేసి మసాజ్ చేయడం వల్ల చర్మ కణాలు సైతం ఉత్తేజితం అవుతాయి. దీంతో చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. చర్మం పొడిబారి పోవడం తగ్గుతుంది. ముఖంపై ఉండే వృద్ధాప్య ఛాయలు, ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి. ఇలా నాభిలో నూనెను వేసి మసాజ్ చేయడం వల్ల ఆయుర్వేదం ప్రకారం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.