Bed Time Drinks | మనం పాటించే జీవనశైలి కారణంగానే మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్న సంగతి తెలిసిందే. చాలా మంది సరైన జీవనశైలిని పాటించడం లేదు. భోజనం సరిగ్గా చేయట్లేదు. వేళకు తినడం లేదు. తిన్నా కూడా జంక్ ఫుడ్‌నే ఎక్కువగా తింటున్నారు. అలాగే రాత్రి పూట ఆలస్యంగా నిద్రిస్తున్నారు. దీనికి తోడు ఒత్తిడి, ఆందోళనను నిత్యం ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ అస్తవ్యస్తమైన జీవనశైలిని సూచిస్తాయి. ఇలాంటి జీవనశైలిని కలిగి ఉంటే అధికంగా బరువు పెరుగుతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. గుండె పోటు బారిన పడతారు. కనుక ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రోజూ రాత్రి పూట పలు డ్రింక్స్‌ను తీసుకోవడం వల్ల కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ డ్రింక్స్‌ను తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె పోటు రాకుండా నివారించవచ్చు.
టమాటాలను మనం రోజూ అనేక కూరల్లో వేస్తుంటాం. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా టమాటాల్లో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. టమాటా జ్యూస్‌లో ఫైబర్, నియాసిన్ అధికంగా ఉంటాయి. ఇవి షుగర్, కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తాయి. కనుక రాత్రి పూట నిద్రకు ముందు టమాటా జ్యూస్‌ను తాగితే మేలు జరుగుతుంది. అలాగే రాత్రి నిద్రకు ముందు దాల్చిన చెక్క నీళ్లను కూడా సేవించవచ్చు. ఈ నీళ్లను తాగితే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు.
వెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిల్లో ఎక్కువగానే ఉంటాయి. రాత్రి నిద్రకు ముందు వెల్లుల్లి నీటిని ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. హైబీపీ ఉన్నవారు రోజూ రాత్రి ఈ డ్రింక్‌ను సేవిస్తుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. అలాగే రాత్రిపూట త్రిఫల చూర్ణాన్ని నీటిలో కలిపి కూడా సేవించవచ్చు. అర టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. త్రిఫల చూర్ణాన్ని సేవిస్తుంటే షుగర్ లెవల్స్ తగ్గడమే కాదు, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. త్రిఫల సహజసిద్ధమైన డిటాక్సిఫయర్లా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపి రోగాలు రాకుండా చూస్తుంది. కనుక త్రిఫల చూర్ణం కలిపిన గోరు వెచ్చని నీటిని రాత్రి నిద్రకు ముందు తాగాలి.
పసుపును కూడా మనం నిత్యం వంటల్లో వాడుతుంటాం. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పూట నిద్రకు ముందు పాలలో పసుపు కలిపి తాగవచ్చు. లేదా పసుపును నీటిలో వేసి మరిగించి తాగవచ్చు. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే సమ్మేళనం మనకు అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది షుగర్‌తోపాటు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను సైతం తగ్గిస్తుంది. అలాగే రాత్రి నిద్రకు ముందు ఉసిరికాయ జ్యూస్‌ను కూడా తాగవచ్చు. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొవ్వును కరిగిస్తుంది. ఉసిరికాయ జ్యూస్‌ను సేవిస్తుంటే ఇమ్యూనిటీ సైతం పెరుగుతుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. అలాగే రాత్రి నిద్రకు ముందు అర్జున చెట్టు బెరడును నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను సేవిస్తుండాలి. దీంతో కూడా కొలెస్ట్రాల్, షుగర్‌ను తగ్గించుకోవచ్చు. ఇలా పలు రకాల డ్రింక్స్‌ను రాత్రి సేవిస్తే షుగర్, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతాయి.