Beauty Tips With Coffee Powder | కాఫీని తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కాఫీని చాలా మంది రక రకాలుగా సేవిస్తుంటారు. కొందరు బ్లాక్ కాఫీ అంటే ఇష్టపడతారు. కొందరు పాలు, చక్కెర కలిపి తాగుతారు. కొందరు నెయ్యి వేసి బుల్లెట్ కాఫీ తాగుతారు. అయితే కాఫీని లోపలికి తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, దాని పొడిని బయటకు వాడడం వల్ల అన్నే ఉపయోగాలు ఉంటాయని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. కాఫీ పొడిని ఉపయోగించి పలు ఫేస్ ప్యాక్‌లను తయారు చేయవచ్చని, వాటిని వాడితే ముఖ సౌందర్యం పెరుగుతుందని, ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు, మచ్చలు తొలగిపోతాయని, ముఖం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తారని అంటున్నారు. ఇక సౌందర్యాన్ని అందించడం కోసం కాఫీ పొడిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీ పొడి, తేనెతో ఫేస్ ప్యాక్‌ను తయారు చేసి వాడవచ్చు. ఇందుకు గాను ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని కళ్లకు తగలకుండా ముఖంపై అప్లై చేయాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు ముఖంపై వృత్తాకారంలో వేళ్లను తిప్పుతూ మర్దనా చేయాల్సి ఉంటుంది. తరువాత 15 నుంచి 20 నిమిషాల పాటు ఆగాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో 2 నుంచి 3 సార్లు చేస్తుండాలి. దీని వల్ల చర్మానికి తేమ లభించి మృదువుగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. మొటిమలు తగ్గిపోతాయి. ముఖంపై ఉండే మృత చర్మ కణాలు తొలగిపోతాయి. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు.
కాఫీ పొడి, పసుపు, పెరుగు ఉపయోగించి కూడా ఫేస్ ప్యాక్‌ను తయారు చేసి వాడవచ్చు. ఇందుకు గాను ఒక పాత్ర తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిని, 1 టేబుల్ స్పూన్ పెరుగును, 1 టీస్పూన్ పసుపును వేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు వేచి ఉండాలి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఉండే మృత చర్మ కణాలు తొలగిపోతాయి. మొటిమలు, నల్లని మచ్చలు మాయమవుతాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు.
కాఫీ పొడి, నిమ్మరసంతోనూ ఫేస్ ప్యాక్ తయారు చేసి వాడవచ్చు. ఇందుకు గాను ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిని తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలిపి మెత్తని పేస్టులా మార్చాలి. దీన్ని ముఖం, మెడ భాగాలపై రాయాలి. 10 నుంచి 15 నిమిషాల వరకు వదిలేయాలి. దీంతో చర్మం పొడిగా మారుతుంది. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖం, మెడ భాగాలపై ఉండే నలుపుదనం, నల్లని మచ్చలు తొలగిపోతాయి. మృత చర్మ కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా కాఫీ పొడితో పలు ఇంటి చిట్కాలను పాటించి చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఇందుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు.