Banana For Hair Care | ప్రస్తుతం చాలా మందికి జుట్టు సమస్యలు వస్తున్నాయి. శిరోజాలు రాలిపోతున్నాయి. కొందరికి చుండ్రు విపరీతంగా ఉంటోంది. జుట్టు బలహీనంగా మారి చిట్లిపోతోంది. పురుషుల్లో అయితే చాలా మందికి జుట్టు రాలి బట్టతల కూడా వస్తోంది. అలాగే కొందరికి యుక్త వయస్సులోనే శిరోజాలు తెల్లబడుతున్నాయి. ఇలా చాలా మందికి జుట్టు సమస్యలు ఉంటున్నాయి. అయితే మన ఇంట్లో ఒక పదార్థంతోనే ఈ సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టవచ్చు. అదేమిటంటే.. అరటి పండు. అవును, అదే. దీన్ని మనం తరచూ తింటుంటాం. అయితే జుట్టు సమస్యలను తగ్గించడంలో అరటి పండు అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడితే జుట్టుకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఎలాంటి జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండ్లలో పలు సహజసిద్ధమైన ఆయిల్స్, పొటాషియం ఉంటాయి. ఇవి శిరోజాలకు చక్కని కండిషన్ ఇస్తాయి. జుట్టుకు కావల్సిన తేమను అందిస్తాయి. శిరోజాలు చిట్లిపోకుండా చూస్తాయి. దీని వల్ల వెంట్రుకలు మృదువుగా మారి మెత్తగా ఉంటాయి. శిరోజాలను మెయింటెయిన్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. అరటి పండ్లలో సిలికా ఉంటుంది. ఇది శిరోజాలు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో శిరోజాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. శిరోజాలకు సహజసిద్ధమైన కాంతి వస్తుంది. అరటి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను సంరక్షిస్తాయి. అలాగే జుట్టు పెరిగేలా చేస్తాయి. అరటి పండ్లలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలను తలలో ఉండే దురదను తగ్గించి చుండ్రును తొలగిస్తాయి. ఇలా అరటి పండ్లు జుట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక వీటిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.
బాగా పండిన అరటి పండు గుజ్జును కాస్త తీసుకుని అందులో కొద్దిగా తేనె కలిపి మిశ్రమంగా చేయాలి. ఈ హెయిర్ ప్యాక్‌ను జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి. అనంతరం 20 నుంచి 30 నిమిషాల పాటు జుట్టును అలాగే ఉంచాలి. తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే శిరోజాలు మృదువుగా మారి కాంతివంతంగా ఉంటాయి. జుట్టు పెరుగుతుంది. అరటి పండ్లలో ఉండే విటమిన్ బి6, సిలికా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అలాగే అరటి పండ్లను, పెరుగును కలిపి కూడా జుట్టుకు రాయవచ్చు. ఈ మిశ్రమాన్ని జుట్టుకు 30 నిమిషాల పాటు ఉంచి తరువాత తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది. శిరోజాల సమస్యలను తగ్గించడంలో ఈ చిట్కా కూడా బాగానే పనిచేస్తుంది.
అరటి పండులో కొబ్బరినూనె కలిపి జుట్టుకు రాయాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉండి తరువాత కడిగేయాలి. ఈ చిట్కాను పాటిస్తే జుట్టుకు చక్కని కండిషనింగ్ లభిస్తుంది. జుట్టు చిట్లిపోకుండా ఉంటుంది. శిరోజాలు మరమ్మత్తులకు గురవుతాయి. జుట్టు ఒత్తుగా పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా అరటి పండు, అవకాడో పండుల మిశ్రమాన్ని కూడా జుట్టుకు రాయవచ్చు. 45 నిమిషాల పాటు ఉండి తలస్నానం చేయాలి. జుట్టు సమస్యలను తగ్గించడంలో ఈ చిట్కా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అరటి పండుతోపాటు టీ ట్రీ ఆయిల్‌ను సైతం ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాస్తే తలలో ఉండే దురద పోతుంది. చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా అరటి పండ్లతో పలు రకాల చిట్కాలను పాటించడం వల్ల మీ జుట్టును సంరక్షించుకోవచ్చు. అన్ని రకాల జుట్టు సమస్యలు తగ్గిపోతాయి.