ASD | ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో ఎక్కువగా గుర్తించబడుతున్న న్యూరో డెవలప్మెంటల్ సమస్యలలో ఒకటిగా మారుతోంది. సామాజిక పరస్పర చర్యలు, కమ్యూనికేషన్, ప్రవర్తనలో ప్రత్యేక లక్షణాలతో కనిపించే ఈ పరిస్థితి పిల్లల రోజువారీ జీవితంపై ప్రభావం చూపుతోంది. అయితే సరైన సమయంలో సరైన మద్దతు లభిస్తే ఆటిజం ఉన్న పిల్లలు కూడా ఆత్మవిశ్వాసంతో, భద్రతతో ఎదుగుతారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చికిత్స మాత్రమే కాకుండా ఇంటి వాతావరణం కూడా కీలక పాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు. పిల్లలు కళ్లలోకి చూడకపోవడం, పేరు పిలిచినా స్పందించకపోవడం, మాట్లాడకపోవడం, చూపించి చెప్పే అలవాటు లేకపోవడం లేదా ముందుగా వచ్చిన కొన్ని నైపుణ్యాలు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న వయస్సులోనే సమస్యను గుర్తించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని చెబుతున్నారు.
ప్రారంభ దశలోనే మద్దతు అందించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. జీవితంలోని తొలి సంవత్సరాల్లో సరైన సహాయం అందితే కమ్యూనికేషన్, ప్రవర్తన, స్వతంత్రంగా పనులు చేసుకునే సామర్థ్యంలో మెరుగుదల కనిపించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు, తాతమ్మలు, సోదరులు పిల్లలకు మొదటి మద్దతుదారులుగా ఉండాలని సూచిస్తున్నారు. థెరపీ సెంటర్లలో మాత్రమే కాదు, ఇంట్లో ప్రతిరోజూ జరిగే ఆటలు, సంభాషణలు, పరస్పర చర్యల ద్వారా కూడా ప్రారంభ సహాయం అందించవచ్చని చెబుతున్నారు. చిన్నారులను స్క్రీన్లకు ఎక్కువగా అలవాటు చేయకుండా ఉండటం కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రెండేళ్ల వయస్సు వచ్చే వరకు స్క్రీన్ టైమ్ ను పూర్తిగా నివారించడం మంచిదని చెబుతున్నారు. బదులుగా పిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి ఆడే ఆటలు, పాల్గొనే కార్యకలాపాలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.
మాట్లాడడంలో ఇబ్బంది పడే పిల్లలకు Augmentative and Alternative Communication (AAC) పద్ధతులు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. పిక్చర్ బోర్డులు, కమ్యూనికేషన్ పుస్తకాలు, టాబ్లెట్లలో ఉండే స్పీచ్ యాప్స్ ద్వారా పిల్లలు తమ అవసరాలు, భావాలను వ్యక్తపరచగలుగుతారు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు అదే గుర్తులను ఉపయోగించడం ద్వారా పిల్లలకు అర్థం కావడం సులభమవుతుంది. దీని వల్ల నిరాశ తగ్గి, కమ్యూనికేషన్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రతి చిన్నారిలో ఉండే ప్రత్యేక ఆసక్తులను గుర్తించి వాటి ద్వారా నేర్పించడం కూడా మంచి ఫలితాలు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు పిల్లలకు ట్రైన్లు ఇష్టమైతే వాటి ద్వారా లెక్కలు, కథలు, వర్గీకరణ వంటి కార్యకలాపాలు నేర్పించవచ్చు. రంగులు, బ్లాక్స్, మట్టి వంటి సృజనాత్మక వస్తువులు పిల్లలు భావాలను వ్యక్తపరచడంలో సహాయపడతాయి. పిల్లల ఆసక్తుల ఆధారంగా నేర్పితే ఒత్తిడి తగ్గి, నేర్చుకోవడం ఆనందంగా మారుతుందని చెబుతున్నారు.
పిల్లలకు క్రమబద్ధమైన దినచర్య ఉండటం కూడా చాలా అవసరం. నిద్రలేవడం, భోజనం, ఆటలు, చదువు, నిద్ర వంటి కార్యకలాపాలకు ఒక నిర్దిష్ట సమయ పట్టిక ఉండేలా చూడాలి. చిత్రాలతో కూడిన విజువల్ టైమ్‌టేబుల్స్ ఉపయోగిస్తే పిల్లలకు అర్థం అవడం సులభమవుతుంది. రోజూ ఒకే విధమైన క్రమం పాటించడం వల్ల పిల్లల్లో ఆందోళన తగ్గి భద్రత భావన పెరుగుతుంది. ఆటిజం ఉన్న పిల్లలను చూసుకోవడం తల్లిదండ్రులకు భావోద్వేగపరంగా కష్టంగా మారే అవకాశమూ ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు కూడా తమ ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పట్టించుకోవాలి. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవడం, ఇతర తల్లిదండ్రులతో మాట్లాడడం, సపోర్ట్ గ్రూప్‌లలో చేరడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆటిజం ఉన్న పిల్లలను మార్చాలని కాదు, వారిని అర్థం చేసుకుని వారికి అనుకూలమైన వాతావరణం కల్పించడమే అసలు లక్ష్యం. కుటుంబం నుంచి వచ్చే ప్రేమ, సహనం, ప్రోత్సాహం పిల్లల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.