వయసు పెరుగుతున్న కొద్దీ ఆడవాళ్ల పోషక అవసరాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే.. వయసుతోపాటే వారి హార్మోన్లలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. కండరాలు క్షీణించడం, ఎముకలు బలహీనంగా మారిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో.. 20లో ఆరోగ్యానికి హామీ ఇచ్చిన ఆహార పదార్థాలే.. 50లో అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి, ఆడవాళ్లు తమ వయసును, అవసరాన్ని బట్టి ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మెనోపాజ్ తర్వాత.. ఈస్ట్రోజెన్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇది ఎముకలు, కండరాలు, మెదడు, కాలేయంతోపాటు రక్త నాళాలలో తీవ్రమైన మార్పులకు కారణం అవుతుంది. కండరాలు, ఎముకల బలం క్షీణించడం మొదలవుతుంది. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం, కార్డియోమెటబాలిక్ వంటి ప్రమాదాలు మొదలవుతాయి. ఇలాంటి సమయంలో నాణ్యమైన ప్రొటీన్తోపాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. రక్తంలో చక్కెర, బరువు పెరగడాన్ని నియంత్రించే పదార్థాలకు డైట్లో స్థానం కల్పించాలి. కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి.
నెలసరి సమయంలో రక్తం కోల్పోవడం, ఐరన్లోపం సర్వసాధారణం. దాంతో, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారంతోపాటు సప్లిమెంట్లనూ తీసుకుంటారు. రుతుస్రావం ఆగిపోయిన తర్వాత మహిళల్లో ఐరన్ అవసరాలు తగ్గుతాయి. అయినప్పటికీ ఐరన్ ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే.. శరీరంలో పేరుకుపోయే ఐరన్.. ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. ఇన్సులిన్ నిరోధకత, కాలేయంపై ఒత్తిడితోపాటు హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

‘ఆరోగ్యకరమైన ఆహారం’ అనేది.. మహిళల జీవితంలోని దశలను బట్టి మారుతుంది. యుక్త వయసు నుంచి మొదలుపెడితే, మెనోపాజ్ దశ వరకూ.. ఒక్కో దశలో ఒక్కోరకమైన ఆహారం అవసరం పడుతుంది. 20 ఏళ్లప్పుడు అమ్మాయిల్లో ఈస్ట్రోజెన్ పెరుగుదల వేగంగా జరుగుతుంది. తుంటి చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. రుతుక్రమంలో రక్తం కోల్పోవడంతోపాటు ఎముకల నిర్మాణం కూడా చురుకుగా సాగుతుంది. కాబట్టి, ఈ వయసులో ఆడవాళ్లకు ఐరన్, క్యాల్షియం, ఎనర్జీ అవసరాలు ఎక్కువగా ఉంటాయి.

30 ఏళ్లు, గర్భధారణ సమయంలో మహిళల శరీర అవసరాలు వేరుగా ఉంటాయి. గర్భిణుల్లో పిండానికి పోషకాలు బదిలీ అవుతుంటాయి. కాబట్టి, వీరికి అధిక పోషకాలు కలిగిన ఆహారం అందించాల్సి ఉంటుంది. ఇక బాలింతగా ఉన్నప్పుడు, చిన్నారులకు చనుబాలు పట్టేటప్పుడు ప్రొటీన్, ఐరన్, అయోడిన్, ఫోలేట్, క్యాల్షియం అవసరాలు గణనీయంగా పెరుగుతాయి.

40 ఏళ్లప్పుడు పెరిమెనోపాజ్ దశలోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయులు తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ, కొవ్వు నిల్వ ఉండటం, మానసిక స్థితిలో మార్పులు, నిద్రలేమి సమస్యలు చుట్టుముడతాయి. ఇలాంటప్పుడు జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి హామీనిచ్చేలా.. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని సిఫారసు చేస్తున్నారు.