వయసు పెరిగే కొద్దీ శరీరం పట్టు తప్పుతుంటుంది. రకరకాల అనారోగ్యాలు చేరువవుతుంటాయి. వీటిలో మహిళలకు మొదటి శత్రువు ఆస్టియోపొరోసిస్. అంటే ఎముకలు గుల్లబారే జబ్బు. బోలు ఎముకలు పుటుక్కున విరిగితే మంచానికే పరిమితం కావాల్సిన దుస్థితి దాపురిస్తుంది. ఇలాంటి బాధలు తలెత్తవద్దంటే.. 30 ఏండ్లు దాటిన మహిళలు ఎముకలను కాపాడుకోవడంపై దృష్టి సారించాలని వైద్యులు సూచిస్తున్నారు.
మహిళల వయసు మెనోపాజ్‌కు చేరువయ్యే కొద్దీ.. వారిలో ఈస్ట్రోజన్ తగ్గుతూ ఉంటుంది. ఈస్ట్రోజన్ ఎముకల సాంద్రతను నియంత్రించడంలో ముఖ్యమైన హార్మోన్. కాబట్టి హార్మోన్ సమస్యలు, పీరియడ్స్ సమస్యలు వస్తున్నాయంటే ఎముకల్ని కాచుకోవాల్సిన అవసరం వచ్చిందని జాగ్రత్తపడాలి. ఆహార విధానంలో మార్పులు చేసుకుంటే సమస్యను నియంత్రించవచ్చు. అందుకే ముప్పై దాటిన మహిళలు వాకింగ్, జాగింగ్, రన్నింగ్, డ్యాన్స్, యోగా.. ఏదో ఒకటి రెగ్యులర్‌గా చేయాలని నిపుణుల మాట.
జిమ్‌లో వర్కవుట్స్ అయితే మరీ మంచిది. ప్రతిరోజూ 30 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలి. రోజువారీ ఆహారంలో అధిక పోషకాలు ఉండేలా జాగ్రత్తపడాలి. పని ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ రోజుకు కనీసం గంటపాటైనా నడక సాగిస్తే మరీ మంచిది. అవకాశం ఉంటే ఏరోబిక్స్, జుంబా డ్యాన్స్ లాంటి మార్గాలను ఎంచుకుంటే.. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.