నోటి అల్సర్లు.. ఈ సమస్యను చాలా మందే ఎదుర్కొని ఉంటారు. నోటిలో పుండ్లు అయితే ఆ బాధ వర్ణనాతీతం. ఈ నోటి పూత వల్ల ఆహారం తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఏది తిన్నా నోరంతా మండుతుంది. మన వంట గదిలో దొరికే కొన్ని ఆహార పదార్థాలతోనే ఇలాంటి నోటి అల్సర్లకు చెక్ పెట్టొచ్చు. మరి అవేంటో చూద్దాం..
మన ఇంటి ముందు ఉండే తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పలు రకాల అలర్జీలు, అనారోగ్య సమస్యలను తగ్గించడంలో తులసి ఆకులు చక్కగా పనిచేస్తాయి. అందుకే రోజులో నాలుగైదుసార్లు తులసి ఆకులు నమలడం ద్వారా నోటి అల్సర్లకు చెక్ పెట్టవచ్చు.
తులసి ఆకులు నమిలేటప్పుడు కొద్దిగా నీటిని తీసుకున్నట్లయితే ఆకుల రసం నోరంతా వ్యాపించి, తొందరగా ఉపశమనం కలుగుతుంది.
కొత్తిమీరలో మంటను తగ్గించే యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి నోటి అల్సర్ల వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తాయి. కొత్తిమీర ఆకులను వేడి నీటిలో వేసి ఉడికించాలి. చల్లార్చిన తర్వాత ఆ రసంతో రోజుకు మూడుసార్లు పుకిలిస్తే సమస్య తగ్గుతుంది.
ఉల్లిగడ్డలోని సల్ఫర్ గుణాలు నోటి ఆల్సర్లను తగ్గించడంలో సహాయపడతాయి. చిన్న ఉల్లిగడ్డ ముక్కను అల్సర్ అయిన చోట ఉంచినా.. ఉల్లిరసంతో నోటిని పుకిలించినా ఫలితం ఉంటుంది.
నోటి అల్సర్లను తగ్గించడంలో తేనె చక్కగా పనిచేస్తుంది. అల్సర్ల కారణంగా నోరు పొడిబారుతుంది. అదే తేనెను పూసినప్పుడు నోరు తేమగా మారి ఉపశమనం కలుగుతుంది.
తేనెలో ఉండే యాంటీమైక్రోబయాల్ గుణాల కారణంగా అల్సర్లకు కారణమయ్యే బ్యాక్టీరియా తొందరగా నాశనం అవుతుంది. ఫలితం ఇంకా తొందరగా కావాలంటే తేనెతో పాటు కొద్దిగా పసుపు కూడా రాయొచ్చు.
నోటిలో పుండు అయిన చోట కొబ్బరి నూనెను రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఎండు కొబ్బరిని నమిలినా కూడా ఫలితం ఉంటుంది. కొబ్బరి నీళ్లు ఎక్కువ తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి, అల్సర్ల సమస్య తగ్గిపోతుంది.
ఒక చెంచా గసగసాలను పొడి చేసి, దానికి ఒక చెంచా చక్కెరను కలిపి.. ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవాలి. దీనివల్ల అల్సర్ల సమస్య తగ్గుతుంది.
నోటి అల్సర్ల తక్షణ ఉపశమనానికి ఐస్ ముక్కలతో మర్దన చేయాలి
తరచూ లవంగాలు నమలడం వల్ల కూడా ఆ ఘాటు వల్ల కూడా సమస్య తక్కువ అవుతుంది. కాకపోతే లవంగాల ఘాటు వల్ల మొదట మంట ఎక్కువ అవుతుంది.
గోరువెచ్చటి నీటితో తరచూ పుకలించి ఉంచాలి. ఒకే బ్రష్‌ను ఎక్కువ కాలం వాడినా ఈ సమస్య వస్తుంది. అందుకే మూడు నెలలకొకసారి టూత్ బ్రష్‌ను మార్చాలని వైద్యులు సూచిస్తుంటారు.
విటమిన్ బీ12 తగ్గినా ఈ సమస్య వస్తుంటుంది. కాబట్టి డాక్టర్ల సూచన మేరకు బీ12 విటమిన్ టాబ్లెట్లు వాడితే సమస్య పరిష్కారం అవుతుంది.
Mouth Ulcer | నోటి అల్సర్లతో బాధపడేటప్పుడు టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది.