Breast milk donation | అమ్మ పాలు అమృతం కన్నా గొప్పవి. తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యంతో పాటు ఆయువును అందిస్తాయి. ఎంతో ప్రాధాన్యం ఉన్న తల్లి పాలు దొరక్క ఎందరో చిన్నారులు గుక్కపడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో శిశువులకు డబ్బా పాలు పడుతున్నారు. రొమ్ము పాలు దానం చేయడం ఈ సమస్యకు చక్కటి పరిష్కారం. తల్లి పాలను దాచి పెట్టి అవసరమైన వారికి అందించేందుకు మన దేశంలో ఎన్నో మిల్క్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ఈ మిల్క్ బ్యాంకుల్లో తల్లిపాలను దాచిపెడితే అవసరమైన చిన్నారులకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడినవారమవుతాం.
ఏ బిడ్డకైనా తల్లే ఆధారం. కడుపులో ఉన్నప్పుడు, కడుపులో నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చినప్పుడు కూడా శిశువు అన్ని అవసరాలు తీర్చేది ఒక్క తల్లే. కడుపులో ఉన్నప్పుడు బిడ్డ శరీర అవయవాలు ఒక విధంగా అభివృద్ధి చెందితే.. బిడ్డ పుట్టిన తర్వాత శరీర అవయవాల అభివృద్ధి మూడు నెలల్లో రెట్టింపుగా పెరుగుతాయి. కారణంగా తల్లిపాలే.
కాన్పు అయిన మొదటి రోజు నుంచి 4 రోజుల వరకు ముర్రుపాలను అమృతతుల్యంగా చెప్పుకోవలి. బిడ్డకు అవసరమైన తొలి పోషణ, రక్షణ దీని నుంచే దొరుకుతుంది. 5-41 రోజుల వరకు వచ్చే పాలు బిడ్డ శరీర అవసరాలకు తగినట్లుగా ఉండి బిడ్డకు గొప్ప శక్తిని అందిస్తాయి. ఈ పాలలో లాక్టోజ్, కొవ్వులు అధికంగా ఉంటాయి. రెండు వారాల తర్వాత పాలు మామూలు దశకు చేరుతాయి. ఇందులో 90 శాతం నీరు, పిండిపదార్థాలు, విటమిన్లు 2 శాతం, ప్రోటీన్లు, కొవ్వులు 8 శాతం ఉండి బిడ్డకు సంపూర్ణ ఎదుగుదలకు సాయం చేస్తాయి.
మన దేశంలోని పలు ముఖ్య నగరాల్లో పాల బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. మీ సమీపంలోని మిల్క్ బ్యాంకును సంప్రదించి మీ సేవలను కొనసాగించవచ్చు. మన దేశం అంతటా డోర్-స్టెప్ సేవలను అందించే పాల బ్యాంకులను వెతికిపట్టుకోండి.
మీకు సమీపంలో పాల బ్యాంకు లేనిపక్షంలో లేదా బ్యాంకుకు చేరవేయడం కష్టంగా అనిపిస్తే పాల నాణ్యత ప్రభావితం కాదని నిర్ధారించుకుని కోల్డ్ చైన్ స్టోరేజీలో మీ పాలను నిల్వ చేసి పాల బ్యాంకుకు సమాచారం ఇవ్వండి. వారు ఆ పాలను తీసుకెళ్లి వారి బ్యాంకులో భద్రపరుస్తారు.
నమోదు ప్రక్రియలో తొలి దశ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం. సమ్మతి ఫారంపై సంతకం చేసి మీ గత వైద్య, ఆరోగ్య చరిత్ర, ప్రస్తుతం వాడుతున్న మందులు తదితరాల గురించి సమాచారం అందించాలి.
సిఫిలిస్, హెపటైటిస్ బీ, సీ, హెచ్ఐవీ కలిగి ఉన్నవారు పాలను దానం చేయకూడదు. ఈ ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడం కోసం దాత తల్లులందరూ తప్పనిసరిగా రక్త పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షలను ఆయా పాల బ్యాంకులు చేపడతాయి.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత పాలను సేకరించేందుకు మీకు సంచులు / సీసాలు అందిస్తారు. మీ వీలును బట్టి పాలను సేకరించేలా సమాచారం ఇవ్వాలి.
ఒకసారి సేకరించిన పాలను డీప్ ఫ్రీజర్లో నిల్వ చేస్తారు. సాధారణంగా పరిశుభ్రతను ఎలా పాటించాలి? అవసరమైన పరికరాలను ఎలా క్రిమిరహితం చేయాలి అనే దానిపై సమగ్ర సూచనలు ఇస్తారు. కొన్ని మిల్క్ బ్యాంక్లు మిమ్మల్ని వ్యక్తిగతంగా రావాలని కోరతాయి. అప్పుడు మీకు వీలయ్యే సమయాలను వారికి చెప్పి వెళ్లడం చాలా ఉత్తమం.
ఫ్రీజర్లో దాచిన పాల సంచులు / సీసాలను ఎప్పటికప్పుడు బ్యాంకులకు అందించాలి. కొన్ని మిల్క్ బ్యాంక్లు మీ ఇంటి వద్దకే వచ్చి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తాయి.
విరాళమిచ్చిన పాలను పరీక్షా సదుపాయానికి పంపి కలుషితం కాలేదని నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత పాలను పాశ్చరైజ్ చేసి మరోసారి కలుషిత పరీక్షలు చేసిన తర్వాతనే నిల్వ ఉంచుతారు. అవసరమైనప్పుడు సరఫరా చేస్తారు.
చివరి మాట..
మన దేశంలో ఏటా లక్షల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీరిలో చాలా మంది తక్కువ బరువుతో పుడుతున్నారు. అలాగే వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా శిశు మరణాలు పెరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు తల్లిపాలు ఒక్కదానివల్లే సాధ్యమవుతుంది. ఇలాంటి చిన్నారులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు, పౌరసమాజాలు, స్వచ్ఛంద సంస్థలు విరివిగా మిల్క్ బ్యాంకులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా శిశు మరణాలను తగ్గించాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.