Apple | రోజుకు ఓ యాపిల్ తింటే డాక్టర్ అవసరమే రాదని అంటారు. హిమాలయ పర్వత రాష్ర్టాలైన హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ యాపిల్ పంటకు ప్రసిద్ధి. ఎన్నో రకాల యాపిల్ పండ్లు అక్కడ సాగవుతున్నాయి. వాటిలో ఆరు రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఫలాలు విటమిన్లు, ఫైబర్, ఇతర పోషకాలకు గనులు. పండుగానే కాకుండా సలాడ్లలో, డెజర్ట్‌గానూ తినొచ్చు.
ఆకట్టుకునే రంగుతో తియ్యగా, రసభరితంగా నోరూరించే సిమ్లా యాపిల్‌ను చూడగానే మనసు పారేసుకోని వారు ఉండరు. హిమాచల్ హిమాలయ పర్వత సానువుల్లో 6 వేల అడుగుల ఎత్తున ఈ చెట్లు పెరుగుతాయి. సిమ్లా యాపిల్‌లో విటమిన్లు ముఖ్యంగా విటమిన్-సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అరుగుదలకు సహాయ కారిగా ఉంటాయి. జలుబు, ఇన్ఫెక్షన్లతో పోరాటానికి యాంటీ ఆక్సిడెంట్లను ఇస్తాయి. సిమ్లా యాపిల్ ముక్కలను వాల్‌నట్స్‌తో మేళవించి, తేనె చల్లుకుని సలాడ్‌గా ఆరగిస్తే మంచిది.
లేత ఎరుపు, ఎరుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి. కరకరలాడుతూ నోట్లో రసాలూరిస్తూ మహా తియ్యగా ఉంటాయి. ఇవి కశ్మీర్లో పండుతాయి. పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. దీంతో రక్తపోటు ఆరోగ్యకరస్థాయిలో ఉంటుంది. భోజనం తర్వాత ఆరగిస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.
కశ్మీర్ లోయ ఈ రకం యాపిల్స్‌కు ప్రసిద్ధి. తియ్యని, రసభరితమైన కశ్మీర్ యాపిల్స్ ఇతర రకాలతో పోలిస్తే లేత ఎరుపు రంగులో ఉంటాయి. తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి, గుండె ఆరోగ్యానికి మంచివి. అంతేకాదు, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చర్మం, వెంట్రుకలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. యాలకులు, దాల్చిన చెక్క మేళవించి మన రుచికి తగినట్టు కశ్మీర్ యాపిల్‌తో పచ్చడి చేసుకోవచ్చు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో పండుతాయి. హిమాలయ పర్వత సానువుల్లో దాదాపు 7 వేల అడుగుల ఎత్తువరకు వీటిని రైతులు సాగుచేస్తారు. ముదురు ఎరుపు రంగులో నోరూరించే కిన్నౌర్ యాపిల్స్ కరకరలాడుతుంటాయి. విటమిన్-సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి అరుగుదలకు, రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదం చేస్తాయి. బరువు తగ్గడానికి, నోటి ఆరోగ్యానికి మేలుచేస్తాయి. కిన్నౌర్ యాపిల్‌ను దోరగా కాల్చుకుని తింటూ చలికాలం సాయంత్రాల్లో ఆహ్లాదాన్ని అనుభూతి చెందవచ్చు.
కశ్మీర్లో పండిస్తారు. బంగారు పసుపు రంగులో రసభరితంగా, చాలా తియ్యగా ఉంటాయి. శరీరంలో సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని ఇస్తాయి. జీవక్రియలకు తగిన శక్తిని ప్రసాదిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. శరీరంలో కలుషిత పదార్థాలను బయటికి (డిటాక్సిఫై) పంపుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలా శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. గోల్డెన్ డెలీషస్ యాపిల్‌తో మంచి పోషకాలు అందుతాయి.
హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ రాష్ర్టాల్లో దాదాపు 7,000 అడుగుల ఎత్తువరకు పండుతాయి. ఆకుపచ్చ రంగులో కరకుగా, రస భరితంగా ఉండే ఇండియన్ గ్రానీ యాపిల్స్ కాస్త పులుపే. విటమిన్-సి, ఫైబర్, పొటాషియం, ఇతర విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. గుండెపోటు, పక్షవాతం ముప్పును తగ్గిస్తాయి. కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి. అలా బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. దాల్చినచెక్క పొడి కలిపిన గ్రానీ ఇండియన్ యాపిల్ ఎంతో రుచికరంగా ఉంటుంది.