Aphasia | ఇటీవల అమెరికన్ టీవీ వ్యాఖ్యాత వెండీ విలియమ్స్‌కు అఫేసియా (మాట పడిపోవడం) ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ రుగ్మత వార్తల్లో నిలిచింది. నడివయసులో, వృద్ధాప్యంలో దాపురించే అఫేసియా.. మెదడులో భాషకు సంబంధించిన భాగానికి గాయం కావడం వల్ల తలెత్తుతుంది. కొన్నిసార్లు పక్షవాతంతో కూడా వృద్ధి చెందుతుంది. మెదడులో కణితి ఉన్నప్పుడు సైతం నెమ్మదినెమ్మదిగా పెద్దదవుతూ వస్తుంది. ఈ రుగ్మత బారినపడ్డప్పుడు మాటలోనే కాదు, రాతలోనూ తడబాటు ఉంటుంది. అఫేసియా బాధితులు పొడిపొడిగా మాట్లాడతారు. అసంపూర్ణ పదాలతో పూర్తిచేస్తారు. అర్థంపర్థం లేని వాక్యాలూఉంటాయి. ఒకదాని బదులు మరొక పదం వాడతారు. వారికి తాము రాసేది, చదివేది అర్థం కాదు. ఇతరులతో సంభాషణ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది.
అఫేసియాలో.. బ్రోకా అఫేసియా వెర్నిక్స్ అఫేసియా ప్రైమరీ ప్రోగ్రెసివ్ అఫేసియా అనే ప్రధాన రకాలున్నాయి. లక్ష జనాభాలో సుమారు 43 మంది అఫేసియా బారినపడే అవకాశాలు ఉంటాయి. సమస్య కారణాన్ని బట్టి స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ థెరపీ అందిస్తారు. రోగులు మామూలుగా మాట్లాడటానికి కుటుంబ సభ్యులు తమవంతు చేయూత అందించాల్సి ఉంటుంది. తొలినాళ్లలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.