Onion Peels | ఉల్లిపాయలను మనం రోజూ అనేక వంటకాల్లో వాడుతూనే ఉంటాం. ఉల్లిపాయలను వేయకుండా ఏ కూరలను చేయలేరు. చేయరు కూడా. ఉల్లిపాయలతో కూరలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఉల్లిపాయలను కట్ చేసిన తరువాత అందరూ చేసే పని ఉల్లిపాయల పొట్టును పడేయడం. కానీ దీంతోనూ అనేక లాభాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ పొట్టుతో పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని, అనేక పోషకాలు కూడా లభిస్తాయని వారు అంటున్నారు. ఉల్లిపాయ పొట్టులో భిన్న రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ అనేక వ్యాధులు రాకుండా చూస్తాయి. శరీరానికి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణను అందిస్తాయి.
ఉల్లిపాయల పొట్టులో క్వర్సెటిన్ అనబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ హిస్టామైన్ గుణాలను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. క్యాన్సర్లకు అడ్డుకట్ట వేస్తాయి. ఉల్లిపాయ పొట్టులో ఆంథో సయనిన్స్ కూడా అధికంగానే ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉల్లిపాయల పొట్టులో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మనకు రక్షణను అందిస్తాయి. ఉల్లిపాయల పొట్టులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఉల్లిపాయల పొట్టులో ఉండే ఫ్లేవనాయిడ్స్, క్వర్సెటిన్ బీపీ, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఉల్లిపాయల పొట్టుతో తయారు చేసిన సూప్‌ను రోజూ తాగితే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉల్లిపాయల పొట్టు ఎంతగానో మేలు చేస్తుంది. ఉల్లిపాయల పొట్టు నుంచి తీసిన పలు రకాల సమ్మేళనాలు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయని, క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది.
ఉల్లిపాయల పొట్టులో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. పేగుల్లో మలం సులభంగా కదిలేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. ఉల్లిపాయల పొట్టులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. దీని వల్ల బ్యాక్టీరియా నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఉల్లిపాయల పొట్టును కాస్త ఎండబెట్టి పొడిగా చేసి మీరు రోజూ తింటే వంటలపై చల్లి తినవచ్చు. లేదా ఈ పొట్టుతో టీ తయారు చేసి అందులో కాస్త తేనె కలిపి తాగవచ్చు. ఉల్లిపాయ పొట్టుతో సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పొట్టును చారు, రసం వంటి వాటిలో వేయవచ్చు. ఇలా ఉల్లిపాయ పొట్టును తీసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.