Alternatives To Sugar | తీపి కోసం ఎక్కువగా చక్కెరపై ఆధారపడుతూ ఉంటారు. అనేక తీపి వంటకాల్లో చక్కెరను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చక్కెరపై చాలా మందికి మిశ్రమ భావనలు ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా, తీపి పదార్థాలు తినకుండా ఉండలేరు. అయితే ఇప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, రుచి తగ్గకుండా ఉపయోగించుకునే సహజ ప్రత్యామ్నాయ స్వీట్నర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి గ్లైసెమిక్ ఇండెక్స్, పోషకాలు, రుచుల్లో తేడా కలిగి ఉన్నప్పటికీ భారతీయ వంటకాలలో సులభంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. తెల్ల చక్కెరకు బదులుగా ఆరోగ్యకరమైన స్వీట్నర్ వాడుతున్నప్పటికి ఎక్కువగా తినొచ్చనే అర్థం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం, రోజువారీ క్యాలరీలలో 10 శాతం కన్నా తక్కువ మాత్రమే చక్కెరల నుంచి రావాలి. నిపుణులు రోజుకు రెండు టీ స్పూన్లు మించకూడదని సూచిస్తున్నారు. చక్కెరకు బదులుగా వాడుకోదగిన ఇతర స్వీట్నర్ల గురించి అలాగే వాటిని ఎలా తీసుకోవాలి.. అన్న వివరాల గురించి వారు వివరిస్తున్నారు.
భారతీయ ఇళ్లలో తరతరాలుగా ఉపయోగిస్తున్న బెల్లం ఒక మంచి ప్రత్యామ్నాయం. ఇది తక్కువ ప్రాసెసింగ్‌తో తయారవుతుంది కాబట్టి ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. దీని రుచి గాఢంగా ఉండి ఖీర్, హల్వా, లడ్డూల వంటి వంటకాలకు ప్రత్యేకమైన టేస్ట్ ఇస్తుంది. తేనె కూడా మరో ఆరోగ్యకరమైన స్వీట్నర్. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఎంజైములు ఉంటాయి. అయితే తేనెను అధిక ఉష్ణోగ్రతకు వేడి చేయకూడదు. చల్లని లేదా స్వల్పంగా వేడిగా ఉన్న పదార్థాల్లో కలిపి వాడుకోవాలి. అదే విధంగా ఖర్జూరాలు (డేట్స్), డేట్ సిరప్ సహజంగా తీపి కలిగినవి. వీటిలో ఫైబర్, పొటాషియం, ఐరన్ లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర శోషణను నెమ్మదింపజేస్తాయి. లడ్డూలు, ఎనర్జీ బాల్స్ తయారీలో ఇవి బాగా ఉపయోగపడతాయి.
అలాగే కొబ్బరి చక్కెర (కోకనట్ షుగర్) కూడా మంచి ప్రత్యామ్నాయం. దీన్ని సాధారణ చక్కెరలా ఉపయోగించుకోవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో బేకింగ్‌లో విస్తృతంగా దీనిని వాడుతున్నారు. మేపిల్ సిరప్ భారతీయ వంటల్లో సంప్రదాయ పదార్థం కాకపోయినా, ఇప్పుడు ఆరోగ్యకరమైన స్వీట్నర్గా ప్రాచుర్యం పొందింది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. తక్కువ పరిమాణంలోనే ఎక్కువ తీపి ఇస్తుంది. స్టీవియా అనే మొక్క నుంచి తీసిన స్వీట్నర్లో కాలరీలు, గ్లైసెమిక్ ఇండెక్స్ రెండూ శూన్యం. మధుమేహం ఉన్నవారికి ఇది అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. అయితే స్వల్పంగా చేదును కూడా కలిగి ఉంటుంది.
మోంక్ ఫ్రూట్ స్వీట్నర్ కూడా తక్కువ కాలరీలు, గ్లైసెమిక్ ప్రభావం లేకుండా తీపి ఇస్తుంది. ఇది స్టీవియాతో పోలిస్తే రుచిలో కొంచెం మెరుగ్గా ఉంటుంది కానీ ధర ఎక్కువగా ఉంటుంది. పండ్ల ప్యూరీలను కూడా సహజ స్వీట్నర్లుగా ఉపయోగించవచ్చు. పండిన అరటి, మామిడి, ఆపిల్ ప్యూరీలు మిఠాయిల్లో చక్కెర అవసరాన్ని తగ్గిస్తాయి. ఇవి ఫైబర్, విటమిన్లు అందించడమే కాకుండా జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇక ఏ స్వీట్నర్ ఎంచుకోవాలో వారి వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మధుమేహం నియంత్రణ కోసం స్టీవియా లేదా మోంక్ ఫ్రూట్ సరైనవి. రుచి, పోషకాల కోసం బెల్లం, తేనె, ఖర్జూరాలు ఉపయోగకరమైనవి. బేకింగ్ కోసం కొబ్బరి చక్కెర, మేపిల్ సిరప్ అనువైనవి. సహజ స్వీట్నర్లు ఆరోగ్యానికి కొంత మెరుగైన ఎంపిక అయినప్పటికీ, మితంగా తీసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. సరైన పరిమితిలో వాడితేనే ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.