Almonds And Walnuts | బాదంపప్పు, వాల్నట్స్.. ఈ రెండింటినీ పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిల్లో మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ రెండు రకాల నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రెండు నట్స్‌లోనూ మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక బాదం, వాల్ నట్స్‌ను కలిపి తింటేనే మంచిది.
వాల్ నట్స్‌లో ఆల్ఫా-లినోలీనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఒక రకమైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్. ఇది శరీరంలోని వాపులను తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. బాదంపప్పును తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్ తగ్గుతుంది. దీంతో మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డీఎల్ పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బాదంపప్పు, వాల్‌నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. బాదంపప్పులో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీంతో కణాలను ఇది డ్యామేజ్ అవకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బాదంపప్పులో పాలిఫినాల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అందువల్ల రెండు రకాల నట్స్ మనకు ఎంతగానో మేలు చేస్తాయ. వీటిని తినడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. వయస్సు మీద పడడం వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలు సైతం తగ్గిపోతాయి.
వాల్ నట్స్‌లో ఉన్న పోషకాల కారణంగా ఈ నట్స్‌ను బ్రెయిన్ ఫుడ్‌గా పిలుస్తారు. వాల్ నట్స్‌ను చూస్తే అచ్చం చిన్నపాటి మెదడును చూసినట్లే ఉంటుంది. అచ్చు అలాగే ఇవి మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వాల్ నట్స్ లో అధిక మొత్తంలో డీహెచ్ఏ ఉంటుంది. ఇది ఒక ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్. ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో మెదడు యాక్టివ్‌గా మారుతుంది. మతిమరుపు తగ్గుతుంది. బాదంపప్పులో రైబోఫ్లేవిన్, ఎల్-కార్నిటైన్ అనే పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి నాడీ సంబంధ వ్యాధులు రాకుండా చూస్తాయి. కనుక బాదం పప్పు, వాల్ నట్స్.. రెండింటినీ కలిపి తీసుకుంటే మెదడుకు ఎంతో మేలు జరుగుతుంది. దీంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతాయి. అలాగే మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
బాదంపప్పు, వాల్ నట్స్‌లో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో మేలు చేస్తుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారు ఈ రెండు రకాల నట్స్‌ను రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇలా బాదంపప్పు, వాల్ నట్స్ మనకు ఎంతో మేలు చేస్తాయి. కనుక ఈ రెండింటినీ రోజూ కలిపి తింటే పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు.