asthma | చలిని తలుచుకొంటే పులిని చూసినంత భయం. చినుకులు మొదలు కాగానే వణుకూ ఆరంభం అవుతుంది. తెరలు తెరలుగా దగ్గు, అడుగు తీసి అడుగేసినా ఆయాసమే. ఆస్తమా రోగుల కష్టాలను చూస్తే, ఏ నేస్తానికైనా బాధగానే అనిపిస్తుంది. ఈ రుగ్మతను తొలిదశలోనే గుర్తిస్తే నాణ్యమైన చికిత్స అందించవచ్చు. అయినా దారికి రాకపోతే, ఇన్హెలేషన్ థెరపీ ( inhalation therapy ) ద్వారా నియంత్రణలోకి తీసుకురావచ్చు.
ఆస్తమా శ్వాస సంబంధ వ్యాధి. ఊపిరితిత్తుల్లోని వాయునాళాల్లో వాపు వల్ల ఈ రుగ్మత వస్తుంది. ఫలితంగా రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతాడు. ఆయాసం వస్తుంది. తీవ్రమైన దగ్గు, దమ్ము వేధిస్తాయి. ఆస్తమా రోగులపై వాతావరణ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వానకాలం, శీతకాలం సమస్య పెరుగుతుంది. ఈ రెండు రుతువుల్లో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్-డి తగ్గిపోతుంది. దీంతో రోగ నిరోధక శక్తి మరింత పడిపోయి ఆస్తమా తీవ్రరూపం దాల్చుతుంది. గాలిలో తేమ శాతం పెరిగినా, వాతావరణం చల్లగా మారినా నరకమే. ఈ పరిస్థితుల్లో రోగికి ఉపశమనం కలిగించేందుకు పలు మందులు అందుబాటులో ఉన్నా.. ‘ఇన్హెలేషన్ థెరపీ’ అనేది అన్నిటిలోకి సులభమైన, సురక్షితమైన చికిత్సా విధానమని చెబుతారు నిపుణులు.
మనిషి శ్వాస వ్యవస్థకు, ప్రకృతికి మధ్య జరిగే నిరంతర పోరాట ఫలితమే అలర్జీ. ఆ ప్రభావాలే ఆస్తమా లేదా ఉబ్బసం. పర్యావరణంలోని ధూళి కణాలు, పుప్పొడి, ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ తదితరాలకూ, మానవ శరీరంలోని రక్షణ వ్యవస్థకూ నిరంతరం పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆ ఫలితమే ‘అలర్జిక్ ఇన్ఫ్లమేషన్’. ఇవి రెండు రకాలు. మొదటిది ఎక్యూట్ ఇన్ఫ్లమేషన్. హఠాత్తుగా వచ్చి, అంతే త్వరగా తగ్గిపోతుంది. రెండోది శ్వాస వ్యవస్థలో ఎలర్జీల వల్ల వస్తుంది. దీన్నే ‘క్రానిక్ అలర్జిక్ ఇన్ఫ్లమేషన్’ అంటారు. ఇది మాత్రం జీవితాంతం వెంటాడుతుంది. కొందరిలో వయసు పెరిగే కొద్దీ క్రమంగా తగ్గిపోతుంది. ఆ తరువాత మళ్లీ శ్వాస వ్యవస్థలోని ఏ భాగంలోనైనా ఏర్పడవచ్చు. ఎక్యూట్ అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ముక్కులో మొదలై, ఊడల మర్రిలా శరీరంలోని ఇతర భాగాలతో పాటు ఊపిరితిత్తుల వరకూ వ్యాపించి, శ్వాస వ్యవస్థ మొత్తాన్నీ దెబ్బతీస్తుంది. ఆస్తమాను ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నియంత్రించే అవకాశాలు ఉన్నాయి.
ఊపిరితిత్తుల్లో వాపు వల్ల వాయు మార్గాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల శ్వాసకు అడ్డంకులు ఏర్పడుతాయి. ఫలితంగా రోగి సరిగ్గా గాలి తీసుకోలేడు. ఆయాసం, దగ్గు ఇబ్బంది పెడతాయి. ఇలా దీర్ఘకాలం పాటు వాయునాళాలు వాపునకు గురయ్యే పరిస్థితినే ‘ఆస్తమా’ అంటారు.
కారణాలు అనేకం
వ్యాధి లక్షణాలు
ఆస్తమా నుంచి ఉపశమనానికి మూడు చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానమైంది ఇన్హెలేషన్ థెరపీ, రెండోది మాత్రల ద్వారా చేసే చికిత్స. మూడోది ఇంజక్షన్ రూపంలో ఇచ్చే వైద్యం. ఇన్హెలేషన్ థెరపీ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందిన అత్యుత్తమ విధానం. ఔషధం నేరుగా వాయు మార్గం గుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి తక్షణం పనిచేస్తుంది. అదే మాత్రలు, సిరప్లు, ఇంజక్షన్లు అయితే, మొదట రక్తంలోకి వెళ్లి చిట్టచివరకు ఊపిరితిత్తులను చేరుకొని పని ప్రారంభిస్తాయి. అందుకు కొంత సమయం పడుతుంది కూడా. అప్పటి వరకు రోగి నరకయాతన పడాల్సిందే. అంతే కాకుండా, ఈ ఔషధాలు రక్తంలో కలవడం వల్ల శరీరంలోని ఇతర భాగాలకు చేరిపోయి, దుష్ప్రభావం చూపుతాయి. ఇన్హేలర్లు రెండు రకాలు. ఒకటి – రిలీవర్స్, తాత్కాలిక ఉపశమనం కలిగించేవి. రెండు-ప్రివెంటర్స్, దీర్ఘకాలం వ్యాధిని అదుపులో ఉంచేవి. చాలామంది, అవగాహన లోపం వల్ల తాత్కాలికంగా ఊరట కలిగించే ఇన్హేలర్ థెరపీ వైపే మొగ్గుచూపుతారు. ఈ థెరపీలో చెడు ప్రభావాలు కూడా ఉండవు. ఇతర ఔషధాలతో పోల్చితే ఇన్ హేలర్స్ ద్వారా ఇచ్చే ఔషధాలు చాలా తక్కువ డోసేజీని కలిగి ఉంటాయి. కాబట్టి, నిరభ్యంతరంగా ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. రోగులు కూడా సంతృప్తికరంగా ఉన్నారు.
ఇన్హేలర్ థెరపీని మూడు నెలల పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు ఎవరికైనా ఇవ్వవచ్చు. ఆస్తమాకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య విధానాల్లో ఇన్హెలేషన్ థెరపీనే సురక్షిత విధానం. వ్యాధిని పూర్తిగా అదుపు చేసి, సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ఇన్హెలేషన్ థెరపీని పౌడర్ రూపంలో, వాయు రూపంలో ఇస్తారు. నెబ్యులైజర్ ద్వారా కూడా వైద్యం అందిస్తారు. మందును జల్లుల రూపంలో రోగి పీల్చుకుంటాడు.
– డాక్టర్ విష్ణున్రావు వీరపనేని,
అలర్జీ-ఆస్తమా-గురక వైద్య నిపుణులు,
శ్వాస హాస్పిటల్, నారాయణగూడ
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పల్లెల్లో కంటే హైదరాబాద్లోనే ఎక్కువ అవుతున్న డయాబెటిస్ రోగులు.. ఎందుకంటే..
Child Health | మీ పిల్లలు నులిపురుగులతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా నివారించండి
Spondylitis | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
Food and Age : ఈ ఆహారాలు తీసుకోండి.. జీవితకాలం పెంచుకోండి.. అవి ఏవంటే..?