‘ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. రొటీన్‌కు భిన్నంగా ప్రయోగాత్మక కథ, కథనాలతో చేసిన సినిమాలను ఇష్టపడుతున్నారు. ‘సైకో వర్మ’ ఆ జాబితాలో నిలుస్తుంది’ అని అన్నారు నట్టి క్రాంతి. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నట్టికుమార్ దర్శకత్వం వహించారు. కరుణ, లక్ష్మి నిర్మించారు. ఈ నెల 21న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో నట్టి క్రాంతి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘వర్మ అనే సైకో కథ ఇది. అనుబంధాలకు విలువనివ్వని అతడు ఎలా ప్రేమలో పడ్డాడు?ఇద్దరమ్మాయిల కారణంగా ఆ సైకో జీవితం ఏ విధంగా మారిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. క్రైమ్, థ్రిల్లర్ అంశాలకు ప్రేమకథను జోడించి తెరకెక్కించాం. పతాక ఘట్టాలు కన్నీళ్లుపెట్టిస్తాయి. రామ్‌గోపాల్‌వర్మ జీవితంతో ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. కథానుగుణంగానే టైటిల్ పెట్టాం. హీరోగా ఇదే నా మొదటి సినిమా. వైజాగ్ సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నా. నా నటన బాగుందని నాన్న ప్రశంసించారు. ఆయనే ఈ సినిమాకు దర్శకుడు కావడంతో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా నటించా. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను విడుదలచేస్తున్నాం. భవిష్యత్తులో నటనతో పాటు నిర్మాణ బాధ్యతల్ని కొనసాగిస్తా’ అన్నారు.