భారత విదేశాంగ విధానంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ పూర్వ నేత యశ్వంత్ సిన్హా విమర్శలు గుప్పించారు. విదేశాంగ విధానాన్ని ప్రధాని మోదీ పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవడం, విదేశాంగ విధానం మొత్తం తన చుట్టూ తిరిగేలా (పర్సనలైజ్) చేయడం వల్ల దేశానికి హాని జరుగుతున్నదని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ మాజీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో యశ్వంత్ సిన్హా ఈ విధంగా స్పందించారు. ఆ ఇంటర్వ్యూలో సిన్హా తన మనసులోని పలు భావాలను పంచుకున్నారు. 1971లో బంగ్లా విముక్తి పోరు, 1984లో ఇందిరాగాంధీ హత్య, తదనంతరం రాజీవ్‌గాంధీ భారీ విజయం సాధించడం.. ఆ తర్వాత నవీన భారత్ రూపొందడానికి దోహదం చేసిన రాజకీయ, ఆర్థిక విధానాలపై వారు చర్చించారు.
మోదీ హయాంలో భారత విదేశాంగ విధానాన్ని సిన్హా విమర్శించారు. ‘విదేశాంగ విధానాన్ని మోదీ పూర్తిగా పర్సనలైజ్ చేసేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఆ స్థాయి లేదు. మాలి రాజధాని టింబక్టూకి తప్ప, మోదీ అన్ని ప్రాంతాలను సందర్శించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటాడు. మరి ఫలితం ఏది? పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ రుణం ఇచ్చినప్పుడు ఏ దేశం కూడా భారత్‌కు మద్దతు ఇవ్వలేదు’ అని సిన్హా తెలపడం గమనార్హం. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో సిన్హా విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. ‘దక్షిణాసియాలోని మన పొరుగు దేశాల్లో ఏ ఒక్కరితోనూ మనకు సత్సంబంధాలు లేవు. ఇజ్రాయెల్, తైవాన్, తాలిబన్లతో మాత్రమే మనకు మంచి సంబంధాలు ఉన్నాయి’ అని సిన్హా ఎద్దేవా చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ పహల్గాం ఘటన జరగడం, ఆ తర్వాత వెంటనే ఆపరేషన్ సిందూర్ చేపట్టడంపై సిన్హా విస్మయం వ్యక్తం చేశారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కేనని అభిప్రాయపడ్డారు. దేశ భద్రత అంశాన్ని ఎన్నికల్లో లబ్ధి కోసం మోదీ సర్కారు వాడుకుంటున్నదని విమర్శించారు. పుల్వామా, యురి పేరు చెప్పుకొని మోదీ ఓట్లు అడిగారని తీవ్రంగా స్పందించారు.
‘పహల్గాం ఉగ్రదాడి తర్వాత సమాధానాలు లేని అనేక ప్రశ్నలు మిగిలిపోయాయి. పుల్వామా, యురిలో ఏం జరిగిందో మనకు ఇప్పటికీ స్పష్టత లేదు. పహల్గాం విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఉగ్రదాడి చేసిందెవరు? వారు ఏమయ్యారు?’ అని సిన్హా ప్రశ్నించారు.
ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించకపోవడాన్ని సిన్హా ప్రస్తావించారు. ‘మీడియాను మోదీ ఎదుర్కొలేరు. టెలిప్రాంప్టర్ లేకపోతే ఆయన మాట్లాడలేరు’ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి పదేపదే చెప్పడాన్ని సిన్హాతోపాటు కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు. ప్రజలకు కనీసం ట్రిలియన్ అనే పదానికి అర్థం కూడా తెలియదని, తలసరి ఆదాయం పెంచకుండా ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గురించి మాట్లాడటంలో అర్థం లేదని వారు విమర్శించారు.
1971లో బంగ్లా విముక్తి పోరాటం సమయంలో భారత దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు తన రాజకీయ ప్రత్యర్థి అయిన జయప్రకాశ్ నారాయణ్‌ను భారత దౌత్య ప్రతినిధిగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పంపించిన ఘటనను సిన్హా గుర్తుచేసుకున్నారు. 1971 వేసవి కాలంలో ఆరు వారాల వ్యవధిలో మాస్కో, లండన్, హెల్సింకి, వాషింగ్టన్ సహా 16 దేశాల రాజధానులను జయప్రకాశ్ సందర్శించారు. బంగ్లా ఏర్పాటు పట్ల భారత విధానాన్ని ఆయా దేశాలకు వివరించారు. ‘జయప్రకాశ్ నారాయణ్‌ను ఇందిరాగాంధీజీ సంప్రదించడం, ఆయన అందుకు అంగీకరించడాన్ని ఎవరైనా ఊహించగలరా? ఆ రోజులే వేరు’ అని సిన్హా అన్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత విదేశాల్లో భారత వాణిని వినిపించేందుకు నరేంద్రమోదీ సర్కారు ప్రతిపక్ష పార్టీలను సంప్రదించకుండానే పలువురు విపక్ష నేతల పేర్లను దౌత్య ప్రతినిధుల జాబితాలో చేర్చింది. ఈ చర్యపై విమర్శలు వచ్చాక ప్రతిపక్ష పార్టీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంప్రదించారు.
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తీరుపై కూడా సిన్హా సందేహాలు వ్యక్తం చేశారు. పీవోకే, పాక్‌లో ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడమే భారత్ ఉద్దేశమైతే, అది నెరవేరినప్పుడు వెంటనే ప్రధాని మోదీ ఏకపక్షంగా కాల్పుల విరమణను ఎందుకు ప్రకటించలేదు? ఇదేమైనా 100 మీటర్ల రేసా.. ట్రంప్ వెంటనే ప్రకటించడానికి? అమెరికా పరిపాలనా విభాగం, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి రూబియో మొదటినుంచి ఒకే మాట మీద ఉన్నారు. మోదీ మాత్రం ఈ విషయమై పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు’ అని సిన్హా విమర్శించారు.
పాత, కొత్త బీజేపీలను సిన్హా పోల్చారు. పాత బీజేపీ మతోన్మాద పార్టీ కాదని, కొత్త బీజేపీ ప్రజలను విడగొట్టి పాలిస్తున్నదని ఆరోపించారు. పార్లమెంట్లో తాను గడిపిన రోజులను గుర్తుచేసుకున్న సిన్హా.. ఇప్పటి భారత్ కంటే అప్పటి భారత్‌నే తాను ఇష్టపడతానని చెప్పారు.
‘వాజపేయి, చంద్రశేఖర్, పీవీ మంచి మిత్రులు. వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు సభలో వాడీవేడీ చర్చ జరిగేది. అది అక్కడితోనే ముగిసేది. ఒక్కసారి సభ బయటికి వస్తే, సెంట్రల్ హాల్లో వారు నవ్వుతూ మాట్లాడుకునేవారు. సభ వాతావరణం ఎప్పుడూ విషపూరితం కాలేదు. సభ చర్చలో ఎన్నడూ వ్యక్తిగత విమర్శలు, దాడులు జరిగేవి కావు’ అని సిన్హా నాటి రోజులను నెమరువేసుకున్నారు. ‘యూపీఏ హయాంలో ఒకనాడు తీవ్ర చర్చ జరిగి సభ వాయిదా పడింది. ఆ తర్వాత ప్రతిపక్ష సభ్యుల వద్దకు వచ్చి తాను మరీ ఎక్కువ కఠినంగా మాట్లాడానా? అని ప్రణబ్ ముఖర్జీ అడిగారు. అప్పుడు సాధారణం కంటే ఎక్కువ కోపంగా మాట్లాడావని, సభ మొదలయ్యాక క్షమాపణలు కోరితే అంతా సర్దుకుంటుందని నేను చెప్పాను. ఆయన అలాగే చేశారు. అలాంటి సభా వాతావరణం ఇప్పుడు లేనే లేదు’ అని సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు.