తుఫాన్లు తరుముతుంటే బతుకు జీవుడా అంటూ జనం సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయడం, దుర్భరమైన వడగాలులకు పొలాల్లోని, ఫ్యాక్టరీల్లోని పనివారు, విహారయాత్రలకు వచ్చిన యాత్రికులు సొమ్మసిల్లి పడిపోవడం, వరదలు ఊళ్లను ముంచెత్తి బీభత్సం సృష్టించడం, కరవుకాటకాలతో పంటలెండుతుంటే ఆకలి కేకలు మిన్నంటడం.. ఇవీ మానవ కల్పిత ప్రకృతి విధ్వంసం వల్ల 2024లో ప్రపంచ దేశాలు చూసిన కల్లోలాలు. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రపంచంలోని ఏ ఒక్క దేశమూ ఈ దుష్ప్రభావాల నుంచి తప్పించుకోలేకపోతున్నది. 2015 నుంచి 2024 మధ్యకాలంలో భూమి రికార్డు స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రతలతో ఉడికిపోయింది. ఇక 2024 సంవత్సరమైతే వేడిమిలో రికార్డులు బద్దలు కొట్టింది. ఇంతటి ఆందోళనకరమైన పొగలు, సెగల మధ్య అజర్బైజాన్ రాజధాని బాకూలో కాప్ 29 పర్యావరణ సదస్సు ప్రారంభమైంది. ఈ ఏడాది జరిగిన పరిణామాలు మరువరాని గుణపాఠమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరెస్ ప్రారంభోపన్యాసంలో చేసిన హెచ్చరిక ప్రత్యక్షర సత్యం.
సంపన్న దేశాల వాటా పెంపుపై సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాటైన బాకూ సదస్సును ‘ఫైనాన్స్ కాప్’ అని కూడా పిలుస్తున్నారు. పర్యావరణ అనుకూల ఇంధనానికి మారడంతో పాటు భూతాప సమస్యల పరిష్కారం కోసం వర్ధమాన దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించేందుకు 2009లో సంపన్న దేశాలు అంగీకరించాయి. అయితే, ఆ చెల్లింపులు 2020లో మొదలయ్యాయి. 2022లో మాత్రమే పూర్తిస్థాయి చెల్లింపులు జరిగాయి. ఈ ఏడాది అంటే 2024తో ఈ చెల్లింపుల గడువు తీరిపోతుంది. వచ్చే ఏడాది నుంచి కేటాయింపులు భారీగా పెరగాలని భారత్ సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశా లు బాకూ సదస్సులో రెండవ రోజైన బుధవారం పట్టుబట్టాయి. అంతేకాకుండా పెట్టుబడులు, సాంకేతికత బదిలీ అవసరం ఎంతైనా ఉన్నదని, పైగా ఎలాంటి వివక్షలు లేకుండా అన్ని దేశాలకు సమాన స్థాయిలో సహాయం అందించాలని కూడా నొక్కిచెప్తున్నాయి. పర్యావరణ మార్పు లు ఆరోగ్యంపైనే కాకుండా, ఆర్థికంగానూ ప్రభావితం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దిగజారుతున్న పర్యావరణ పరిస్థితులు ద్రవ్యోల్బ ణానికి ఎప్పటికప్పుడు కొత్త జీవం పోస్తాయని, ప్రభుత్వాలపై, ప్రజ లపై భారీగా ఆర్థికభారం మోపుతాయని ఐరాస పర్యావరణ విభాగం ఉన్నతాధికారి సైమన్ స్టియన్ హెచ్చరించడం గమనార్హం.
వాతావరణ మార్పుల సమస్యను కొట్టిపారేసే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికైన నేపథ్యంలో అమెరికా సాయం తగ్గుతుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే గనుక జరిగితే నిధులకు భారీ లోటు ఏర్పడుతుంది. ఇతర దాత దేశాలు ఆ లోటును పూడ్చటం అంత సులభం కాదు. మరోవైపు చైనా వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, చమురు సంపద కలిగిన గల్ఫ్ దేశాలు సైతం తమ వంతుగా పర్యావరణ సహాయాన్ని సమకూర్చాలని సంపన్న దేశాలు వాదిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి దీర్ఘకాలిక పారిశ్రామిక దేశాలతో సమానమైన జవాబుదారీ తనకు ఉండదని చైనా అంటున్నది. ఈ తరహా మల్లగుల్లాల కారణంగా నవంబర్ 22న సదస్సు ముగిసే నాటికి నిధుల పరిమాణం భారీగా పెంచే విషయమై ఏకాభిప్రాయం కుదురుతుందో, లేదో తెలియడం లేదు. భూతాపం తగ్గింపుపై చల్లని వార్త కోసం బాకూ సదస్సు వైపు ప్రపంచం ఆశగా చూస్తున్నది. మహోత్పాతం దిశగా మానవాళి వేగంగా పరుగెడుతున్నందున పర్యావరణ పరిరక్షణకు వెచ్చించాల్సిన నిధులపై సంపన్న దేశాలు విశాల హృదయంతో ముందుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.