యూకేలోని వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ నితాషా కౌల్ రాజకీయాలు, అంతర్జాతీయ వ్యవహారాల్లో నిష్ణాతురాలు. 1997లో హాల్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అభ్యసించేందుకు యూకేకు వెళ్లిన ఆమె అక్కడే స్థిరపడ్డారు. ఆమె అనేక పుస్తకాలు రచించారు. అంతేకాదు ప్రజాస్వామ్యం, రైటిస్ట్, భారతీయ రాజకీయాలు, కశ్మీర్ వంటి అంశాలపై 150కి పైగా వ్యాసాలూ రాశారు.
బ్రిటిష్ పౌరసత్వం కలిగిన కౌల్‌కు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ద్వారా ఆమె తన జన్మభూమితో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఓసీఐ అనేది విదేశీ పౌరసత్వం కలిగిన భారత సంతతి వ్యక్తులకు ఇచ్చే ప్రత్యేక గుర్తింపు. దీని వల్ల భారత్‌ను సందర్శించేందుకు జీవితకాల వీసా సౌకర్యం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది భారత సంతతి ప్రజలకు ఈ ప్రత్యేక హోదా ఉన్నది. అయితే, ఈ ఏడాది మే నెలలో కౌల్ ఓసీఐ గుర్తింపు రద్దయ్యింది.
1955 భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 7డీ ప్రకారం కింది కారణాల వల్ల ఓసీఐని రద్దు చేసే అధికారం భారత ప్రభుత్వానికి ఉంటుంది. ఆ కారణాలు ఇలా ఉన్నాయి. 1. మోసం చేయడం, 2. భారత రాజ్యాంగం పట్ల అసంతృప్తి వ్యక్తపరచడం, 3. యుద్ధ సమయంలో శత్రు దేశంతో సంబంధాలు కలిగి ఉండటం, 4. రెండు సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడటం, 5. భారతదేశ సార్వభౌమత్వం, భద్రత, విదే శీ సంబంధాలు లేదా సాధారణ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే ఓసీఐని ప్రభుత్వం రద్దు చేయవచ్చు. అయితే, ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఏమీ పనిచేయడం లేదు. కానీ, సర్కారు చర్యలు మాత్రం తీవ్రమైన చట్టపరమైన, మానవ హక్కుల ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. చట్టపరంగా చర్యలు తీసుకోవడం, ఉద్దేశపూర్వక నియంత్రణ మధ్య ఉన్న సన్నని గీతను ప్రభుత్వ చర్యలు చెరిపివేస్తున్నాయి. పారదర్శకత లేకపోవడం, విధివిధానాలను పాటించకుండానే ఇలా తరచూ ఓసీఐని రద్దు చేయడం జరుగుతున్నది. ఇది చట్ట ఉల్లంఘనకు దారితీస్తున్నది. ఈ ధోరణి స్వేచ్ఛాయుత వాక్స్వాతంత్య్రం, చట్టాలను పాటించ కపోవడం లాంటి ఆందోళనలను లేవనెత్తుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని న్యాయస్థానాలు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నాయి.
కౌల్ విషయానికి వస్తే, ఓసీఐ రద్దయినట్టు ఆమెకు అధికారిక నోటీసు ద్వారా తెలియజేశారు. భారతదేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు, ద్వేషంతో వాస్తవాలు లేదా చరిత్రను వక్రీకరించినట్టు ఆ నోటీసులో పేర్కొన్నారు. కానీ, అందుకు సంబంధించి ఎటువంటి నిర్దిష్ట ఆధారాలను జతచేయలేదు. కౌల్ భారతదేశంలో ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల కోసం ఓ న్యాయవాదిగా పోరాడుతున్నారు. మైనారిటీలపై దాడులు, హిందూ జాతీయవాద సంస్థ ఆరెస్సెస్ విభజన రాజకీయాలను ఆమె విమర్శించేవారు. కౌల్ చేసిన విశ్లేషణలు వాస్తవాలని, చరిత్రను విస్మరించలేదని ప్రపంచ ప్రజాస్వామ్య సూచీలను పరిశీలిస్తే తెలుస్తుంది. గ్లోబల్ ఫ్రీడం ఇండెక్స్ తన సూచీలో భారతదేశానికి ‘పాక్షిక స్వేచ్ఛాయుత’ ర్యాంకు కేటాయించింది. ‘ప్రధాని మోదీ, హిందూ జాతీయవాద బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింల పట్ల వివక్షాపూరిత విధానాన్ని అవలంబిస్తున్నది. తత్ఫలితంగా ముస్లింలపై దాడులు పెరిగాయి’ అని గ్లోబల్ ఫ్రీడం ఇండెక్స్ పేర్కొంది. మతం, పత్రికా స్వేచ్ఛలో కూడా ఈ ధోరణి కనిపిస్తున్నది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) ప్రకారం.. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత మీడియా అనధికారిక ఆత్యయిక స్థితిలోకి జారిపోయింది.
కౌల్ ఒక్కరే కాదు, ఇలా తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తున్న చాలా మంది అణచివేతలను ఎదుర్కొంటున్నారు. గత తొమ్మిదేండ్లలో 120 పైచిలుకు ఓసీఐలను కేంద్ర ప్రభుత్వ అధికారులు రద్దు చేశారు. స్వతంత్ర వార్తా సంస్థ ‘ది వైర్’ ప్రకారం ఈ ధోరణి వేగంగా పెరుగుతున్నది.
అందులో దాదాపు సగం (57) ఓసీఐలు 2024లో రద్దయ్యాయి. 2025 మొదటి ఐదు నెలల్లో మరో 15 రద్దయ్యాయి. ఓసీఐలు రద్దు అయిన వారిలో చాలామంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను విమర్శించే జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, హిందుత్వను (హిందూ జాతీయవాదం) వ్యతిరేకించే వారు ఉన్నారు. 2022లో సోషల్ మీడియా పోస్టులను సాకుగా చూపుతూ స్వీడన్లో ఉంటున్న విద్యావేత్త అశోక్ స్వేన్ ఓసీఐని రద్దు చేశారు. ఆయన మతపరమైన భావనలను దెబ్బతీశారని, భారతదేశ సామాజిక నిర్మాణాన్ని అస్థిరపరిచారని అధికారులు ఆరోపించారు. కానీ, అందుకు నిర్దిష్టమైన ఆధారాలు చూపలేదు. ఈ రద్దును సవాల్ చేస్తూ 2023లో స్వేన్ ఢిల్లీ హైకోర్టులో కేసువేసి గెలిచారు. ప్రభుత్వ చర్యల ను దేశంలోని న్యాయస్థానాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 2023 డిసెంబర్లో యూకేలోని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ జర్నలిస్ట్ రాఫెల్ సాటర్ సైబర్ సెక్యూరిటీ, గూఢచర్యం, అధికార దుర్వినియోగం తదితర అంశాలపై విమర్శనాత్మక రిపోర్టింగ్ చేశారు. దాంతో ఆయన కూడా ఓసీఐని కోల్పోయారు. ప్రస్తుతం భారత ప్రభుత్వంపై దావా వేయాలని ఆయన చూస్తున్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశంలోని ప్రజాస్వామ్య సంస్థలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానాలను విమర్శించే లేదా ప్రశ్నించే రాజకీయ నాయకులు, ఎన్జీవో ప్రతినిధులు, జర్నలిస్టులు, ఇతర ప్రతినిధుల గొంతులను నొక్కుతున్నారు. విమర్శకులపై దాడులు, బెదిరింపులు, నిందలు వేయడం, జైల్లో నిర్బంధించ డం లాంటి వార్తలు నిత్యం చూస్తున్నాం. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ ధోరణి ఎక్కువైంది. ఆపరేషన్ సిందూర్ అనంతరం ‘ఎక్స్’లో దాదాపు 8 వేల ఖాతాలను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులో ‘ఫ్రీ ప్రెస్ కశ్మీర్’, ‘బీబీసీ ఉర్దూ’, ‘ది వైర్’ వంటి మీడియా సంస్థలు, జర్నలిస్టుల ఖాతాలే ఎక్కు వ ఉన్నాయి. స్వదేశంలో విమర్శకుల గొంతుకలను నొక్కిన తర్వాత కేంద్రం విదేశాల్లోని భారత సంతతి గొంతుకలపై దృష్టి సారించింది. ఇమ్మిగ్రేషన్ కంట్రోల్‌ను భారత అధికారులు ఒక ఆయుధంగా మార్చుకుంటుండటం పెరుగుతున్న ఈ ధోరణికి సూచిక. విమర్శకుల్లో భయాన్ని సృష్టించడానికి, అణచివేయడానికి ఇలా చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
2024 ఆర్ఎస్ఎఫ్ నివేదిక ప్రకారం.. జర్నలిస్టుల గొంతు నొక్కేందుకు ఓసీఐని భారత అధికారులు ఒక ‘బ్లాక్మెయిల్”గా ఉపయోగిస్తున్నారు. గతేడాది ప్లాట్‌ఫామ్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ నిర్వహించిన ఓ సర్వేలో 54 శాతం బ్రిటిష్ ఇండియన్లు భారత ప్రస్తుత దశ దిశ గురించి ఆందోళన వ్యక్తంచేశారు.
చాలామంది బ్రిటిష్ ఇండియన్లు భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనల గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు. ఆ విషయంపై మాట్లాడితే వారిని కూడా భారతదేశంలో అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటారనే భయాందోళనే అందుకు కారణం. బ్రిటిష్ ఇండియన్లుగా మేము ఈ నియంత్రణల దుర్వినియోగాన్ని ప్రతిఘటించాల్సి ఉన్నది. కుటుంబాలు, స్నేహితులు, సంస్కృతి, సమాజం తదితరాల ద్వారా భారతదేశంతో బ్రిటిష్ ఇండియన్లు అనుబంధాన్ని కలిగి ఉన్నారు. బీజేపీ సర్కారు చేస్తున్న ఈ ఓసీఐల రద్దు, భారత సంతతి ప్రజల స్వేచ్ఛను హరించాలని చూడటం.. దేశానికి స్వాతంత్య్రానంతరం రాజ్యాంగంలో నిర్దేశించిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ విలువలకు వ్యతిరేకం. 20 లక్షల మందికి పైగా బ్రిటిష్ ఇండియన్లకు యూకే నిలయం. అయినప్పటికీ, భారత్‌లో ప్రజాస్వామ్య వెనుకబాటుతనం గురించి ఎలాంటి ఆందోళన లేకుండా ఇటీవల భారత్‌తో ఒక ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాన్ని యూకే కుదుర్చుకుంది. భారత్‌తో ప్రత్యేక సంబంధం, బ్రిటిష్ ఇండియన్ జనాభా తదితర కారణాల వల్ల ప్రస్తుత భారత రాజకీయ వ్యవస్థను సవాలు చేసే ప్రశ్నలను వేసేందుకు యూకే బలమైన స్థానంలో ఉంది. కానీ, అలా చేయకుండా నిశ్శబ్దంగా ఉండటం బీజేపీకి మరింత బలాన్నిస్తుంది.
మాతృభూమి అభివృద్ధికి విదేశాల్లోని భారతీయులు కూడా సహకరించాలని ప్రధాని మోదీ పిలుపునిస్తుంటారు. ఇందులో భయం లేకుండా విమర్శించే, ప్రశ్నించే హక్కు కూడా ఉండాలి. భారత ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై అణచివేత ఇలాగే కొనసాగితే మాత్రం బీజేపీ సర్కారు పెట్టే షరతులకు లోబడి మాత్రమే మేం మా మాతృభూమిని సందర్శించగలం. దీనివల్ల భారతదేశ అభివృద్ధిలో మేము భాగమయ్యే అవకాశాలు తగ్గుతాయి. భారతి సంతతిని స్వదేశంతో అనుసంధానించే మూలాలు భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణానికి కీలకం. వాటిని తుంచివేయాలనుకోవడం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేస్తుంది.
(వ్యాసకర్త: బ్రిటన్‌లోని ఫ్లాట్‌ఫాం ఫర్ ఇండియన్ డెమోక్రసీ నిర్వాహకులు) (అల్‌జజీరా సౌజన్యంతో..)
– రౌల్ లాయి