మీరు వాకింగ్‌కు వెళ్లిన ప్రతీసారి, డాక్యుమెంట్‌ను ప్రింట్ తీయించుకున్న ప్రతీసారి లేదా సాదాసీదాగా చెప్పాలంటే.. మీ శరీరాంగాలు సజావుగా కలిగి ఉన్నందుకు మీపై పన్ను విధిస్తే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. లక్షలాది మంది వికలాంగ భారతీయులు నిత్యం ఎదుర్కొంటున్న స్పష్టమైన అన్యాయం ఇది. అన్యాయంగా, అసంబద్ధంగా అనిపించినప్పటికీ జీఎస్టీ వల్ల జరుగుతున్న దుష్పరిణామమిది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఏడేండ్లుగా కృత్రిమ అవయవాలు, బ్రెయిలర్లు, వీల్చెయిర్లు కలిగిన వికలాంగులు తమకు సాయమందిస్తున్న పరికరాలపై అదనంగా 5 శాతం పన్ను చెల్లిస్తున్నారు.
దేశంలోని పన్ను విధాన రూపకర్తలు ఇలాంటి పాలసీని రూపొందించారు. ఇది వికలాంగుల పట్ల వివక్ష చూపడమే కాకుండా, వారిపై జరిమానా విధించడం కూడా. వికలాంగుల పట్ల ప్రధాని మోదీకి ఉన్న శ్రద్ధను చూసి ఆశ్చర్యం కలుగుతున్నది. వికలాంగులను ‘దివ్యాంగ్’ అని పిలుస్తారు. దివ్యాంగ్ అంటే హిందీలో దైవ అంశ అని అర్థం. నడక, నేర్చుకోవడంపై ప్రభావం చూపుతున్న ఈ విధానం ఆర్టికల్ 14 ప్రకారం.. రాజ్యాంగం ముందు చెల్లుబాటు కాదు. ఎలాంటి సంక్లిష్టమైన, చట్టపరమైన సూత్రాలను తెలుసుకోకుండానే సామాన్యుడు సైతం ఈ విధానం వెనకున్న అన్యాయం ఏమిటో అర్థం చేసుకోగలడు.
రూ.లక్ష విలువ చేసే వీల్‌చైర్‌పై ఐదు శాతం పన్ను చెల్లిస్తున్న వ్యవహారాన్ని తీసుకుందాం. ఒకవేళ వీల్‌చైర్ జీవితకాలం 500 కిలోమీటర్లు అనుకుందాం. అంటే.. సదరు దివ్యాంగుడు ఒక్కో కిలోమీటర్‌పై రూ.10 పన్ను చెల్లించాల్సి వస్తున్నది. అలాగే బ్రెయిలీ పబ్లిషర్ వాడే అంధుడు దానిపై పన్ను చెల్లించక తప్పదు. సదరు వ్యక్తి అంధుడు అయినందుకు అతనిపై విధిస్తున్న అదనపు లెవీ ఇది. దివ్యాంగులు నడిచేందుకు, జ్ఞానాన్ని పొందేందుకు వినియోగించే ఇలాంటి పరికరాలపై పన్ను విధించడం స్పష్టమైన వివక్షే.
ప్రభుత్వాలు విధించే పన్నుల రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు పరీక్షించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సకాళ్ పేపర్స్ (1961), ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (1984), ఆశీర్వాద్ ఫిల్మ్స్ (2007) కేసులు ఈ కోవకు చెందినవే. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఎలాంటి పన్ను, సెస్సు లేదా డ్యూటీలకైనా మన న్యాయమూర్తులు అడ్డుకట్ట వేయగలరు. సకాళ్ పేపర్స్ కేసునే తీసుకుంటే.. ప్రకటనలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రకటనలపై ఆంక్షల వల్ల పత్రిక సర్క్యులేషన్ తగ్గిపోతుందని, దానివల్ల ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం.. పౌరుల ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్య్రంపై ప్రభావం పడుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు విచారణ సందర్భంగా పేర్కొంది. అదేవిధంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కేసులో న్యూస్‌ప్రింట్‌పై విధించిన కస్టమ్స్ డ్యూటీని కొట్టివేసింది. 2007లో ఏపీ ప్రభుత్వం తెలుగేతర సినిమాపై విధించిన లెవీని సుప్రీంకోర్టు రద్దు చేసింది. తెలుగేతర సినిమాపై పన్ను విధించడాన్ని సామాజిక విభజనగా న్యాయస్థానం అభివర్ణించింది.
దివ్యాంగులు వినియోగించే పరికరాలపై విధించిన పన్ను అందుకు భిన్నమైనదేమీ కాదు. ఈ పన్ను దివ్యాంగులకు వ్యతిరేకంగా మూస పద్ధతులను కొనసాగించే ప్రభావాన్ని కలిగి ఉంది. వారి ప్రాథమిక విధులైన నడవడం, చదవడంపై పన్ను విధించడమంటే స్పష్టంగా వారి వైకల్యంపై జరిమానా విధించడమే. 2024లో ఇలాంటి పన్ను పుస్తకాల్లో ఉండకూడదు. జన్మస్థలం (ప్లేస్ ఆఫ్ బర్త్) ఆధారంగా వివక్షను నిరోధించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ముందు పరీక్షకు ఇది నిలవదు. ఈ ఆర్టికల్‌లోని ‘ప్లేస్ ఆఫ్ బర్త్’ అనే నిబంధనకు సమగ్రమైన వివరణ ఇవ్వాలి. అంతేకాదు, దివ్యాంగులను అందులో చేర్చాలి. ఈ పన్నును కచ్చితంగా రద్దు చేయాలి. వాస్తవానికి 2016లో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అందులోని సెక్షన్ 3 దివ్యాంగుల పట్ల వివక్షను నిషేధిస్తుంది. 2021లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ లెఫ్టినెంట్ కల్నల్ నితీషాకు సంబంధించిన కేసు విషయంలో వివక్షపై కీలక తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా సమానత్వ భావనకు పరోక్ష వివక్షను గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దివ్యాంగుల పరికరాలపై వసూలు చేస్తున్న జీఎస్టీ చాలా తక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ ఇది వారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. వారి ప్రాథమిక హక్కులైన నడక, చదవడంపై పన్ను విధించడం ద్వారా వారికి సాధికారతపై కాకుండా, ఆత్మన్యూనతపై సందేశం ఇచ్చినట్టు అవుతుంది.
(‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
– జై అనంత్ దేహద్రాయ్