పశ్చిమ చాళుక్యులనే కళ్యాణి చాళుక్యులుగా వ్యవహరిస్తారు. వీరు తెలంగాణలో చాలా ప్రాంతాలను పాలించినారు. వారి శాసనాలు ఎక్కువగా కన్నడలో, కొన్ని తెలుగులో ఉన్నాయి. పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన త్రిభువనమల్ల దేవుని కాలం నాటి శాసనం ఒకటి పూర్వపు మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని మాలపహాడ్లో ఉన్నది. శాసన కాలం చాళుక్య విక్రమశకం 26 = శ.సం. 1023 = క్రీ.శ 1101.
వృష సంవత్సరం, వైశాఖ బహుళ అమావాస్య సూర్యగ్రహణ సమయం.చాళుక్య త్రిభువనమల్ల దేవుని మహా ప్రధాని అయిన సోమేశ్వర భట్టరు సిరిగొప్ప గ్రామంలోని సోమేశ్వర దేవుని ఆలయానికి ఆ గ్రామంలోని 12 మర్తురుల భూమిని సమర్పించా డు. ఈ భూమి స్వామి వారి నిత్య అంగరంగ భోగాలకు, ఇతర పూజాదికాలకు, దేవాలయంలో జీర్ణోద్ధరణకు ఇచ్చాడు. ఈ దానభూమి జరా నది, గుండేర కూడల సంగమ ప్రాంతంలో పెబ్బేశ్వర పండితుడి పాదములు కడిగి సమర్పించబడింది.
శాసనంలో సోమేశ్వర భట్టరు ‘తత్పాద పద్మోపజీవి, సమధిగత పంచ మహాశబ్ద, మహా సామంతాది, మహాప్రచణ్డదణ్డ నాయకం, శ్రీర్వేష్టాభీష్ట ఫల ప్రదాయకం, వాచక వాచస్పతి వివేక బృహస్పతి మంతృ మాణిక్యం, నీతి చాణక్యం వాణసాన్వయ సరోవర రాజహంసం, సరస్వతీ కర్ణావతంసం, పతికార్య దురంధరం నియోగ యౌగంధరం, శ్రీమత్రి భువన మల్ల దేవరాజ్య సముద్ధరణం, పతిహితా చరణ నామాది ప్రశస్తి సహితం శ్రీమన్మహా ప్రధానం మణెవెర్గెడ కర్ణాటక హెరిలాళ సన్ధి విగ్రహి దణ్డనాయకం సోమేశ్వర భట్టరు’ అని వర్ణించబడినాడు. ఈ ధర్మకార్యానికి అన్యాయం చేసినవారు వారణాసిలో గోవులను, బ్రాహ్మణులను చంపినవారవుతారు. శాసనంలో చివరగా కన్నడ భాషలో సోమేశ్వర భట్టరు సోమదేవ దండాధీశుగా చెప్పబడినాడు.
అదేవిధంగా పశ్చిమ చాళుక్యుల మహాప్రధానులు, దండనాయకులు అన్ని కార్యాలలో సిద్ధహస్తులని, రాజ్య సముద్ధరణ ధురీణులని తెలుస్తున్నది.
-భిన్నూరి మనోహరి