తెలంగాణ ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల శాసనాలు ఎక్కువగా కన్నడ, కన్నడ- తెలుగు భాషల్లో వేయించబడ్డాయి. వీరు జైనమతాన్ని, కన్నడ భాషను విశేషంగా ఆదరించి, పోషించారు. మెదక్ జిల్లాలోని పటాన్చెరువు పరిసరాలలో రామేశ్వరం గ్రామంలో చాళుక్య త్రైలోక్యమల్ల మొదటి సోమేశ్వరుని కాలంలో వేయించిన ఒక శాసనం ఉన్నది. ఇది విద్యాదానం చేసిన గురువుకు గురుభక్తితో సమర్పించిన దాన శాసనం. శాసనకాలం శ.సం.979-క్రీ.శ.1057, హేవలంబి సంవత్సరం, వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ).
చాళుక్య మొదటి సోమేశ్వరుడు పొట్లలకేరే (పటాన్చెరువు) నుంచి పరిపాలన చేస్తున్న సమయంలో రావితోరుకు చెందిన సోమేశ్వర పండితుడికి అతడు చేసిన విద్యాదానానికి భూమిని సమర్పించాడు. అదేవిధంగా లొంబలికనాడులోని మిద్దోల్లో కళ్యాణ శివపుర దేవునికి 70 మర్తుర్ల భూమి దానంగా సమర్పించాడు. ఇంకా మహా మండలేశ్వర పంపరసర్ పండితేశ్వర పండితునికి తోటను, నట్టపల్లికి వెనుక ఉన్న 7 మర్తురుల భూమిని ఈశ్వరదేవునికి సమర్పించారు. పుందూరులో 5,120 మర్తురులు కెయ్యకు చెందినది సమర్పించబడింది. మిగలనాడుకు చెందిన చాకమాలయను మహా మండలేశ్వర కందూరు బిజ్జరసుడు సర్వమనస్యంగా సమర్పించాడు. లొంబలికనాడుకు చెందిన పంపనపల్లిలోని కెరియ కొండయగుండుకు తూర్పున బీజన మాన్యం (విత్తనాల భూమి) సమర్పించారు.
ఈ శాసనాన్ని పరిశీలిస్తే చాళుక్యులు జైనమతాన్ని విపరీతంగా ఆదరించి పోషించారు. కానీ ఇందులో శివుడికి, పండితులకు, విద్యకు సంబంధించిన దానాలు ఆయా వ్యక్తులు సమర్పించినట్లు గమనించవచ్చు. ఇందులో చాళుక్య వంశ ప్రభువు, మహామండలేశ్వరుడు, సామాన్య మానవులు కూడా దానం చేసినట్లు తెలుస్తున్నది. ఒకే శాసనంలో ఆయా వ్యక్తులకు, దేవతామూర్తులకు దానం సమర్పించడం ప్రత్యేకమైన అంశంగా పరిగణించవచ్చు.
– భిన్నూరి మనోహరి