e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home ఎడిట్‌ పేజీ సబ్బండవర్ణాల సంక్షేమ ప్రదాత

సబ్బండవర్ణాల సంక్షేమ ప్రదాత

సబ్బండవర్ణాల సంక్షేమ ప్రదాత

రాజకీయాలంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు. మీ పార్టీ కన్నా మా పార్టీనే గొప్పదని పరస్పర వాదనలు తరచూ జరిగేవే. ప్రజా సంక్షేమం కోసం అధికార పార్టీ ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. ప్రతిపక్షాల నిర్మాణాత్మక విమర్శలు అవసరమే కానీ అసలు ప్రతిపక్షం అంటే కేవలం విమర్శించడమే అనుకోవడం సరికాదు. వ్యక్తిగత దూషణలతో ఏ మాత్రం ప్రయోజనం ఉండదనే విషయం తెలుసుకోవాలి.

2001లో తెలంగాణ అంశాన్ని భుజానికెత్తుకున్నది మొదలు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదాకా ప్రత్యర్థులు ఎన్నోరకాలుగా ఆయన్ను విమర్శించారు. ఆయన ఏ విమర్శలకు బెదరకుండా, ఎక్కడా నిరాశ చెందకుండా ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన తీరు అభినందనీయం. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని నిరంతరం సజీవంగా ఉంచుతూ సాగిన ఆ సుదీర్ఘ ప్రస్థానాన్ని చరిత్ర మరువదు. నాడు తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచింది. ఎవరికీ అంతుచిక్కని వ్యూహాలు, రాజీపడని మొండి పట్టుదలనే తెలంగాణ కలను సాకారం చేసింది. 2009 డిసెంబర్‌లో చిదంబరం చేసిన తెలంగాణ ప్రకటన తర్వాత సీమాంధ్ర ఎమ్మెల్యేలు నడిపించిన రాజీనామాల డ్రామాతో కేంద్రం తెలంగాణపై వెనుకంజ వేసింది. యావత్‌ తెలంగాణ నైరాశ్యంలో మునిగిపోయింది. ఆ సంక్లిష్ట సమయంలో ఏ మాత్రం ఏకాగ్రత చెదరకుండా, ప్రజలను ఉత్తేజపరుస్తూ, దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలను ఒప్పిస్తూ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలిచిన తీరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఇక అసాధ్యం అనుకున్న వాళ్లందర్నీ ముక్కు మీద వేలేసుకునేలా చేసింది. కేసీఆర్‌ మధ్యలోనే ఉద్యమాన్ని వదిలేస్తాడని ఎదురుచూసిన ఆశావాదులకు నిరాశే మిగిలింది.

‘రాష్ట్ర ఏర్పాటుతో విశ్రమిస్తే సరిపోదు. ఎన్నో సహజ వనరులున్న తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజల వెనుకబాటుతనాన్ని పోగొట్టి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సార్థకత చేకూరుతుందని’ కేసీఆర్‌ తరచూ చెప్తుంటారు. అందులో భాగంగానే ఆయన కలలుగన్న ‘బంగారు తెలంగాణ’ సాధన దిశగా గత ఏడేండ్లుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నారు. జనాభాలో 60 శాతం ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల సమస్యల మీద ఆయన సమగ్ర దృష్టిసారించారు. 19వ శతాబ్దంలో ఊపందుకున్న ప్రపంచీకరణ, యాంత్రీకరణ నేపథ్యంలో చేతివృత్తులకు ఆదరణ కోల్పోయిన వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు యాంత్రీకరణ పేరుతో జరుగుతున్న అభివృద్ధిని చూసి సంబురపడాల్న?, ఆ అభివృద్ధిలో భాగస్వాములు కాలేక వెనుకబడిన తరగతులుగా మిగిలినందుకు ఏడ్వాల్న? అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు బలహీన వర్గాల ప్రజలు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీలను ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించాలనే విషయమై సీఎం కేసీఆర్‌ 2017 ఫిబ్రవరి 20న ప్రగతిభవన్‌లో బీసీ, ఎంబీసీ నాయకులతో సుమారు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. నాటి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌, నేటి ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కూడా ఆ చర్చల్లో భాగస్వాములయ్యారు. ఆ చర్చలు జరిగిన నెల రోజుల్లోనే ఎంబీసీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి రూ.1000 కోట్ల బడ్జెట్‌ కూడా కేటాయించారు. చేతివృత్తుల్లో వేటికైతే ఆదరణ ఉన్నదో వాటికి ఆధునిక సాంకేతికత కలిగిన పనిముట్లు పంపిణీ చేసి, ఆయా వృత్తుల వారికి శిక్షణ ఇప్పించి వారి బతుకులకు భరోసా కలిగించారు. ఆదరణలేని కులవృత్తుల వారికి ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి తోడ్పడాలని నిర్ణయించారు. గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ, గంగపుత్రులకు చేప పిల్లలను సరఫరా చేసి ఉత్పత్తిని పెంచి, వారి ఆదాయ మార్గాలను బలోపేతం చేశారు.

ఊరంతా తిరిగి తాము తయారుచేసిన వస్తువులను అమ్ముకునేందుకు పూసల వృత్తివాళ్లకు మోపెడ్స్‌ను అందజేశారు. గీత కార్మికులకు బీమా సౌక ర్యం కల్పించారు. నీరా అమ్మకాలను ప్రోత్సహించారు. కుమ్మర్లకు వృతి నైపుణ్యాన్ని పెంచేవిధంగా ఆధునిక శిక్షణ ఇప్పించారు. సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు వారికి బతుకమ్మ చీరల తయారీ పనులను అప్పగించారు. ఇటీవలే దోభీఘా ట్లకు, లాండ్రీ షాపులకు, క్షౌరశాలలకు గ్రామస్థాయి నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ వరకు నెలకు 250 యూనిట్ల కరంటును ఉచితంగా సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా రాష్ట్రంలోని లక్షల మంది రజకులకు, నాయీబ్రాహ్మణులకు లబ్ధి చేకూరనున్నది.

ఇంకా కులవృత్తులు చేసుకుంటూనే బతుకాలా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమాజంలో బతుకడానికి గౌరవంతో కూడిన ఏ పని చేసినా తప్పు లేదు. ఏ రంగంలో ఆసక్తి ఉన్నవారు ఆ రంగంలో రాణిస్తారు. ఏ కులవృత్తి అయినా సమాజానికి పనికొచ్చేదే. సమాజ అవసరాలను తీర్చేదే.

ఇంగ్లీషులో ఒక సామెత ఉన్నది. ‘రోమ్‌ వాజ్‌ నాట్‌ బిల్ట్‌ ఇన్‌ ఏ డే..’ అంటే ప్రపంచ దేశాల పర్యాటకులను ఆకర్షించే రోమ్‌ నగర నిర్మాణం ఒక్కరోజులో పూర్తి కాలేదు, అది కట్టడానికి చాలాకాలం పట్టింది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒకటి, రెండేండ్లలో సమస్యలన్నీ తీరిపోవు. కేసీఆర్‌ ఒక విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి. ఉద్యమకాలంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ఆకళింపు చేసుకున్న నాయకుడు. తెలంగాణ సాధన కోసం మరణం అంచులదాకా వెళ్లివచ్చిన ఉద్యమ సారథికి తెలంగాణ పునర్నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. కాబట్టే నేడు రాష్ట్రంలోని అత్యధికులైన బీసీల అభ్యున్నతి కేసీఆర్‌తో మాత్రమే సాధ్యమనే నమ్మకం బలహీనవర్గాల్లో బలపడుతున్నది.

రాష్ట్రంలోని బీసీ గురుకులాలు వెనుకబడిన తరగతుల జీవితాలకు వరం. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 250కి పైగా బీసీ గురుకులాలను ప్రారంభించారు. ఉచితంగా పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులకు ఉచితంగా భోజనం సమకూరుస్తున్నారు. బోధనా ప్రమాణాలు మెరుగవ్వడంతో గురుకులాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

విదేశీ ఉన్నత విద్య అనేది ఖర్చుతో కూడుకున్నది. వెనుకబడిన తరగతుల్లోని పేదవారికి కలలో కూడా ఊహించనిది. కానీ
కేసీఆర్‌ ప్రభుత్వంలో తీర్చిదిద్దిన ‘మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్య’ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులకు రూ.20 లక్షల సహాయం అందుతున్నది.

సబ్బండవర్ణాల సంక్షేమ ప్రదాత

డాక్టర్‌ రవిశంకర్‌ ప్రజాపతి
(వ్యాసకర్త: ఈఎన్టీ స్పెషలిస్ట్‌, కోఠి, హైదరాబాద్‌)

ఇవి కూడా చ‌ద‌వండి..

మన ప్రవర్తనే పరిష్కారం!

సవాళ్లకు బెదరక సాగాలి

కూడవెల్లి కొత్త నడక

అంతిమ లక్ష్యం వేదాంతసారమే!

Advertisement
సబ్బండవర్ణాల సంక్షేమ ప్రదాత

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement