కాంగ్రెస్ పాలన అంటేనే ధృతరాష్ట్ర కౌగిలి అని ప్రతీతి. ధృతరాష్ర్టుని కొడుకు దుర్యోధనుడు. దుర్యోధనుని జాతకం చూసింది విదురుడు.విదురుడు కురు సామ్రాజ్యంలో తెలివైన మంత్రి. దుర్యోధనుడి చేతిలో అధికారం పెడితే ఎప్పటికైనా రాజ్యం నాశనమవుతుందని ధృతరాష్ర్టునికి విడమరిచి వివరిస్తాడు. కానీ, ధృతరాష్ర్టునికి ఇవేమి పట్టవు. పుత్ర వాత్సల్యంతో దుర్యోధనుడికే రాజ్య పరిపాలన అప్పగిస్తాడు. అయినా ధర్మ ప్రభువులు ఏ నిర్ణయం తీసుకున్నా.. హీన జనోద్ధరణకే అంటూ విదురుడు ధృతరాష్ట్ర నిర్ణయాన్ని సమర్థిస్తాడు. తర్వాత జరిగిన కురుక్షేత్ర యుద్ధం మనకు తెలిసిందే.
యుద్ధం జరుగుతున్నప్పుడు తీర్థయాత్రలతో కాలక్షేపం చేస్తాడు. ధర్మాధర్మ విచక్షణ, వివేచన శక్తి సంపన్నుడైన ధర్మాగ్రేసరుని అంతర్వాణియైన విదుర మహామంత్రికి ఈ కపటమేల అని అడిగితే..! అదే ధర్మసూక్ష్మం అంటారు పండితోత్తములు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మూడు యుగాలు సంపూర్ణమయ్యాయి. కలియుగంలోనూ ఈ ధర్మసూక్ష్మ అస్తిత్వ మనుగడ దినదిన ప్రవర్ధ మర్మం పండితులకే గానీ, పామర జనుల పుర్రెలకు జొర్రదు.
ఉత్తరాది రాజనీతి పండితురాలు, న్యాయశాస్త్రంలో పట్టాభిషక్తురాలు, తెలంగాణలో ఢిల్లీ కాంగ్రెస్ దూత మీనాక్షి నటరాజన్ కూడా ధర్మసూక్ష్మ జపకార్యమే ముందేసుకున్నరు. మహాభారతం కథల సారం తీసి కాచి వడబోసి ‘అప్నే అప్నే కురుక్షేత్ర’ నవల రాసి, విదురుని పాత్రలోనే ఒదిగిపోయిన రచయిత్రి. భూదానోద్యమానికి 75 ఏండ్లు పూర్తయినప్పుడు తెలంగాణలో ఆమె పర్యటించారు. ఇక్కడి రాజకీయ పరిస్థితులు, జనజాతుల జీవన విధానాన్ని పరిశీలించి అర్థం చేసుకున్నారు.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల్లో గెలవటం కోసం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తొక్కుతున్న అడ్డదారులు.. అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి గుప్పిస్తున్న బూటకపు హామీలు, ప్రకటిస్తున్న కపట గ్యారెంటీలు.. మోసపుటెత్తులు చూసి ఆమె కంగుతిన్నట్టు గాంధీభవన్‌లోనే చర్చ జరిగింది. ‘ఆరు గ్యారెంటీలు ఆచరణ సాధ్యం కాదు. ఇంత ఆర్థికభారాన్ని మోయగలిగే శక్తి తెలంగాణ రాష్ట్ర ఖజానాకు లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేక భావజాలం నెలకొంటుంది. పీసీసీ అధ్యక్షునికి పార్టీ కంటే పదవి మీదనే వ్యామోహం ఉన్నది. ఆయనకు రాజ్యాధికారం కట్టబెడితే కాంగ్రెస్ పతనం, వ్యవస్థల నాశనం తప్పదు’ అని రాహుల్‌గాంధీకి వివరించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కానీ, రాహుల్‌గాంధీ తెలంగాణలో అధికారంలోకి రావడమే మొదటి ప్రాధాన్యం అని తెగేసి చెప్పటంతో నటరాజన్ విదుర పాత్రలోకి ఒదిగిపోయారు. అప్పటినుంచి అబ్జర్వర్ డ్యూటీల్లో అంటీముట్టనట్టున్న మీనాక్షి, కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు విదురుడు పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లినట్టు, తెలంగాణ గడ్డ మీద శాసనసభ సంగ్రామం జరుగుతున్న వేళ తెలంగాణను వదిలేసి ఉత్తరాదికి వెళ్లిపోయారు.
రాష్ట్రం సంపూర్ణంగా ధృతరాష్ట్ర కౌగిట్లోకి కూరుకపోయాక ఢిల్లీ దూతగా మళ్లీ వచ్చారు. ఆమె ప్రయాణం ఆకాశయానం అనుకొని కాంగ్రెస్ నేతలు పూలగుచ్ఛాలు పట్టుకొని నింగి వంక చూస్తుంటే.. రైలుబండి మీద జంక్షన్లో దిగి కాంగ్రెస్ కార్యకర్తల దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు. గాంధీభవన్‌లో రాట్నం పెట్టి నూలు వడికే దృశ్య రూపంతో మీడియా వీడియో లెన్స్‌లు గిర్రున ఆమె దిక్కే తిరిగాయి. రాహుల్‌గాంధీ హార్డ్‌కోర్ టీం మెంబర్.. నిజాయితీ పరురాలు.. పైరవీలు చేయరు.. లాబీయింగ్‌లు లేవు.. అతి సాధారణ జీవనం.. ఇలా ఎవరికి తోచిన టాగ్లైన్ వారు తగిలించి మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా కథనాలు కథలు కథలుగా ప్రచారం చేశాయి.. చేస్తున్నాయి. నిజానికి ఆమె ప్రవర్తన కూడా అలాగే ఉన్నది. గతంలో ఇక్కడ పనిచేసిన ఢిల్లీ దూత ప్రదర్శించిన రాజదర్పం ఈమెలో లేదనే చెప్పవచ్చు.. కానీ కపటం మాటేమిటి? తెలంగాణలో ఫిరాయింపు రాజకీయాలకు ఆమె వత్తాసు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ కోసం చెమట తీసిన ఆడబిడ్డలను వదిలేసి విజయశాంతికి ఎమ్మెల్సీ గ్లామర్ తొడుగులేమిటి? ఇవి ఆమె కండ్ల ముందు జరిగాయా? కళ్లు మూసుకుంటే జరిగాయా? అనేది మీమాంస.
ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో 65 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. దాని మిత్రపక్షం సీపీఐ పార్టీకి ఒక్క సీటున్నది. ఈ బలంతో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉన్నది. నాలుగో అభ్యర్థి గెలుపునకు అవసరమైనంత బలం కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు. ఎంఐఎంను పార్టీని మిత్రపక్షంగా కలుపుకొని పోయినా, నాలుగో స్థానం గెలిచే అవకాశమే లేదు. అయినా నాలుగో అభ్యర్థిని నిలబెట్టారు అంటే ఫిరాయింపుదార్లను ఓటు వేయమని ఉసిగొల్పటమే కదా? ఇంకా రాజకీయ నిజాయతీ ఎక్కడిది? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి, గోడదూకి కాంగ్రెస్‌లోకి వచ్చిచేరిన 10 మంది ఎమ్మెల్యేల తీరు సుప్రీంకోర్టు తీవ్రంగానే ఆక్షేపించింది. ఫిరాయింపుదారుల మీద వైఖరి ఏమిటో చెప్పండంటూ సుప్రీంకోర్టు ఇప్పటికే మూడు దఫాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది.
అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజినబుల్ సమయం అంటే ఎంతో చెప్పాలని కీలక వాఖ్యలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా నోటీసులు జారీచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఒక పక్క అనుగుచెడిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని మీనాక్షి మెకానిజం చేస్తుంటే.. మరోపక్క నుంచి రాములమ్మ తోసుకొని వచ్చింది. బీజేపీకి చెందిన రాములమ్మ ఎన్నికల ముందు పార్టీ మారాను అనే ప్రకటన మినహాయిస్తే.. కాంగ్రెస్ పార్టీకి ఆమె చేసిందేముంది?. 15 నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. కానీ, వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి స్వర్ణ, ఖమ్మం జిల్లాలో విజయాబాయి, అదిలాబాద్ జిల్లా మంచికంటి ఆశమ్మ, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలప్రగడ అనూరాధ లాంటివాళ్లు పార్టీ కోసం టికెట్లు త్యాగం చేశారు. అనూరాధ అయితే ఆస్తులు అమ్ముకొని, కేసులకు తట్టుకొని పార్టీ అభ్యర్థిని గెలిపించారు. సునీతా ముదిరాజ్, సరితా యాదవ్, ఆకుల లలిత లాంటివాళ్లు ఉన్నారు. ‘ఆడబిడ్డగా వారికి న్యాయం చేయని మీరు తెలంగాణ కాంగ్రెస్‌ను ఇంకేం సంస్కరిస్తారు?’ అని మీనాక్షిని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు.
ఇక్కడో సందర్భాన్ని గుర్తుచేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని రాహుల్‌గాంధీ బాధపడ్డారు. 2022లో గోవా రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోనే ఉండాలని ప్రమా ణం చేయించారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్తే, హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక రాజ్యసభ సభ్యుడు బీజేపీలోకి వెళ్లినప్పుడు వారి ని డిస్క్వాలిఫై చేయాలని పోరాటం చేశారు. మణిపూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరితే ఇదే కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేసింది. అప్పుడే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ మూ డు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలకమైన తీర్పునిచ్చింది.
అంతెందుకు రాహుల్‌గాంధీ పార్లమెంటులో ఫిరాయింపుదార్లను నిరోధించి రాజ్యాంగస్ఫూర్తిని కాపాడుతామని రాజ్యాంగం పట్టుకొని ప్రకటించారు. రాహుల్‌గాంధీ ఆలోచనలకు భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. ఫిరాయింపుదార్లకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతునిచ్చి సుప్రీంకోర్టు బోనుదాక వెళ్లకుండా కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాహుల్‌గాంధీ రాజకీయ ఆంతరంగిక సభ్యురాలిగా ఆయన స్ఫూర్తిని ఆమె తెలంగాణలో కొనసాగిస్తారా? లేదా ఎప్పటిలాగే రాట్నం తిప్పి నూలు వడికే తన్మయంలో మునిగిపోయి, తనకు ధర్మసూక్ష్మమే శరణ్యం అంటారో?.. లేదా న్యాయశాస్త్ర సూక్ష్మధర్మ విజ్ఞతతో 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు కంటే ముందే అనర్హత వేటు వేయిస్తారో? ఆలోచించుకోవాలి.
రాహుల్‌గాంధీ పార్లమెంటులో ఫిరాయింపుదార్లను నిరోధించి రాజ్యాంగస్ఫూర్తిని కాపాడుతామని రాజ్యాంగం పట్టుకొని ప్రకటించారు. రాహుల్‌గాంధీ ఆలోచనలకు భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. ఫిరాయింపుదార్లకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతునిచ్చి సుప్రీంకోర్టు బోనుదాక వెళ్లకుండా కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాహుల్‌గాంధీ రాజకీయ ఆంతరంగిక సభ్యురాలిగా ఆయన స్ఫూర్తిని ఆమె తెలంగాణలో కొనసాగిస్తారా?