‘కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. ఇక నాకు పోరాడే బలం లేదు. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా’ అంటూ మీ (వినేశ్ ఫోగాట్) సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో మీరు చేసిన పోస్టును చూసి బరువెక్కిన హృదయంతో బాధపడుతున్న యావత్ భారతం మరింత భావోద్వేగ సాగరంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా.
వినేశ్ ఫోగాట్.. మీకు వినిపిస్తోందా? మన దేశ రాష్ట్రపతి, ప్రధాని, ప్రతిపక్ష నేతలతో మొదలు విభిన్న రంగాల్లోని ప్రముఖులు, సగటు భారతీయులు సహా అందరూ.. ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ దేశం మీ ప్రతిభ, పోరాటస్ఫూర్తిని కీర్తిస్తోంది. మీరు మా కోహినూర్ వజ్రం.
మీపై విధి ఎన్ని కత్తులు దూస్తేనేమి, కాలం మీ పట్ల మరీ ఇంత కఠినంగా వ్యవహరించడమేంటి? రెండు దశాబ్దాల మీ పట్టుదల, సంకల్పం ముందు ఒలింపిక్ పతక ప్రభావం మాకు చాలా చిన్నది. ఈ దేశంలో రెజ్లింగ్ క్రీడలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తూ నడిరోడ్డుపై మీరు చేసిన పోరు, విశ్వక్రీడా వేదికపై ఈ దేశాన్ని గెలిపించేందుకు మైదానంలో మీరు చేసిన పోరాటం రెండింటినీ మేం చూశాం. మీ ఆటకు సెల్యూట్ చేసి మా హృదయ సామ్రాజ్యాలలో మిమ్మల్ని అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టాం.
మా అందరికీ మీరే సూపర్ హీరో. వంద గ్రాముల అనర్హత గురించి మాకెందుకు? ఒలింపిక్స్ నిబంధనలు ఏం చెబితే మాకెందుకు? తొలి మ్యాచ్‌లోనే విశ్వ విజేతను మట్టి కరిపించి మా హృదయాలను మీరు గెలిచారు. ఇక పతకాలు.. కుట్రలు, కుతంత్రాలతో కూడిన పథకాల గోల మాకెందుకు? మండుతున్న మీ కన్నీటి సెగకు భయపడి ఓటమి ఏనాడో పారిపోయింది. మిమ్మల్ని ఓడించలేకే ఆటలో ఆడనీయకుండా వంద గ్రాముల అనర్హత పేరు చెబుతోంది!
విభిన్న భాషలు, రాజకీయ పార్టీలు, మతాలు, సంస్కృతుల సమ్మేళనంతో కూడిన 145 కోట్ల జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఘన చరిత్ర గల ఈ దేశంలో ఒలింపిక్స్ పోటీల్లో కనీసం డబుల్ డిజిట్ పతకాలు సాధించడానికి దశాబ్దాలుగా ఎంతగానో శ్రమిస్తున్నాం. అలాంటి దేశం తరఫున ఒక (అ)సాధారణ అమ్మాయి పురుషులకే ప్రత్యేకమైనదిగా భావించే రెజ్లింగ్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విజయం.
అసమానతలు, వివక్ష, అన్యాయాలపై అలుపెరగని పోరాటం చేస్తూ.. విమర్శలు, అవాంతరాలు, రాజకీయ కుతంత్రాలను ప్రతిఘటిస్తూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జాతీయ జెండాను రెపరెపలాడించడమే కాకుండా మూడుసార్లు ఒలింపిక్స్‌కు ప్రాతినిధ్యం వహించడం అసాధారణ విజయం. అదే మాకు బంగారంతో సమానం. టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్లో పోరాడి ఓడిన, రియో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్లో తీవ్రగాయాలతో నిలబడలేని స్థితిలో దేశానికి తిరిగొచ్చిన దృశ్యాలు ఇప్పటికీ మా కండ్లముందే కదలాడుతున్నాయి.
ఈ ఒలింపిక్స్‌లో మన దేశాన్ని గెలిపించడం కోసం 57 కేజీలు ఉండే మీరు 50 కేజీల విభాగంలో పోటీ పడేందుకు ఎంత కష్టపడ్డారో మీ ఆటను చూస్తే అర్థమైంది. అంచనాలు లేకుండా బరిలో దిగి ఛాంపియన్లకు చెక్ పెడుతూ ఫైనల్‌కు చేరడమంటే మాటలు కాదు. అందుకు శారీరక, మానసిక దృఢత్వం, సంసిద్ధత, దేశం పట్ల ఎనలేని అంకితభావం ఉండాలి. మీ శ్రమ ఎప్పటికీ వృథా కాదు. కాలం చేసే మాయాజాలంలో ఏమైనా జరగొచ్చు.
దాదాపు రెండు దశాబ్దాలుగా వివిధ ప్రైవేటు విద్యాసంస్థల్లో 6వ తరగతి నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల వరకు గణిత ఉపాధ్యాయుడిగా, భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా నేను సేవలందిస్తున్నాను. ఈ క్రమంలో వివిధ సందర్భాల్లో ఎంతోమంది మహనీయుల జీవితాల గురించి విద్యార్థులకు చెప్తూ వారికి స్ఫూర్తినిచ్చాను. ఐన్‌స్టీన్‌ను ఒకప్పుడు ఈ ప్రపంచం పిచ్చోడంది. విద్యుత్ బల్బు కనుగొనడం కోసం ఎడిసన్ చేసిన వందల ప్రయత్నాలను చూసి ప్రపంచం ఎగతాళి చేసింది.
అమ్మాయిలకు ఉన్నత చదువులు చదివేందుకు అర్హత లేదని చెప్పినా వినకుండా ముందుకుసాగిన మేడం క్యూరీ రెండు నోబెల్ బహుమతులను గెలిచింది. బక్కపలుచని గాంధీ మన దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చారు. అంతేకాదు, యావత్ ప్రపంచంపై అహింస ముద్ర వేశారు. వరల్డ్ కప్ అందుకోవడమే స్వప్నంగా క్రికెట్ ఆడిన సచిన్ 2003 ఫైనల్లో ఓడినప్పటికీ కుంగిపోలేదు. తిరిగి పుంజుకొని 2011లో ఇండియాను విశ్వ విజేతగా నిలిపారు. రేపటి నుంచి మీ జీవిత కథ కూడా గెలుపోటములకు అతీతంగా కోట్లాది మందికి ప్రేరణనిస్తుంది. మీరు పోరాటానికి పాట అయ్యారు. భవిష్యత్తు భారతానికి పాఠమయ్యారు.
వినేశ్.. వింటున్నారా..! ‘వినేశ్.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్వి. దేశానికి గర్వకారణం. ప్రతి భారతీయుడికీ స్ఫూర్తివి నువ్వు. ఈరోజు తగిలిన ఎదురుదెబ్బ బాధ కలిగించేదే. దీనివల్ల కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నా. అదే సమయంలో అడ్డంకులను అధిగమించే నీ సత్తా నాకు తెలుసు. సవాళ్లను స్వీకరించడమే నీ నైజం. తిరిగి బలం పుంజుకో. మేమందరం నీకు అండగా ఉన్నాం’.. మన ప్రధాని మోదీ మీకిచ్చిన సందేశమిది. ఇది ప్రధాని మాటే కాదు, ప్రతి భారతీయుడి హృదయ స్పందన.
వినేశ్.. మిమ్మల్ని చూసి ఈ దేశం గర్విస్తోంది. మీరంటే మాకు ఎనలేని గౌరవం. ఏమైనా జరగనీ.. మీకు మేము తోడుంటాం. మీ స్ఫూర్తితో మా జీవిత పోరాటంలో గెలుపోటములకు అతీతంగా ముందడుగేస్తాం. మాకు మీ ఫలితాల ద్వారా వచ్చే పతకాల కంటే మీ ప్రయాణపు ప్రకాశమే ఆదర్శం.
– ఫిజిక్స్ అరుణ్ కుమార్
93947 49536