ఒకవైపు కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకుండా అవమానించింది. మరోవైపు మంత్రి కుమార్తె నోటికొచ్చినట్టల్లా ఆరోపణల మీద ఆరోపణలు చేస్తున్నది. ఒక ముఖ్యమంత్రిపై ఇంత తీవ్రంగా దాడి జరుగుతుంటే అండగా నిలువాల్సిన పార్టీ పెద్దలు, సీనియర్ మంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఖండించలేదు.
గట్టిగా కష్టపడితే కొందరు జూనియర్ ఎమ్మెల్యేలు, ఓ ఇద్దరు ఎమ్మెల్సీలు వచ్చి నాలుగు మాటలని పోయారు. అమెరికా పర్యటన గురించి పార్టీ అధ్యక్షుడు కన్నడంలో ఒక నామమాత్రపు ఖండన చేసి ‘మమ’ అనిపించారు. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణపై జాతీయ మీడియాలో తీవ్రమైన చర్చ జరిగినా..జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధిష్ఠానం దీనిని పెద్ద ఇష్యూ చేయలేదు.
తెలంగాణలో ఆ విషయాన్ని పట్టించుకున్నవారే లేకుండా పోయారు. రేవంత్‌రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత తాను స్వయంగా సమావేశం ఏర్పాటు చేసి దీనిపై మాట్లాడాల్సి వచ్చింది. ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ముఖంలో తీవ్రమైన నిస్పృహ కనిపించింది. అసహనం గోచరించింది.
ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభించిన చాలాసేపటి తర్వాత కానీ ఉపముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి అక్కడికి రాలేదు. సర్దుబాటు చేసుకోక తప్పని స్థితి నెలకొన్నది. ఇంతా చేస్తే.. తన పర్యటన రద్దుకు ప్రధాని మోడీని బాధ్యుడిని చేస్తూ..మెత్తగా నిందించారే తప్ప, బీజేపీ రాష్ట్ర శాఖను ఒక్కమాట కూడా అనలేకపోయారు. దీనిని తెలంగాణకు జరిగిన అవమానంగా భావించి బీజేపీ ఎంపీ లు నిరసన గళం విప్పాలని ఒకమాట అని ఊరుకున్నారే తప్ప గట్టిగా విమర్శించకపోవడానికి కారణమేమిటో తెలియదు. అన్నింటికీ మించి కాంగ్రెస్ అధిష్ఠానం మీద, తన సహచరుల మీద ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది.
అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం సీఎంగానే కాకుండా తన వ్యక్తిగత ప్రతిష్ట మీద జాతీయస్థాయిలో తీవ్రమైన అవమానం జరిగిందని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంపై పార్టీ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఇతర సీనియర్ నాయకులు గానీ తీవ్రస్థాయిలో కేంద్రాన్ని నిలదీయకపోవడం కొరుకుడుపడని పరిస్థితి. దీనికి తోడు రాష్ట్రంలో మంత్రి కొండా సురేఖ ఉదంతం మరింత తీవ్రంగా ముఖ్యమంత్రి కుటుంబాన్ని రాష్ట్ర స్థాయిలో అవమానించినట్టయింది. సురేఖ కుమార్తె సుస్మిత రెండోసారి రేవంత్‌రెడ్డి మీద, ఆయన సోదరుల మీద నేరుగానే దాడి చేశారు.
సీఎం అయినంత మాత్రాన కండ్లు నెత్తికెక్కినయా..అంటూ మాట్లాడటం అనూహ్యమైన పరిణామం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో (బహుశా ఎన్టీయార్ మినహా) ఏ ముఖ్యమంత్రి కూడా ప్రత్యక్షంగా ఇంతటి తీవ్రమైన ఆరోపణలు.. అది కూడా క్యాబినెట్లో తమ సహచర మంత్రి కుటుంబం నుంచి ఎదుర్కొని ఉండకపోవచ్చు. ఇంత నేరుగా ఆరోపణలు చేసిన తర్వాత ఇంకా ఆ మంత్రి మీద, ఆమె కుటుంబం మీద ఎలాం టి చర్యలు తీసుకోకపోవడం సీఎంకు ఇబ్బందికరంగానే మారిందని భావించాలి. గతంలో అర్ధరాత్రి ఇంటి దగ్గరకు పోలీసులు వచ్చినప్పుడు కూడా సుస్మిత సీఎంను లక్ష్యంగా చేసుకొనే మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు. తాను అన్నది కాంగ్రెస్ పార్టీని కాదని..కేవలం ముఖ్యమంత్రిని మాత్రమేనని ఆమె సమర్థించుకుంటున్నారు.
సుస్మిత వ్యాఖ్యల తర్వాత 17 మంది ప్రజాప్రతినిధులు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసి మంత్రి సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే, ఆ సమావేశంలో సీనియర్ మంత్రులెవరూ లేకపోవడం, వారిలో ఎవరూ సురేఖకు వ్యతిరేకంగా స్పందించకపోవడం మీడియాలో చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రికి అండగా కేవలం 17 మంది మాత్రమే ఉన్నారా? అనే వరకూ విశ్లేషణలు జరిగాయి. అంత జరిగిన తర్వాత కూడా పీసీసీ అధ్యక్షుడు గానీ, సీనియర్ మంత్రులు గానీ ఈ విషయంపై కిమ్మనలేదు.
అంతా పార్టీ క్రమశిక్షణా సంఘం చూసుకుంటుందని దాటవేస్తూ వచ్చారు. చివరకు ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కూడా రేవంత్‌రెడ్డి మంత్రి కొండా సురేఖ విషయంపై ఒక్కమాట కూడా మాట్లాడలేదు. క్రమశిక్షణా సంఘమే చూసుకుంటుందని దాటవేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే మంత్రి కొండా సురేఖ బెంగళూరు వెళ్లి ఓ గంటసేపు పార్టీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి వచ్చారు. అక్కడ ఆమె సంజాయిషీ ఇచ్చి వచ్చారని కొందరు..ఇంకేదైనా మాట్లాడి వచ్చారా? అని మరికొందరు గుసగుసలాడుతున్నారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ డ్రైవర్‌ను అరెస్టు చేయడం, ఆమె మంత్రిత్వ శాఖలో డిప్యుటేషన్లు ఆమెకు తెలియకుండానే రద్దు చేయడం వంటి చెదురుమదురు ఘటనలు జరిగాయి తప్ప, అధిష్ఠానం మంత్రి మీద, ఆమె కుమార్తె మీద ఎలాంటి చర్యలకు ఇప్పటివరకైతే పూనుకోలేదు.
సుస్మిత ఇలా వ్యాఖ్యానించడం మొదటిసారంటే పొరపాటు అని భావించవచ్చు. కానీ, రెండోసారి, అదీ తీవ్రంగా విమర్శించడం. ఇంత జరిగాక కూడా సురేఖ సీఎంను కాదని పార్టీలో తన ఆధిక్యతను కొనసాగిస్తున్నారా? ముఖ్యమంత్రికి అండగా సీనియర్ మంత్రులెవరూ నిలబడకపోవడానికి కారణాలు ఏమిటి? ఇవన్నీ రాజకీయ వర్గాలను మల్లగుల్లాలు పడేలా చేస్తున్నాయి.
ఇప్పుడు కొండా సురేఖపై వేటు వేస్తే ఆమె మంత్రి పదవికే కాకుండా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే ఆరు నెలల్లో ఎన్నికలు రావచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో వరంగల్‌లో ఎన్నికలంటే అది బీఆర్ఎస్ గెలుపునకు అలవోకగా అవకాశమిచ్చినట్లు అవుతుంది. ఈ వాతావరణం కాంగ్రెస్‌కు తీవ్రంగా ప్రతికూలంగా పరిణమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ సురేఖను క్యాబినెట్లో కొనసాగనిస్తే..అది ముఖ్యమంత్రికి పార్టీ మీద, క్యాబినెట్ మీద, ప్రభుత్వం మీద పట్టు లేదన్న సంకేతాలు జనంలోకి వెళ్తాయి.
సీఎం బలహీనుడవుతున్నాడన్న భావన క్రమంగా పెరుగుతుంది. ఇది ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ రెండింటి మధ్యన సీఎం ఎలా వ్యవహరిస్తారన్నది ప్రస్తుతానికి జవాబులేని ప్రశ్నే. అధిష్ఠానం ఇటు రేవంత్‌రెడ్డికి పూర్తి స్వేచ్ఛనివ్వకుండా, అండగా నిలువకుండా అటు కేంద్రాన్ని నిలదీయకుండా, ఇటు పార్టీలో అసమ్మతులను ప్రోత్సహిస్తుంటే.. సీఎం తదుపరి వ్యూహం ఎలా ఉంటుందన్నది గమనార్హం. మూడు రంగుల జెండా పాట వినిపిస్తుందా లేదా పాట మారుతుందా? అనేది వేచిచూడాలి.
-కోవెల సంతోష్ కుమార్